నం.1 టెన్నిస్ ఆటగాడిగా ఉన్నప్పటికీ మద్దతు లేదు

భారతదేశపు అగ్రశ్రేణి పురుషుల సింగిల్స్ టెన్నిస్ ఆటగాడు సుమిత్ నాగల్ ఆర్థికంగా ఆరోగ్యంగా లేడని వెల్లడించాడు. నం.1 టెన్నిస్ ప్లేయర్‌గా ఉన్నప్పటికీ తనకు తగిన మద్దతు లభించడం లేదని సుమిత్ నాగల్ తెలిపాడు. ఏటీపీ టూర్ల‌లో కొనసాగడానికి ఒక కోటి రూపాయల జీవనాధార బడ్జెట్‌ను ఖ‌ర్చు చేసిన తర్వాత అతని బ్యాంకు ఖాతాలో రూ.ల‌క్ష కంటే త‌క్కువ మొత్తమే ఉంద‌ని, ఛాంపియన్ ప్లేయర్ అయిన తాను మంచి జీవితాన్ని గ‌డ‌ప‌డం లేద‌ని చెప్పాడు. నాగ‌ల్ గ‌త కొన్నాళ్లుగా […]

Share:

భారతదేశపు అగ్రశ్రేణి పురుషుల సింగిల్స్ టెన్నిస్ ఆటగాడు సుమిత్ నాగల్ ఆర్థికంగా ఆరోగ్యంగా లేడని వెల్లడించాడు. నం.1 టెన్నిస్ ప్లేయర్‌గా ఉన్నప్పటికీ తనకు తగిన మద్దతు లభించడం లేదని సుమిత్ నాగల్ తెలిపాడు. ఏటీపీ టూర్ల‌లో కొనసాగడానికి ఒక కోటి రూపాయల జీవనాధార బడ్జెట్‌ను ఖ‌ర్చు చేసిన తర్వాత అతని బ్యాంకు ఖాతాలో రూ.ల‌క్ష కంటే త‌క్కువ మొత్తమే ఉంద‌ని, ఛాంపియన్ ప్లేయర్ అయిన తాను మంచి జీవితాన్ని గ‌డ‌ప‌డం లేద‌ని చెప్పాడు.

నాగ‌ల్ గ‌త కొన్నాళ్లుగా జ‌ర్మ‌నీలోని నాన్సెల్ టెన్నిస్ అకాడమీలో శిక్ష‌ణ పొందుతున్నాడు. అయితే.. ఆర్థిక ఇబ్బందుల కార‌ణంగా ఈ ఏడాది మొద‌టి మూడు నెలల్లో అక్క‌డ శిక్ష‌ణ‌ను తీసుకోలేక‌పోయాడు. చివ‌రికి అత‌డి స్నేహితులు సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్, క్రిస్టోఫర్ మార్క్విస్ లు అత‌డు జ‌ర్మ‌నీలో బ‌స చేయ‌డానికి నిధులు స‌మ‌కూర్చారు.

26 ఏళ్ల నాగ‌ల్ ఈ ఏడాది దాదాపు 24 టోర్న‌మెంట్ల‌లో పాల్గొన్నాడు. త‌ద్వారా అత‌డు రూ.65 ల‌క్ష‌లు సంపాదించాడు. ఇటీవ‌ల ముగిసిన యూఎస్ టోర్న‌మెంట్‌లో క్వాలిఫైయ‌ర్ మొద‌టి రౌండ్‌లో టారో డేనియ‌ల్ చేతిలో ఓడిపోయాడు. అయిన‌ప్ప‌టికీ అత‌డికి సుమారు రూ.18లక్ష‌లు వ‌చ్చాయి. అయితే.. తాను కోచ్‌తో క‌లిసి టోర్న‌మెంట్ల‌కు వెళ్లడానికి అయిన ఖ‌ర్చు రూ.80ల‌క్ష‌ల నుంచి రూ.కోటి వ‌ర‌కు ఉంటుంద‌ని నాగ‌ల్ చెప్పాడు. అది కేవలం ఒక ట్రావెలింగ్ కోచ్‌తో మాత్రమే (ఫిజియో లేడు)న‌ని అన్నాడు. తాను సంపాదించిన డ‌బ్బునే మ‌ళ్లీ పెట్టుబ‌డిగా పెడుతున్న‌ట్లు తెలిపాడు.

