దేశవ్యాప్తంగా ఎయిర్‌టెల్ 5జీ సేవలు

దేశీయ అతిపెద్ద టెలికాం సంస్థల్లో ఒకటైన భారతీ ఎయిర్‌టెల్, కొత్తగా మరో కొన్ని నగరాలకు తన 5జీ సర్వీసులను విస్తరించినట్లు ప్రకటించింది. ఈశాన్య రాష్ట్రాల్లోని నగరాలు అయిన కోహిమా, దిమాపూర్, ఐజ్వాల్, గ్యాంగ్ టక్, సిల్చార్, దిబ్రూగఢ్, తిన్సుకియాలో ఎయిర్‌టెల్ 5జీ ప్లస్ సర్వీసులను ప్రారంభించినట్లు కంపెనీ తెలిపింది. ప్రస్తుతం ఈశాన్య ప్రాంతంలోని అన్ని రాష్ట్రాల్లో తమ 5జీ సర్వీసులు అందుబాటులో ఉన్నాయని, ప్రస్తుతం అందుబాటులో ఉన్న 4జీ డేటా ప్లాన్ల తోనే 5జీ సర్వీసులను ఆస్వాదించవచ్చునని […]

Share:

దేశీయ అతిపెద్ద టెలికాం సంస్థల్లో ఒకటైన భారతీ ఎయిర్‌టెల్, కొత్తగా మరో కొన్ని నగరాలకు తన 5జీ సర్వీసులను విస్తరించినట్లు ప్రకటించింది.

ఈశాన్య రాష్ట్రాల్లోని నగరాలు అయిన కోహిమా, దిమాపూర్, ఐజ్వాల్, గ్యాంగ్ టక్, సిల్చార్, దిబ్రూగఢ్, తిన్సుకియాలో ఎయిర్‌టెల్ 5జీ ప్లస్ సర్వీసులను ప్రారంభించినట్లు కంపెనీ తెలిపింది. ప్రస్తుతం ఈశాన్య ప్రాంతంలోని అన్ని రాష్ట్రాల్లో తమ 5జీ సర్వీసులు అందుబాటులో ఉన్నాయని, ప్రస్తుతం అందుబాటులో ఉన్న 4జీ డేటా ప్లాన్ల తోనే 5జీ సర్వీసులను ఆస్వాదించవచ్చునని కంపెనీ తెలిపింది. ఇప్పటికే గౌహతి, షిల్లాంగ్, ఇంఫాల్, అగర్తలా, ఇటానగర్ వంటి ఈశాన్య రాష్ట్రాల్లోని నగరాల్లో ఎయిర్‌‌టెల్ 5జీ ప్లస్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి.

కొత్తగా 5జీ నెట్ వర్క్‌‌ను ప్రారంభించిన నగరాల్లోని ఎయిర్‌‌టెల్ వినియోగదారులు ఇప్పుడు అల్ట్రా ఫాస్ట్ నెట్‌‌వర్క్‌ను ఆస్వాదించవచ్చునని, కొత్తగా ప్రారంభించిన 5జీ నెట్‌‌వర్క్ ప్రస్తుత 4జీ వేగం కంటే 20 నుంచి 30 రెట్లు వేగంగా ఉంటుందని భారతీ ఎయిర్ టెల్ అస్సాం, ఈశాన్య రాష్ట్రాల సీఈఓ రజనీష్ వర్మ తెలిపారు. 5జీ సపోర్ట్ కలిగిన స్మార్ట్ ఫోన్లను వినియోగించే ఎయిర్ టెల్ వినియోగదారులు అధిక స్పీడ్ కలిగిన ఎయిర్ టెల్ 5జీ ప్లస్ నెట్‌‌వర్క్‌ను ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా ఆస్వాదించవచ్చునని వర్మ తెలిపారు.

