ISPL క్రికెట్ లోకి రామ్ చరణ్.. హైదరాబాద్ జట్టు కొనుగోలు చేసిన చెర్రీ

ISPL : చెర్రీ తాజాగా ఓ క్రికెట్ లీగ్ ఫ్రాంచైజీని కొనుగోలు చేశాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్‌(ISPL)లో హైదరాబాద్ క్రికెట్ జట్టును కొనుగోలు చేశారు.

Courtesy: x

Share:

హైదరాబాద్: RRR సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఇప్పుడు మరో రంగంలో తన సత్తా చాటబోతున్నాడు. చెర్రీ తాజాగా ఓ క్రికెట్ లీగ్ ఫ్రాంచైజీని కొనుగోలు చేశాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్‌(ISPL)లో హైదరాబాద్ క్రికెట్ జట్టును కొనుగోలు చేశారు. ఈ విషయాన్ని రామ్ చరణ్ స్వయంగా తన ఎక్స్ (ట్విటర్) వేదికగా ప్రకటించాడు. "టాలెంట్ ఉన్న యువ క్రికెటర్లను ప్రోత్సహించడానికి, సమాజ స్ఫూర్తిని పెంపొందించడానికి, గల్లీ క్రికెట్‌ సంస్కృతిని సెలబ్రేట్ చేసుకోవడానికి ఈ లీగ్ ఉపయోగపడుతుంది. ఐఎస్‌పీఎల్‌లో హైదరాబాద్ జట్టును మెరుగుపరుస్తూ చిరస్మరణీయ క్షణాలను ఆస్వాదించడానికి నాతో భాగం పంచుకోండి" అని రామ్ చరణ్ పేర్కొన్నాడు.

అసలు ఈ ISPL అంటే ఏమిటి?
ఐఎస్‌పీఎల్ అంటే ఐపీఎల్ కాదు. ఇదొక గల్లీ క్రికెట్ లీగ్. గల్లీ క్రికెటర్లలోని ప్రతిభను వెలికితీసేందుకు ఈ లీగ్ ఉపయోగపడనుంది. టీ10 ఫార్మాట్లో జరిగే టెన్నిస్ క్రికెట్ లీగ్ ఇది. మన దేశంలోని ప్రతిభావంతమైన స్థానిక క్రికెటర్లను వెలుగులోకి తీసుకు వచ్చేందుకు ఈ మినీ క్రికెట్ లీగ్  దోహదపడుతుంది. ఈ లీగ్ ద్వారా టాలెంట్ ఉన్న యువ క్రికెటర్లను వెలికి తీసి భవిష్యత్తులో ఉన్నతంగా రాణించేందుకు ప్రోత్సహించనున్నారు. అదే సమయంలో నగరాల్లో ఆటకు సంబంధించిన సదుపాయాలను మెరుగుపరుస్తారు. 2024 మార్చి 2 నుంచి 9వ తేదీ వరకు ఐఎస్‌పీఎల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. మన దేశంలోని అన్ని రాష్ట్రాల క్రికెటర్స్ ఈ లీగ్ సెలక్షన్స్‌లో పాల్గొనొచ్చు. www.ispl-t10.com వెబ్‌సైట్‌లోకి లాగిన్ కావడం ద్వారా ఈ లీగ్‌లో మీ పేరును రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇందులో మీ పేరు, ఫోన్ నంబర్, ఈ మెయిల్ ఐడీ తదితర వివరాలు నమోదు చేసి రూ.1179 చెల్లించడం ద్వారా మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. గల్లీ క్రికెట్‌కు, స్టేడియంలో జరిగే ప్రొఫెషనల్ ఆటకు మధ్య ఉన్న గ్యాప్ పూడ్చేందుకు ఐఎస్‌పీఎల్ కట్టుబడి ఉందని వెబ్‌సైట్‌లో వెల్లడించారు. 

చెర్రీ పోస్టర్ కూడా విడుదల:
చెర్రీ తాను కొనుగోలు చేసిన టీంకు సంబంధించి పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. పోస్టర్ లో చార్మినార్ ముందు చరణ్ ఫోజ్ ఇస్తున్నట్లు ఫోటోతో ఈ ప్రకటనను  రిలీజ్ చేశారు. ఈ మేరకు ఆసక్తి ఉన్న ఆటగాళ్లు  రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. ప్రస్తుతం రామ్ చరణ్ చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతుంది. ఈ అద్భుతమైన లీగ్ లో నాతోపాటు ఉండేందుకు నాతో చేరండి అంటూ పోస్ట్ చేశారు చరణ్.

ఐఎస్‌పీఎల్‌లో హైదరాబాద్ జట్టుకు రామ్ చరణ్ యజమాని కాగా, ముంబై జట్టుకు బిగ్ బీ అమితాబ్ బచ్చన్, శ్రీనగర్ జట్టుకు అక్షయ్ కుమార్, బెంగళూరు జట్టుకు హృతిక్ రోషన్ యజమానులు కావడం విశేషం.