8 వికెట్లు కోల్పోయినప్పటికీ పాకిస్థాన్ ఎందుకు ఆల్ అవుట్ అయింది..?

పాకిస్థాన్‌ను టీమ్‌ఇండియా చిత్తు చేసింది. రెండు రోజులపాటు సాగిన మ్యాచ్‌లో ఫలితం భారత్‌కు అనుకూలంగా వచ్చింది. ఆసియా కప్‌ 2023 సూపర్ -4లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో పాక్‌పై భారత్‌ 228 పరుగుల తేడాతో  ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా 356/2 స్కోరు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో పాకిస్థాన్‌ 32 ఓవర్లలో 128/8 స్కోరు వద్ద ఉన్నప్పుడు.. చివరి బ్యాటర్లు బ్యాటింగ్‌కు రాకపోవడంతో ఆలౌట్‌గా పరిగణించడం జరిగింది. కుల్‌దీప్‌ యాదవ్‌ (5/25) […]

Share:

పాకిస్థాన్‌ను టీమ్‌ఇండియా చిత్తు చేసింది. రెండు రోజులపాటు సాగిన మ్యాచ్‌లో ఫలితం భారత్‌కు అనుకూలంగా వచ్చింది. ఆసియా కప్‌ 2023 సూపర్ -4లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో పాక్‌పై భారత్‌ 228 పరుగుల తేడాతో  ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా 356/2 స్కోరు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో పాకిస్థాన్‌ 32 ఓవర్లలో 128/8 స్కోరు వద్ద ఉన్నప్పుడు.. చివరి బ్యాటర్లు బ్యాటింగ్‌కు రాకపోవడంతో ఆలౌట్‌గా పరిగణించడం జరిగింది. కుల్‌దీప్‌ యాదవ్‌ (5/25) ఐదు వికెట్ల ప్రదర్శనతో అదరగొట్టాడు.

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు శుభ్‌మన్‌ గిల్ (58), రోహిత్ శర్మ (56) అర్ధశతకాలతో అదరగొట్టే ఆరంభం ఇచ్చారు. అయితే, రిజర్వ్‌డేకు వచ్చిన మ్యాచ్‌లో అభిమానులను ఆనందపరుస్తూ కేఎల్ రాహుల్ (111*), విరాట్ కోహ్లీ (122*) సెంచరీలతో అలరించారు. సూపర్‌ ఇన్నింగ్‌తో చెలరేగిన విరాట్‌ కోహ్లీకి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు వచ్చింది. ఈ విజయంతో సూపర్ -4 పాయింట్ల పట్టికలో భారత్ అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. మంగళవారమే శ్రీలంకతో ఇదే స్టేడియంలో మరో పోరుకు భారత్‌ సిద్ధం కావాల్సి ఉంది. 

కుదురుకోనీయని బౌలర్లు

భారత్ నిర్దేశించిన 357 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్‌ను బుమ్రా ఆదిలోనే దెబ్బకొట్టాడు. ఇమామ్‌ (9*) వికెట్‌ తీసిన బోణీ కొట్టిన భారత్.. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లను ఎక్కువగా క్రీజ్‌లో కుదురుకోనీయలేదు. ఏ దశలోనూ లక్ష్యం దిశగా పాక్‌ ఇన్నింగ్స్ సాగలేదు. అయితే ఫఖర్ జమాన్ (27), అఘా సల్మాన్ (23), ఇఫ్తికార్‌ అహ్మద్ (23) కాస్త పరుగులు చేశారు. లేకపోతే పాక్ పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. దీని కారణం మాత్రం కుల్‌దీప్‌ యాదవ్‌ (5/25). పాండ్య, బుమ్రా, ఠాకూర్‌తో కలిసి పాక్‌ టాప్ ఆర్డర్ భరతం పట్టాడు.

అసలు ఏమైంది..? 

