ప్రపంచకప్‌ షెడ్యూల్ మారుతుందా?

క్రికెట్‌ అంటే మన దేశంలో కేవలం ఒక ఆట కాదు.. మతం. కేవలం అభిమానులు మాత్రమే ఉండరు.. భక్తులే ఉంటారు. భారతీయులు అంతలా ప్రేమిస్తారు క్రికెట్‌ను. రెండు నెలల కిందటే ఐపీఎల్‌ ముగిసింది. మరో రెండు నెలల్లో మన దేశంలో క్రికెట్ పండుగ ప్రారంభం కాబోతోంది. వన్డే ప్రపంచకప్‌నకు ఇండియా ప్రాతినిధ్యం వహించబోతోంది. దేశవ్యాప్తంగా పలు స్టేడియాల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోనూ పలు మ్యాచ్‌లు జరగనున్నాయి. షెడ్యూల్‌ను మార్చాలంటూ బీసీసీఐని హెచ్‌సీఏ కోరడం ఇప్పుడు […]

Share:

క్రికెట్‌ అంటే మన దేశంలో కేవలం ఒక ఆట కాదు.. మతం. కేవలం అభిమానులు మాత్రమే ఉండరు.. భక్తులే ఉంటారు. భారతీయులు అంతలా ప్రేమిస్తారు క్రికెట్‌ను. రెండు నెలల కిందటే ఐపీఎల్‌ ముగిసింది. మరో రెండు నెలల్లో మన దేశంలో క్రికెట్ పండుగ ప్రారంభం కాబోతోంది. వన్డే ప్రపంచకప్‌నకు ఇండియా ప్రాతినిధ్యం వహించబోతోంది. దేశవ్యాప్తంగా పలు స్టేడియాల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోనూ పలు మ్యాచ్‌లు జరగనున్నాయి. షెడ్యూల్‌ను మార్చాలంటూ బీసీసీఐని హెచ్‌సీఏ కోరడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. 

వరుసగా రెండు మ్యాచ్‌లు

మన దేశంలో జరిగే వరల్డ్‌కప్ షెడ్యూల్‌ను ఐసీసీ అనుమతితో బీసీసీఐ ఒకసారి మార్చింది. ఈ నెల 25 నుంచి టికెట్ల విక్రయం కూడా ప్రారంభం కానుంది. హైదరాబాద్‌ ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఏర్పాట్లు జోరుగా సాగుతున్న ఈ సమయంలో షెడ్యూల్‌ను మార్చాలంటూ బీసీసీఐ (భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్)ని హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) కోరింది. అక్టోబర్ 9న న్యూజిలాండ్ వర్సెస్ నెదర్లాండ్స్, 10న పాకిస్థాన్ వర్సెస్ శ్రీలంక మ్యాచ్‌లు ఉప్పల్ స్టేడియంలో జరగాల్సి ఉంది. కానీ వరుసగా రెండు మ్యాచ్‌లు నిర్వహించడం ఇబ్బంది అవుతుందని, మ్యాచ్‌ల మధ్య కనీసం ఒకరోజు విరామం ఉండేలా చూడాలని బీసీసీఐని హెచ్‌సీఏ కోరింది. రెండు మ్యాచ్‌ల మధ్య ఎలాంటి గ్యాప్‌ లేకపోవడంతో హైదరాబాద్‌ పోలీసులు భద్రతా పరమైన ఆందోళనను వ్యక్తం చేసినట్లు తెలిపింది. హైదరాబాద్‌లో జరిగేది పాకిస్థాన్ మ్యాచ్ కావడంతో మరింత పటిష్ట చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని చెప్పినట్లు సమాచారం. 

షెడ్యూల్ మార్చే అవకాశమే లేదు

ప్రపంచకప్‌ షెడ్యూల్‌లో ఇప్పటికే బీసీసీఐ పలు మార్పులు చేసింది. 9 మ్యాచ్‌లను రీ షెడ్యూల్ చేసింది. ఈ నేపథ్యంలో ఇకపై మార్పులు ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఇదే విషయాన్ని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా కూడా స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో జరిగే ప్రపంచకప్ మ్యాచ్‌ల షెడ్యూల్ మార్చే ఆస్కారం లేదని తెలిపారు. నిజానికి హైదరాబాద్‌లో జరగాల్సిన పాక్, శ్రీలంక మ్యాచ్‌ను తొలుత అక్టోబర్ 12న షెడ్యూల్ చేశారు. అయితే అక్టోబర్ 15న అహ్మదాబాద్‌లో జరగాల్సిన భారత్, పాక్ మ్యాచ్‌ను 14 వ తేదీకి మార్చారు. ఈ క్రమంలో ఈ మ్యాచ్‌కు పాకిస్థాన్‌కు తగినంత సమయం ఉండాలన్న కారణంతో హైదరాబాద్‌లో శ్రీలంకతో జరగాల్సిన మ్యాచ్‌ను అక్టోబర్‌‌ 10వ తేదీకి రీషెడ్యూల్ చేశారు. 

టీమిండియా మ్యాచ్‌లు కేటాయించకున్నా

వరల్డ్‌కప్‌లో భాగంగా హైదరాబాద్‌లో జరిగే మ్యాచ్‌లలో పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. టీమిండియా ఆడే ఒక్క మ్యాచ్‌ను కూడా కేటాయించలేదు. కేవలం పాకిస్థాన్ వర్సెస్ శ్రీలంక, న్యూజిలాండ్ వర్సెస్ నెదర్లాండ్స్ మ్యాచ్‌ను మాత్రమే షెడ్యూల్ చేశారు. కనీసం వీటినీ సరిగ్గా షెడ్యూల్ చేయలేదు. వరుసగా రెండో రోజుల్లో నిర్వహించడం వల్ల ట్రాఫిక్, భద్రత తదితర సమస్యలు ఎదురుకానున్నాయి. అభిమానులకు గ్యాప్ దొరకదు. దీంతో క్రికెట్ అభిమానులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. 

అక్టోబర్ 8 నుంచి మన పోరు

అక్టోబర్ 5 వ తేదీ నుంచి నవంబర్ 19 దాకా నెలన్నర పాటు వరల్డ్‌కప్‌ కొనసాగనుంది. అన్ని మ్యాచ్‌లు మన దేశంలోనే సాగనున్నాయి. 5న ఇంగ్లండ్ వర్సెస్‌ న్యూజిలాండ్ మ్యాచ్‌తో సిరీస్ మొదలుకానుంది. టీమిండియా 8న తొలి మ్యాచ్‌ ఆడనుంది. పటిష్ఠ ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది. తర్వాత అక్టోబర్11న (ఆఫ్గనిస్తాన్), 14న (పాకిస్థాన్), 19న (బంగ్లాదేశ్), 22న (న్యూజిలాండ్), 29న (ఇంగ్లాండ్), నవంబర్ 2న (శ్రీలంక), నవంబర్ 5న (సౌతాఫ్రికా), నవంబర్ 12 (నెదర్లాండ్స్)న చివరి లీగ్ మ్యాచ్‌ ఆడనుంది.