శ్రీలంక‌కు గ‌ట్టి ఎదురుదెబ్బ‌…!

ఆసియా కప్ 2023 ఫైనల్‌కు ముందు శ్రీలంక జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు కీలక స్పిన్నర్ మహీశ్ తీక్షణ గాయంతో ఈ మ్యాచుకు దూరమయ్యాడు. పాకిస్థాన్‌తో మ్యాచు సందర్భంగా ఫీల్డింగ్ చేస్తూ తీక్షణ గాయపడ్డాడు. తీక్షణ అందుబాటులో ఉండడని శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రకటించింది. అతడి స్థానంలో సహన్‌ అరాచిగేను జట్టులోకి తీసుకున్నట్లు వెల్లడించింది. టీమిండియాతో ఆసియా కప్ 2023 ఫైనల్‌కి శ్రీలంక క్రికెట్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు కీలక స్పిన్నర్ మహీశ్ […]

Share:

ఆసియా కప్ 2023 ఫైనల్‌కు ముందు శ్రీలంక జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు కీలక స్పిన్నర్ మహీశ్ తీక్షణ గాయంతో ఈ మ్యాచుకు దూరమయ్యాడు. పాకిస్థాన్‌తో మ్యాచు సందర్భంగా ఫీల్డింగ్ చేస్తూ తీక్షణ గాయపడ్డాడు. తీక్షణ అందుబాటులో ఉండడని శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రకటించింది. అతడి స్థానంలో సహన్‌ అరాచిగేను జట్టులోకి తీసుకున్నట్లు వెల్లడించింది.

టీమిండియాతో ఆసియా కప్ 2023 ఫైనల్‌కి శ్రీలంక క్రికెట్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు కీలక స్పిన్నర్ మహీశ్ తీక్షణ గాయం కారణంగా దూరమయ్యాడు. ఆసియా కప్‌-2023 సూపర్‌-4లో పాకిస్థాన్‌తో మ్యాచు సందర్భంగా ఫీల్డింగ్ చేస్తూ తీక్షణ గాయపడ్డాడు. మ్యాచులో తొడ కండరాలు పట్టేసినా బౌలింగ్‌ కొనసాగించి తన స్పెల్‌ పూర్తి చేశాడు తీక్షణ. ఓ వికెట్ కూడా పడగొట్టాడు. తీక్షణ గాయంపై మ్యాచు అనంతరం స్కానింగ్ తీయించగా.. గాయం తీవ్రమైనదిగా తేలినట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు వెల్లడించింది. ఫలితంగా అతడు ఆసియా కప్‌-2023 ఫైనల్‌కు దూరమైనట్లు తెలిపింది. మహీశ్‌ తీక్షణ స్థానంలో సహన్‌ అరాచిగేను రీప్లేస్ చేసినట్లు పేర్కొంది. తీక్షణకు తమ వైద్య బృందం పర్యవేక్షణలో చికిత్స అందించనున్నట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు వెల్లడించింది.

తీక్షణ స్థానంలో జట్టులోకి వచ్చిన 27 ఏళ్ల సహన్‌ అరాచిగే.. బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌. లెఫ్టాండ్‌ బ్యాటర్‌ అయిన అతడు.. రైట్‌ ఆర్మ్‌ ఆఫ్‌బ్రేక్‌ బౌలింగ్ కూడా చేయగలడు‌. జింబాబ్వేలో వన్డే వరల్డ్‌కప్‌-2023 క్వాలిఫయర్స్‌ సందర్భంగా వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. ఆసియా కప్‌కు ముందే శ్రీలంక జట్టులోని కీలక ప్లేయర్లు గాయంతో దూరమయ్యారు. స్టార్ ఆల్ రౌండర్ వానిండు హసరంగతో పాటు దుష్మంత చమీర, మధుశనక, లాహిరు కుమార ఆసియా కప్‌లో ఆడలేదు. తాజాగా తీక్షణ సైతం గాయపడ్డాడు. మొత్తంగా ప్రస్తుతం శ్రీలంక జట్టులోని ఐదుగురు బౌలర్లు గాయాలతో ఇబ్బంది పడుతున్నారు.