ఆదివారం భారత్ – పాకిస్తాన్ మధ్య తొలి రోజు  ఆటలో హరీస్ రౌఫ్ ఆడాడు. కానీ వర్షం కారణంగా  సోమవారానికి వాయిదా పడిన మ్యాచ్‌లో అతడు డగౌట్‌కే పరిమితమయ్యాడు. కడుపులో మంటతో పాటు పొట్ట కండరాల నొప్పితో బాధపడుతున్న హరీస్..  నిన్న బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్ కూ రాలేదు.  అతడు శ్రీలంకతో ఈనెల 14న జరిగే మ్యాచ్‌కు కూడా అందుబాటులో ఉండడని తెలుస్తున్నది. ఇక నిన్నటి మ్యాచ్‌లో 9.2 ఓవర్లు బౌలింగ్ చేసిన నసీమ్ షా  కూడా ఆఖరి ఓవర్‌కు ముందు గ్రౌండ్‌ను వీడాడు.  భుజం నొప్పితో  అతడు మైదానం విడిచి పెవిలియన్‌కు  చేరాడు.  హరీస్ రౌఫ్‌తో పాటు నసీమ్ షా కూడా బ్యాటింగ్‌కు రాలేదు.   

ఈ ఇద్దరితో పాటు  మిడిలార్డర్ బ్యాటర్ అఘా సల్మాన్  పరిస్థితి కూడా ఇలాగే ఉంది.  నిన్న మ్యాచ్‌‌లో రవీంద్ర జడేజా వేసిన ఓవర్‌లో  స్వీప్ చేయబోయిన సల్మాన్‌ బ్యాట్‌కు తాకిన బంతి బలంగా వచ్చి అతడి ముఖానికి తగిలింది. దీంతో  అతడికి ముక్కు,  కుడి కన్ను మధ్య భాగంలో గాయమైంది.   గాయంతోనే అతడు ఆట కొనసాగించాడు. కానీ నిన్న రాత్రి అతడికి స్కాన్ చేయించినట్టు సమాచారం. సల్మాన్ తదుపరి మ్యాచ్‌లో ఆడేది లేనిది అనుమానంగానే ఉంది. 

అందుకే ఆడించలేదా..? 

భారత్‌‌తో మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు రాకపోవడంతో హరీస్ రౌఫ్, నసీమ్ షా‌లకు  ఏమైంది..?  అని పాక్ అభిమానులు ఆందోళన పడ్డారు. అయితే వచ్చేనెలలో జరుగబోయే వన్డే వరల్డ్ కప్ దృష్ట్యానే ముందు జాగ్రత్తగా హరీస్, నసీమ్‌లను బ్యాటింగ్‌కు పంపకుండా ఉన్నట్టు తెలుస్తున్నది.  బౌలింగ్‌లో పాకిస్తాన్‌కు ఈ ఇద్దరూ కీలకం.  మిడిలార్డర్‌లో అఘా సల్మాన్ కూడా కీలక ఆటగాడే. దీంతో ఈ ముగ్గురినీ శ్రీలంకతో మ్యాచ్‌లో రెస్ట్ ఇవ్వడమే బెటర్ అన్న అభిప్రాయంలో పాకిస్తాన్ మేనేజ్మెంట్  ఉంది.  హరీస్, నసీమ్‌లు  శ్రీలంకతో మ్యాచ్‌తో పాటు ఒకవేళ పాక్ ఫైనల్‌కు అర్హత సాధిస్తే ఆ మ్యాచ్‌లో కూడా  ఆడే అవకాశం లేకపోవడంతో  పీసీబీ.. పేసర్ షహన్వాజ్ దహానీ,  జమాన్ ఖాన్‌లను  ఆగమేఘాల మీద  శ్రీలంకకు పిలిచింది.  ఆసియా కప్‌లో పాకిస్తాన్.. ఈనెల 14న శ్రీలంకతో ఆడుతుంది.