ఎయిర్‌‌టెల్ 5జీ ప్లస్ సర్వీసులు దశలవారీగా దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయని, త్వరలోనే దేశంలోని అన్ని నగరాల్లో తన 5జీ సర్వీసులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఎయిర్‌‌టెల్ తెలిపింది. ప్రస్తుతం 5జీ సర్వీసులు అందుబాటులో ఉన్న నగరాలకు చెందిన ఎయిర్‌‌టెల్ వినియోగదారులు తమ ప్రస్తుత 4జీ సిమ్ కార్డును మార్చాల్సిన అవసరం లేకుండా అదే సిమ్‌‌తో 5జీ సర్వీసులను పొందవచ్చునని వర్మ తెలిపారు.

టెలికాం సంస్థలైన రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌‌టెల్ గత ఏడాది దేశవ్యాప్తంగా 5జీ సర్వీసులను ప్రారంభించాయి. పైలెట్ ప్రాజెక్ట్‌‌లో భాగంగా రెండు టెలికాం సంస్థలు మొదటగా దేశంలోని ప్రధాన నగరాల్లో 5జీ సర్వీసులను ప్రారంభించాయి. అనంతరం మిగిలిన నగరాలలో ఒక్కో నగరంలో 5జీ సర్వీసులను ప్రారంభిస్తూ వస్తున్నాయి. ముందుగా టైర్-1 నగరాల్లో పూర్తిగా 5జీ సర్వీసులను ప్రారంభించి, అనంతరం టైర్-2 నగరకు విస్తరించాలని టెలికాం సంస్థలు భావిస్తున్నాయి. ఇది కూడా పూర్తి అయ్యాక దేశ వ్యాప్తంగా ప్రతి గ్రామంలో 5జీ సర్వీసులను అందించనున్నాయి.

ప్రస్తుతం ఈ సిటీల్లో ఎయిర్‌టెల్ 5జీ ప్లస్ అందుబాటులో ఉంది

హైదరాబాద్, విశాఖపట్నం, ఢిల్లీ, ముంబై, గువహటి, పట్నా, అహ్మదాబాద్, గురుగ్రామ్, పానిపట్, సిమ్లా, జమ్మూ, శ్రీనగర్, బెంగళూరు, పూణే, నాగ్‍పూర్, ఇండోర్, ఇంపాల్, చెన్నై, వారణాసి, లక్నో, సిలిగుడి, హిసార్, రోహ్‍తక్, గాంధీనగర్, భోపాల్‍లో ప్రస్తుతం ఎయిర్‌టెల్ 5జీ ప్లస్ నెట్‍వర్క్ అందుబాటులో ఉంది.

గతేడాది నవంబర్‌లో 5జీ నెట్‍వర్క్‌ను ఎయిర్‌టెల్ ప్రారంభించింది. ముందుగా 8 నగరాల్లో లాంచ్ చేసింది. క్రమంగా విస్తరిస్తూ, ప్రస్తుతం 25 నగరాల్లో అందుబాటులోకి తెచ్చింది. వచ్చే ఏడాది మార్చి కల్లా దేశంలోని అన్ని ప్రాంతాలకు 5జీ సర్వీస్‍ను అందుబాటులోకి తేవాలని ప్రణాళిక రచించుకుంది.

ఇప్పటి వరకు 5జీ కోసం ఎయిర్‌టెల్ ప్రత్యేక ప్లాన్‍లను ప్రవేశపెట్టలేదు. 4జీ ప్లాన్‍లతోనే 5జీ నెట్‍వర్క్‌ను వాడుకోవచ్చు. అలాగే యూజర్లు.. 5జీ కోసం ప్రత్యేకంగా సిమ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. 4జీ సిమ్ 5జీ నెట్‍వర్క్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. అయితే, 5జీ సపోర్ట్ ఉండే ఫోన్ ఉండాలి. ఇప్పటికే చాలా మొబైల్ తయారీ సంస్థలు 5జీని ఎనేబుల్ చేసే అప్‍డేట్‍లను కూడా 5జీ మొబైళ్లకు ఇచ్చాయి.