ఐపీఎల్ మినీ వేలంలో రికార్డులు బద్దలు కొట్టిన మిచెల్ స్టార్క్!

IPL 2024 mini Auction: ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్ ను రూ. 24.75 కోట్ల ధరకు కోల్‌కతా నైట్‌రైడర్స్‌కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా మిచెల్ స్టార్క్ చరిత్ర సృష్టించాడు.

Courtesy: x

Share:

దుబాయ్‌ వేదికగా ప్రారంభమైన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్(IPL) మినీ వేలంలో రికార్డులు బద్దలయ్యాయి. ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్ ను రూ. 24.75 కోట్ల ధరకు కోల్‌కతా నైట్‌రైడర్స్‌కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా మిచెల్ స్టార్క్ చరిత్ర సృష్టించాడు. 16 ఏళ్ల ఐపీఎల్(IPL) చరిత్రలో ఇప్పటి వరకూ ఏ ఆటగాడు రూ.20 కోట్లకు పైగా ధర పలకలేదు. కాగా, అంతకు ముందే ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ రూ.20.50 కోట్లకు కొనుగోలు చేసింది. ప్రస్తుత వేలంలో మొత్తం 10 ఫ్రాంచైజీలు 77 స్లాట్‌ల కోసం పోటీపడుతున్నాయి. ఇందులో 30 వరకు విదేశీ ఆటగాళ్ల స్లాట్‌లు ఉన్నాయి. 

ఆసీస్‌ స్టార్‌ పేసర్‌ మిచెల్ స్టార్క్‌ ఆల్‌టైమ్‌ రికార్డు సృష్టించాడు. రూ. 2 కోట్లతో బరిలోకి దిగిన స్టార్క్‌ కోసం ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. గుజరాత్‌ టైటాన్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మధ్య తీవ్ర పోటీ జరిగింది. చివరికి కోల్‌కతా నైట్‌రైడర్స్ రూ. 24.75  కోట్లకు దక్కించుకుంది. దీంతో ప్యాట్‌ కమిన్స్‌ రూ. 20.5 కోట్ల రికార్డును స్టార్క్‌ అధిగమించాడు.

ఐపీఎల్‌ చరిత్రలో ప్యాట్ కమిన్స్‌(Pat Cummins) కూడా రికార్డు సృష్టించాడు. రూ. 20.5 కోట్ల ధరకు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఈ ఆటగాడిని సొంతం చేసుకుంది. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, హైదరాబాద్‌ మధ్య తీవ్ర పోటీ జరిగింది. కాగా, వేలంలో కమిన్స్‌ కనీస ధర రూ. 2 కోట్లుగా ఉంది.

ఇంగ్లాండ్‌ పేస్‌ ఆల్‌రౌండర్‌ క్రిస్‌ వోక్స్‌ బేస్‌ ప్రైస్‌ రూ. 2 కోట్లు ఉండగా.. ఇతడిని పంజాబ్ జట్టు రూ. 4.2 కోట్లతో సొంతం చేసుకుంది. డారిల్‌ మిచెల్‌ ను చెన్నై సూపర్‌ కింగ్స్‌  సొంతం చేసుకుంది. రూ. 14 కోట్లు పెట్టి చెన్నై జట్టు మిచెల్ ను దక్కించుకుంది. ఇతడి కోసం పంజాబ్‌ కింగ్స్ చివరి వరకూ పోటీ పడింది. 

భారత పేసర్ హర్షల్‌ పటేల్‌కు రూ. 11.75 కోట్లు దక్కాయి. రూ.2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చాడు. గుజరాత్‌ టైటాన్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ తీవ్రంగా పోటీ పడ్డాయి. చివరికి పంజాబ్‌ కింగ్స్‌ సొంతం చేసుకుంది. దక్షిణాఫ్రికా పేసర్ గెరాల్డ్‌ కోయిట్జీని ముంబయి సొంతం చేసుకుంది. రూ. 5 కోట్లను దక్కించుకున్నాడు. రూ. 50 లక్షలతో వేలంలోకి వచ్చాడు.