BCCI సంస్థను నాశనం చేయడానికి ఒక్క అవినీతిపరుడు చాలు

టికెటింగ్, షెడ్యూల్ విషయంలో బీసీసీఐపై విమర్శలు చేస్తున్న మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. అవినీతి మరక లేని సంస్థ ప్రతిష్టను నాశనం చేయడానికి ఒక్క అవినీతి, అహంకారపూరితమైన వ్యక్తి ఉంటే చాలని ఆరోపించాడు. అయితే ఎవరి పేరునూ నేరుగా అతడు ప్రస్తావంచకపోవడం గమనార్హం. మరో నెల నుంచి మన దేశంలో క్రికెట్ సంబరం మొదలు కానుంది. అభిమానులు ఎదురుచూస్తున్న వన్డే ప్రపంచకప్‌ దేశవ్యాప్తంగా పలు వేదికలపై జరగనుంది. ఇప్పటికే టికెట్లు అందుబాటులో […]

Share:

టికెటింగ్, షెడ్యూల్ విషయంలో బీసీసీఐపై విమర్శలు చేస్తున్న మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. అవినీతి మరక లేని సంస్థ ప్రతిష్టను నాశనం చేయడానికి ఒక్క అవినీతి, అహంకారపూరితమైన వ్యక్తి ఉంటే చాలని ఆరోపించాడు. అయితే ఎవరి పేరునూ నేరుగా అతడు ప్రస్తావంచకపోవడం గమనార్హం.

మరో నెల నుంచి మన దేశంలో క్రికెట్ సంబరం మొదలు కానుంది. అభిమానులు ఎదురుచూస్తున్న వన్డే ప్రపంచకప్‌ దేశవ్యాప్తంగా పలు వేదికలపై జరగనుంది. ఇప్పటికే టికెట్లు అందుబాటులో ఉంచడం, అవి హాట్‌కేకుల్లో అమ్ముడుపోవడం కొన్ని గంటల్లోనే జరిగిపోయింది. అయితే టికెట్ల విషయంలో, వరల్డ్‌కప్ మ్యాచ్‌ల రీషెడ్యూల్ విషయంలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్ చేసిన సంచలన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. 

ఎవరినీ పర్సనల్‌గా అనలేదు

వెంకటేశ్ ప్రసాద్ ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో ఉంటున్నాడు. కొన్ని రోజుల కిందట కేఎల్ రాహుల్ ఫామ్, ఫిట్‌నెస్‌పై విమర్శలు చేశాడు. ఆసియా కప్‌లో భారత్–పాక్‌ సూపర్‌‌4 మ్యాచ్‌కు వానతో అడ్డంకులు ఎదురుకావడంపై తాజాగా తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఒకే ఒక్క అవినీతిపరుడు మంచి వ్యవస్థ, సంస్థను నాశనం చేయవచ్చు. అతడి నాయకత్వంలో అవినీతిమయమైన సంస్థగా ముద్రపడటం సహజం . ఏ రంగంలోనైనా పై స్థాయి నుంచి దిగువ స్థాయి వరకు ఇలాంటివి జరుగుతాయి” అని ఆరోపించాడు. కానీ కాసేపటికే ఈ ట్వీట్‌ను డెలీట్ చేశాడు. తర్వాత దీనికి వివరణ ఇస్తూ మరో ట్వీట్‌ చేశాడు. ‘‘అవినీతి మరక లేని సంస్థ ఔన్నత్యాన్ని, కృషిని, పరపతిని నాశనం చేయడానికి ఒక్క అవినీతి, అహంకారపూరితమైన వ్యక్తి ఉంటే చాలు. వ్యవస్థ ప్రతిష్ఠను నాశనం చేస్తాడు. ఇది కేవలం సూక్ష్మ స్థాయిలోనే కాదు.. మరింత కింది స్థాయికీ చేరుతుంది. రాజకీయాలు క్రీడలు జర్నలిజం, కార్పొరేట్‌లో ఇదే వాస్తవ పరిస్థితి” అని ట్వీట్ చేశాడు.   

అయితే వెంకటేశ్‌ ప్రసాద్ ఎవరిని ఉద్దేశించి ట్వీట్ చేశారనేది మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఈ వివాదంపై పీటీఐ వార్తా సంస్థతో వెంకటేశ్ ప్రసాద్ మాట్లాడుతూ.. ఎవరినీ పర్సనల్‌గా ఉద్దేశించి అనలేదని, ఇది కేవలం అబ్జర్వేషన్ మాత్రమనని స్పష్టం చేశాడు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకుంటున్నారని, అన్ని రంగాల్లో ఉన్న పరిస్థితుల గురించే తాను ట్వీట్ చేశానని చెప్పుకొచ్చాడు. ఎయిర్‌‌లైన్ పరిశ్రమ, బ్యాంకింగ్ పరిశ్రమలోనూ ఉన్నాయని, ఐపీఎల్ ఫ్రాంచైజీలు నిషేధానికి కూడా గురయ్యాయని గుర్తుచేశాడు. ‘‘నా ఇతర ట్వీట్లలో టికెట్ల అంశం గురించి స్పష్టంగానే చెప్పాను. మ్యాచ్‌ల టికెట్లు, షెడ్యూల్ గురించి బీసీసీఐపై నా విమర్శలు స్పష్టంగానే ఉన్నాయి” అని తెలిపాడు. 

పరిశీలన మాత్రమే

తనకు ఏ పదవినీ ఇవ్వలేదన్న కారణంతోనే బీసీసీఐపై కోపంగా ఉన్నారని, అందుకే ఆరోపణలు చేస్తున్నారన్న ప్రచారంపై వెంకటేశ్ ప్రసాద్ స్పందించాడు. ‘‘అలాంటిదేమీ లేదు. నిజానికి నాకు కొన్ని పదవులను ఆఫర్ చేశారు. కానీ నేను వాటిని స్వీకరించేందుకు సిద్ధంగా లేకపోవడంతో తిరస్కరించాను” అని క్లారిటీ ఇచ్చాడు. సంస్థ గురించి అందరూ ఏం మాట్లాడుకుంటున్నారనే దాన్నే తాను లేవనెత్తుతున్నానని స్పష్టం చేశాడు. ‘‘ఇందులో వ్యక్తిగతంగా తీసుకోవడానికేమీ లేదు. ఇది కేవలం స్పష్టమైన పరిశీలన మాత్రమే. టికెటింగ్ విషయంలో ఫ్యాన్స్, విదేశాల్లోని స్నేహితులు సహా చాలా మంది అభ్యంతరాలు వ్యక్తం చేశారు” అని చెప్పాడు.

ఇదే సమయంలో బీసీసీఐ ఎన్నో మంచి పనులు చేసిందని వెంకటేశ్ ప్రసాద్  చెప్పుకొచ్చాడు. ‘‘బీసీసీఐ చేసిన ఎన్నో మంచి పనులు ఉన్నాయి. పురుషులు, మహిళా ప్లేయర్లకు సమానంగా జీతాలు ఇస్తున్నారు. అయితే వరల్డ్‌కప్ టికెటింగ్, షెడ్యూల్ వ్యవహారాన్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేదని నేను అనుకుంటున్నా. చాలా మంది అభిమానులు బాధపడ్డారు” అని చెప్పాడు.