వయాకామ్‌18 కి బీసీసీఐ మీడియా రైట్స్..!

భారత క్రికెట్‌ నియంత్రణ మండలి మీడియా హక్కులను వ్యాపార దిగ్గజం ముకేశ్‌ అంబానీకి చెందిన వయాకామ్‌ 18 కంపెనీ దక్కించుకుంది. ఈ సంస్థ రానున్న ఐదేళ్లలో (2023 సెప్టెంబర్‌ నుంచి 2028 మార్చి) టీమిండియా స్వదేశంలో ఆడే మ్యాచ్‌ల టీవీ ప్రసార హక్కులతో పాటు డిజిటల్‌ హక్కులను కూడా సొంతం చేసుకుంది.  భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) గురువారం నిర్వహించిన ఇ–వేలం (ఆన్‌లైన్‌)లో స్వదేశంలో జరిగే అంతర్జాతీయ, జాతీయ మ్యాచ్‌ల్ని ప్రత్యక్ష ప్రసారం చేసుకొనే మీడియా […]

Share:

భారత క్రికెట్‌ నియంత్రణ మండలి మీడియా హక్కులను వ్యాపార దిగ్గజం ముకేశ్‌ అంబానీకి చెందిన వయాకామ్‌ 18 కంపెనీ దక్కించుకుంది. ఈ సంస్థ రానున్న ఐదేళ్లలో (2023 సెప్టెంబర్‌ నుంచి 2028 మార్చి) టీమిండియా స్వదేశంలో ఆడే మ్యాచ్‌ల టీవీ ప్రసార హక్కులతో పాటు డిజిటల్‌ హక్కులను కూడా సొంతం చేసుకుంది. 

భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) గురువారం నిర్వహించిన ఇ–వేలం (ఆన్‌లైన్‌)లో స్వదేశంలో జరిగే అంతర్జాతీయ, జాతీయ మ్యాచ్‌ల్ని ప్రత్యక్ష ప్రసారం చేసుకొనే మీడియా హక్కుల్ని ‘వయాకామ్‌ 18’ దక్కించుకుంది. 2023–28 ఈ ఐదేళ్ల కాలానికి గాను సుమారు రూ. 6,000 కోట్లు చెల్లించేందుకు బిడ్‌ గెలిచింది. డిస్నీప్లస్‌ స్టార్, సోనీ నెట్‌వర్క్‌లతో ముక్కోణపు పోటీలో పాల్గొన్న వయాకామ్‌ 18… టీవీ, డిజిటల్‌ రైట్స్‌ కోసం అత్యధికంగా రూ.5,963 కోట్లు (720.60 మిలియన్‌ డాలర్లు)తో బిడ్‌ దాఖలు  చేసింది. 

దీంతో పోటీ ప్రసార సంస్థలకు రిలయన్స్‌ చేతిలో చుక్కెదురైంది. మీడియా రైట్స్‌లో టెలివిజన్, డిజిటల్‌ (ఓటీటీ యాప్స్‌) హక్కులున్నాయి. ఈ రెండింటి కోసం వేర్వేరు బిడ్‌లను స్వీకరించారు. టీవీ హక్కులకు రూ.2,862 కోట్లు (345.90 మిలియన్‌ డాలర్లు), డిజిటల్‌ హక్కులకు రూ.3,101 కోట్లు (374.70 మిలియన్‌ డాలర్లు) చెల్లించేందుకు వయాకామ్‌ 18 బిడ్‌లు వేసింది. 

గత 2018–23 కాలానికి ‘స్టార్‌ నెట్‌వర్క్‌’ రూ. 6,138 కోట్లు చెల్లించింది. అయితే గత ఐదేళ్లలో  సొంతగడ్డపై భారత్‌ 102 మ్యాచ్‌లు ఆడింది. కానీ వచ్చే ఐదేళ్లలో 88 మ్యాచ్‌లే ఆడబోతోంది. గత మీడియా హక్కులతో పోలిస్తే ఇది 12.92 శాతం ఎక్కువ.  అప్పుడు మ్యాచ్‌కు రూ. 60 కోట్లు చెల్లించారు. ఇకపై మ్యాచ్‌కు రూ.67.75 కోట్లు చెల్లించాలి. క్రితంసారి మూడు విభాగాల్లో బిడ్‌లను స్వీకరించారు. 

భారత ఉపఖండపు టీవీ రైట్స్‌–రెస్టాఫ్‌ వరల్డ్‌ డిజిటల్‌ రైట్స్, భారత ఉపఖండపు డిజిటల్‌ రైట్స్, గ్లోబల్‌ కన్సాలిడేటెడ్‌ రైట్స్‌గా వర్గీకరించారు. కానీ ఇప్పుడు అవుట్‌ రైట్‌గా టీవీ రైట్స్, డిజిటల్‌ రైట్స్‌ అని రెండు రకాల గ్లోబల్‌ రైట్స్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఈ నెల 22 నుంచి భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరిగే సిరీస్‌తో 2023–28 సైకిల్‌ మొదలవుతుంది. 

ఈ ఐదేళ్లలో టీమిండియా 25 టెస్టులు, 27 వన్డేలు, 36 టి20లు కలిపి మొత్తంగా 88 మ్యాచ్‌లు ఆడనుంది. ఆస్ట్రేలియాతో 21 మ్యాచ్‌లు, ఇంగ్లండ్‌తో 18 మ్యాచ్‌లు, కివీస్‌తో 11 మ్యాచ్‌లు, దక్షిణాఫ్రికాతో 10 మ్యాచ్‌ల్లో తలపడుతుంది. ‘వయాకామ్‌ 18’కు స్పోర్ట్స్‌ హక్కులు కొత్తేం కాదు. ఇంతకుముందే ఐపీఎల్‌ డిజిటల్‌ హక్కుల్ని పొందింది. 

మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌), పారిస్‌ ఒలింపిక్స్, దక్షిణాఫ్రికా మ్యాచ్‌ లు, దక్షిణాఫ్రికా లీగ్, టి10 లీగ్‌ (అమెరికా), రోడ్‌సేఫ్టీ వరల్డ్‌ సిరీస్, ఎన్‌బీఏ, డైమండ్‌ లీగ్‌ తదితర ప్రపంచవ్యాప్త క్రీడల హక్కుల్ని కైవసం చేసుకుంది. ‘వయాకామ్‌ 18’ మీడియాలోని స్పోర్ట్స్‌ 18 టీవీ చానెల్‌లో, డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌కు సంబంధించి జియో సినిమా యాప్‌లో క్రికెట్‌ మ్యాచ్‌లు ప్రసారం అవుతాయి. రిలయన్స్‌ గ్రూప్‌ మీడియా హక్కులు దక్కించుకోవడంతో ‘స్టార్‌ స్పోర్ట్స్‌’కు శుభం కార్డు పడినట్లయింది. 2012 నుంచి ఇప్పటివరకు అంటే 11 ఏళ్లుగా భారత్‌లో జరిగిన అంతర్జాతీయ, జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌లు డిస్నీ ప్లస్‌ స్టార్‌ నెట్‌వర్క్‌లోనే ప్రసారమయ్యాయి. ఐపీఎల్‌ మ్యాచ్‌ల టీవీ ప్రసార హక్కులు మాత్రం ‘స్టార్‌ స్పోర్ట్స్‌’ వద్దే ఉన్నాయి.