14 ఫోర్లు, 4 సిక్సర్లు.. సౌతాఫ్రికాపై KL Rahul అద్భుత ఇన్నింగ్స్!

KL Rahul: సౌతాఫ్రికాతో జరుగుతున్న టెస్టు మ్యాచులో టీమిండియా వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ అరుదైన ఘనత సాధించాడు. సెంచూరియన్‌ వేదికగా బుధవారం శతకం సాధించాడు.

Courtesy: Top Indian News

Share:

సౌతాఫ్రికాతో జరుగుతున్న టెస్టు మ్యాచులో టీమిండియా వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ అరుదైన ఘనత సాధించాడు. సెంచూరియన్‌ వేదికగా బుధవారం శతకం సాధించాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న టెస్టులో తొలి రోజు 70 పరుగులు చేసిన రాహుల్‌, రెండో రోజు ఫోర్లు, సిక్సర్లతో విజృంభించి సెంచరీ పూర్తి చేశాడు. టెస్టులలో రాహుల్‌కు ఇది 8వ సెంచరీ కావడం విశేషం. గెరాల్డ్‌ కోయెట్జ్‌ వేసిన ఓవర్లో భారీ సిక్సర్‌ బాది సెంచరీ సాధించాడు. గత డిసెంబర్‌లో సెంచూరియన్‌ వేదికగా జరిగిన టెస్టులో సఫారీలపై రాహుల్ 260 బంతుల్లో 123 పరుగులు చేశాడు. సెంచూరియన్‌లో అత్యధిక సెంచరీలు చేసిన పర్యాటక జట్టు బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు.

భారత్‌ తరఫున ఆడుతూ సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్‌ దేశాలపై సెంచరీలు చేసిన రెండో వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌గా రాహుల్‌ రికార్డులకెక్కాడు. ఈ జాబితాలో తొలి స్థానంలో రిషభ్‌ పంత్‌ ఉన్నాడు. రాహుల్‌ తన కెరీర్‌లో మొత్తంగా 17 సెంచరీలు చేయగా.. అందులో ఓవర్సీస్‌లో చేసినవే 13 కావడం గమనార్హం. అతడి కెరీర్‌లో మూడు ఫార్మాట్లలోనూ సాధించిన శతకాలన్నీ విదేశాల్లోనే సాధించాడు.

రాహుల్ కు మాజీ క్రికెటర్ల ప్రశంసలు
భారత మాజీ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్‌కు ఫిదా అయిపోయాడు. బౌలర్లకు పూర్తిగా అనుకూలిస్తున్న సెంచూరియన్‌ పిచ్‌పై రాహుల్‌ అద్భుతమైన షాట్లతో అలరించాడని పేర్కొన్నాడు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశాడు. ‘‘ లాఫ్టెడ్‌ డ్రైవ్‌లు, దూకుడైన పుల్‌షాట్లు, గోడకట్టినట్లున్న డిఫెన్స్‌, స్టేబుల్ గా రాహుల్‌ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. జట్టుకు అవసరమైన సమయంలో అసాధారణ ఆటతీరును కనబర్చాడు’’ అని పఠాన్ పేర్కొన్నాడు. ఓపెనర్‌గా కేఎల్‌ రాహుల్‌కు ఉన్న అనుభవం అమూల్యమైందని టీమ్‌ ఇండియా మాజీ బ్యాటర్‌ సంజయ్‌ బంగర్‌ అభివర్ణించాడు.

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్‌ రెండో రోజు భారత్‌ 245 పరుగులకు తొలి ఇన్నింగ్స్‌ను ముగించింది. 92 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయినప్పుడు రాహుల్‌ బ్యాటింగ్‌కు దిగాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతడు 137 బంతుల్లో 101 పరుగులు చేశాడు. వీటిల్లో 14 ఫోర్లు, నాలుగు సిక్స్‌లు ఉన్నాయి. పదో వికెట్‌గా అతడు వెనుదిరిగాడు.