స్పిన్‌కు అనుకూలిస్తున్న కొలంబోలోని ప్రేమదాస మైదానంలోనే ఆదివారం టీమ్ఇండియాతో ఫైనల్‌లో శ్రీలంక అమీతుమీ తేల్చుకోనుంది. ఈ సమయంలో కీలక స్పిన్నర్‌ అయిన తీక్షణ గాయపడటం లంక జ‌ట్టుకు పెద్ద షాక్ అని చెప్ప‌వ‌చ్చు. ఆసియా కప్‌ 2023లో తీక్ష‌ణ‌ 8 వికెట్లు తీశాడు. ఈ ఏడాది శ్రీలంక త‌రుపున అత్య‌ధిక వికెట్లు తీసిన ఆట‌గాడు అత‌డే కావ‌డం గ‌మ‌నార్హం. 15 మ్యాచుల్లో 31 వికెట్లు ప‌డ‌గొట్టాడు. అయితే.. తీక్ష‌ణ ప్ర‌పంచ‌క‌ప్ వ‌ర‌కు కోలుకుంటాడా లేదా అన్న‌ది ఇప్పుడే చెప్ప‌లేమ‌ని అంటున్నారు. అత‌డు కోలుకోకుంటే భార‌త్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న ప్ర‌పంచ‌క‌ప్‌లో శ్రీలంక క‌ష్టాలు ఎదుర్కోక త‌ప్ప‌దు. అక్టోబ‌ర్ 5 నుంచి వ‌న్డే ప్ర‌పంచ క‌ప్ ఆరంభం కానుంది. శ్రీలంక జ‌ట్టు సెప్టెంబ‌ర్ 29న బంగ్లాదేశ్‌, అక్టోబ‌ర్ 3న అఫ్గానిస్తాన్‌తో మ్యాచులు ఆడ‌నుంది. ఇక మెగా టోర్నీలో లంక‌ త‌న తొలి మ్యాచ్‌ను అక్టోబ‌ర్ 7న ద‌క్షిణాఫ్రికాతో ఆడ‌నుంది.

ఇక ఆసియా కప్ 2023లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన శ్రీలంక.. ఓ దశలో లీగ్ దశ నుంచే ఇంటి బాట పట్టేలా కనిపించింది. అఫ్గనిస్థాన్‌తో జరిగిన డూ ఆర్ డై మ్యాచులో గెలిచి సూపర్-4 చేరింది. సూపర్-4లో పాకిస్థాన్, బంగ్లాదేశ్‌ను ఓడించి ఫైనల్‌కు చేరింది. సూపర్-4లో భారత్‌తో జరిగిన మ్యాచులో మాత్రం ఓడిపోయింది.

తొలుత భారత్‌ను 213 పరుగులకే పరిమితం చేసింది. కానీ స్వల్ప స్కోరును ఛేదించలేక చతికిలపడింది. 172 పరుగులకే ఆలౌట్ అయి.. 41 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇక ఆదివారం జరగనున్న ఫైనల్‌లో గెలిచి.. ట్రోఫీని వరుసగా రెండో ఏడాది సొంతం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. ఫైనల్ మ్యాచు కోసం భారత్ కూడా తుది జట్టులో భారీ మార్పులు చేయనుంది. దాదాపు 5 మార్పులతో టీమిండియా ఫైనల్ మ్యాచ్ ఆడే అకాశం ఉంది. అక్షర్ పటేల్ గాయపడటంతో వాషింగ్టన్ సుందర్‌ను ఇండియా నుంచి శ్రీలంకకు రప్పించింది. కొలంబో వేదికగా మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచు ప్రారంభం కానుంది.