WPL: హర్మన్ సుడిలాలి ఇన్సింగ్స్

WPL ఇనాగురల్ ఎడిషన్ మొదలైంది. మొదటి మ్యాచులో హర్మన్ ప్రీత్ నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ వుమెన్స్ – గుజరాత్ జెయింట్స్ వుమెన్స్ మధ్య పోరు జరిగింది. ఈ మ్యాచులో టాస్ ఓడి మొదట బ్యాటింగ్​కు దిగిన ముంబై.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 207 పరుగుల భారీ స్కోర్ చేసింది. 208 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్.. ముంబైకి కనీస పోటీని కూడా ఇవ్వలేకపోయింది. అదరగొట్టిన కియారా, కృతి మ్యాచ్‌‌కి ముందు […]

Share:

WPL ఇనాగురల్ ఎడిషన్ మొదలైంది. మొదటి మ్యాచులో హర్మన్ ప్రీత్ నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ వుమెన్స్ – గుజరాత్ జెయింట్స్ వుమెన్స్ మధ్య పోరు జరిగింది. ఈ మ్యాచులో టాస్ ఓడి మొదట బ్యాటింగ్​కు దిగిన ముంబై.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 207 పరుగుల భారీ స్కోర్ చేసింది. 208 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్.. ముంబైకి కనీస పోటీని కూడా ఇవ్వలేకపోయింది.

అదరగొట్టిన కియారా, కృతి

మ్యాచ్‌‌కి ముందు బాలీవుడ్ తారలు కియారా అద్వానీ, కృతి సనన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ ఆరంభ వేడుకల్లో వీరు తమ స్టెప్పులతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. అంతే కాకుండా ఐదు జట్ల కెప్టెన్లు WPL ట్రోఫీని ఆవిష్కరించారు. వీరితో పాటు బీసీసీఐ కార్యదర్శి జైషా కూడా ఆ ఈవెంట్​లో పాల్గొన్నాడు. కియారా ఎంట్రీ మాత్రం అదిరిపోయిందంటూ పలువురు నెటిజన్లు ఆమెను మెచ్చుకుంటున్నారు. ప్రేక్షకులకు ఏ మాత్రం వినోదం తగ్గకుండా ఉండేలా బీసీసీఐ ప్లాన్ చేసింది. పురుషుల ఐపీఎల్​కు ఏ మాత్రం తీసిపోకుండా WPLను రూపొందించిన బోర్డు.. అందుకు తగ్గట్లుగానే ఏర్పాట్లు చేసింది. ఆరంభ మ్యాచులోనే 200+ స్కోరు నమోదు కావడంతో.. అంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అచ్చం ఆరంభ ఐపీఎల్లో కూడా ఇలాగే జరిగిందంటూ గుర్తు చేసుకుంటున్నారు.

అప్పుడు మెక్ కల్లమ్.. ఇప్పుడు హర్మన్

2008లో జరిగిన ఇనాగురల్ ఐపీఎల్ మొదటి మ్యాచులోనే టీ20 అంటే ఏంటో చూపిస్తూ 200+ స్కోర్​ నమోదైంది. ఆనాడు కోల్​కతా నైట్​రైడర్స్ – బెంగళూరు రాయల్ చాలెంజర్స్ మధ్య మ్యాచ్ జరగ్గా.. కోల్​కతా ఆటగాడు బ్రెండన్ మెక్​ కల్లమ్ వీరవిహారం చేశాడు. బెంగళూరు బౌలర్లకు చుక్కలు చూపిస్తూ 153 పరుగుల భారీ స్కోర్ నమోదు చేశాడు. ఆనాడు మెక్ సుడిగాలి ఇన్సింగ్స్ చూసిన క్రికెట్ అభిమానులు.. WPL ఇనాగురల్ ఎడిషన్​లో కూడా హర్మన్ ప్రీత్ వీరవిహారం చూసి తెగ ఖుషీ అవుతున్నారు. ఐపీఎల్ ఎంతటి హిట్టయిందో WPL కూడా అలాగే హిట్ అవుతుందంటూ జోస్యం చెబుతున్నారు. చేధనకు దిగిన బెంగళూరు ఆనాడు 82 పరుగులకే కుప్పకూలింది. అచ్చం WPL మొదటి మ్యాచులో కూడా గుజరాత్ జెయింట్స్ 208 పరుగుల లక్ష్యంతో చేధనకు దిగి.. కేవలం 15.1 ఓవర్లలో 64 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఆనాడు బెంగళూరు కనీసం 82 పరుగులైనా చేసింది కానీ, నేడు గుజరాత్ ఆ స్కోరు కూడా చేయలేదే అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.

మురిసిన ముంబై

ఆరంభ మ్యాచ్​లోనే హర్మన్ ప్రీత్ కౌర్ సారధ్యంలోని ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. ముంబై ఇండియన్స్ 143 పరుగుల తేడాతో గుజరాత్ జెయింట్స్ ను ఓడించి ఆల్‌రౌండ్ షోతో తమ ఆధిక్యాన్ని చాటుకుంది, ముంబై కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కేవలం 30 బంతుల్లోనే 14 బౌండరీలతో 65 పరుగులు చేసింది. దీంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 207/5 భారీ స్కోరును నమోదు చేసింది. అనంతరం భారీ లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన గుజరాత్ జెయింట్స్​ను సైకా ఇషాక్ (4/11) నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ బౌలర్లు.. కేవలం 64/9 పరుగులకే పరిమితం చేశారు. వీరి ధాటికి గుజరాత్ జెయింట్స్ 15.1 ఓవర్లు మాత్రమే ఆడగల్గింది. గుజరాత్ జెయింట్స్ కెప్టెన్ బెత్ మూనీ మొదటి ఓవర్‌లో గాయంతో రిటైర్డ్ హార్ట్​గా వెనుదిరిగింది. దీంతో ఆమె మళ్లీ బ్యాటింగ్‌కు రాలేకపోయింది. ముంబై ఇండియన్స్ మొదటి నుంచి గుజరాత్ జెయింట్స్ పై ఆధిపత్యం చెలాయించింది. మొదటి గేమ్‌లోనే బ్యాట్, బాల్‌తో తమ దూకుడైన ఆటతీరును ప్రదర్శించి.. ముంబై ఫ్యాన్స్‌‌ని, ప్రాంచైజీని ఆనందపరిచింది. ముంబై ఇండియన్స్ కెప్టెన్ కౌర్ WPL మొట్టమొదటి హాఫ్ సెంచరీని అద్భుతమైన స్ట్రోక్‌ప్లేతో నమోదు చేసింది. హేలీ మాథ్యూస్ ఆరంభాన్ని అందించిన తర్వాత న్యూజిలాండ్‌కు చెందిన అమేలియా కెర్ (24 బంతుల్లో 45 నాటౌట్, 6×4, 1×6)తో కలిసి కేవలం 42 బంతుల్లో 89 పరుగులు జోడించిందీ బ్యాటర్. కౌర్ ఇన్నింగ్స్ తన జట్టు భారీ స్కోర్ చేసేలా చేసింది. ప్రత్యర్థి బౌలర్లకు కౌర్ అసలు ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. కానీ ముందు నుంచీ దూకుడుగా ఆడిన వెస్టిండీస్ బ్యాటర్ మాథ్యూస్ టోర్నమెంట్‌లో మొదటి అర్ధ శతకం నమోదు చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ, అలా జరగలేదు. దురదృష్టవశాత్తు కేవలం మూడు పరుగుల తేడాతో మ్యాథ్యూస్ వెనుదిరిగింది. మాథ్యూస్ 4 సిక్సర్లు, 3 ఫోర్లతో 31 బంతుల్లో 47 పరుగులు చేసింది. నాట్ స్కివర్ – బ్రంట్‌తో కలిసి రెండవ వికెట్‌కు 54 పరుగులు జోడించింది.

గుజరాత్ టపటపా

20 ఓవర్లలో 208 పరుగులు చేయాల్సిన తరుణంలో.. బ్యాటింగ్​కు దిగిన గుజరాత్ జట్టుకు తొలుతే పెద్ద షాక్ తగిలింది. రెచ్చిపోతుందనకున్న కెప్టెన్ బెత్ మూనీ తొలి ఓవర్లోనే గాయపడి.. రిటైర్డ్ హార్ట్​గా వెనుదిరిగింది. గేమ్ తొలి అర్ధభాగంలో ముంబై బ్యాటర్లు కొట్టిన దెబ్బకే గుజరాత్ విలవిల్లాడిందంటే.. ఇక చేజింగ్ మొదలైన తర్వాత షాక్​ల మీద షాక్​లు తగలడం ఆరంభమైంది. దాంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది. మొదటి ఓవర్‌లోనే గుజరాత్ జెయింట్స్ కెప్టెన్ జట్టులో అత్యుత్తమ బ్యాటర్ మూనీ తన మూడవ బంతిని ఎదుర్కొన్న తర్వాత రిటైర్డ్ హార్ట్​గా వెనుదిరిగింది. చివరి డెలివరీకి మరో బ్యాటర్ పెవిలియన్ చేరింది. దీంతో ఇక కోలుకోవడం జెయింట్స్​కు చాలా కష్టమైంది. ఇంగ్లండ్ ప్లేయర్ మూడో ఓవర్‌లో గుజరాత్ జెయింట్స్ ను మరింత దెబ్బతీసింది. ఈసారి ఓపెనింగ్ బ్యాటర్ సబ్బినేని మేఘనా (2)ను పెవిలియన్​కు చేర్చింది.  ఇక వీరు మాత్రమే కాదు.. గుజరాత్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి.. కేవలం 15.1 ఓవర్లలోనే ప్యాక్ అయింది.