ఈ ఏడాది ప్రారంభంలో ఓ సారి నా బ్యాంక్ బ్యాలెన్స్ ప‌రిశీలిస్తే నా వ‌ద్ద 900 యూరోలు (భార‌త క‌రెన్సీలో సుమారు రూ.80,000) మాత్ర‌మే ఉన్నాయని నాగ‌ల్ పీటీఐకి చెప్పాడు. ప్రశాంత్ సుతార్ మహా టెన్నిస్ ఫౌండేషన్‌తో త‌న‌కు కొంత సహాయం లభించింద‌న్నాడు. ఆ ఫౌండేషన్ ఏ సహాయం చేస్తుంద‌ని తెలిపాడు. ఇక ఐఓసీఎల్ నుండి నెలవారీ (జీతం) కూడా పొందుతున్న‌ట్లు వెల్ల‌డించాడు. ఈ మొత్తాన్ని కూడా తాను ATP టూర్‌లో పాల్గొనేందుకు ఖ‌ర్చు చేసిన‌ట్లు వెల్ల‌డించాడు. త‌న‌కు పెద్దగా స్పాన్సర్ ఎవరూ లేరని చెప్పాడు.

గ‌త కొన్నేళ్లుగా భారత్‌లో నంబర్ వన్ ప్లేయర్‌గా ఉన్నప్పటికీ త‌న‌కు మద్దతు కరువైన‌ట్లుగా భావిస్తున్న‌ట్లు తెలిపాడు. గ్రాండ్‌స్లామ్‌లకు అర్హత సాధించిన ఏకైక ఆటగాడు తానేన‌ని, గ‌త కొన్నేళ్లుగా ఒలింపిక్స్ (టోక్యో)లో (టెన్నిస్‌) మ్యాచ్ గెలిచిన ఏకైక ఆట‌గాడిని అయిన‌ప్ప‌టికీ భార‌త ప్ర‌భుత్వం ఇప్ప‌టికీ కూడా టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్‌ (TOPS)లో త‌న పేరును చేర్చ‌లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశాడు.

ఇక గాయం తర్వాత త‌న‌ ర్యాంకింగ్ పడిపోయినప్పుడు, ఎవరూ కూడా త‌న‌కు సహాయం చేయాలనుకోలేదని, తాను తిరిగి వస్తానని ఎవరూ నమ్మలేదన్నాడు. అది త‌న‌ను ఎంతో నిరాశ‌కు గురి చేసింద‌న్నాడు. ఎందుకంటే తాను ఏమి చేసినా సరిపోదని భావిస్తున్న‌ట్లు చెప్పాడు. దేశంలో ఆర్థిక సహాయాన్ని కనుగొనడం చాలా కష్టమ‌ని, నిజం చెప్పాలంటే ఏం చేయాలో తెలియ‌క ఆశ‌లు వ‌దిలేసుకున్నాన‌ని అన్నాడు.

అయితే, ఏటీపీ చాలెంజర్‌ టోర్నీలో రన్నరప్‌గా నిలిచాడు. ఆస్ట్రియా వేదికగా సెప్టెంబర్ 11న జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో నాగల్‌ 2-6, 4-6తో విట్‌ కొప్రివో (చెక్‌ రిపబ్లిక్‌) చేతిలో ఓడాడు. సెమీఫైనల్లో టాప్‌ సీడ్‌ను మట్టికరిపించిన నాగల్‌.. తుదిపోరులో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. వరుస సెట్లలో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు.

యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ (MYAS) సెప్టెంబర్ 2014లో ఒలింపిక్స్, పారాలింపిక్స్‌లో భారతదేశ ప్రదర్శనను పెంచడంలో సహాయపడటానికి TOPSని ప్రారంభించింది. ఈ పథకం కింద.. అథ్లెట్లకు విదేశీ శిక్షణ, అంతర్జాతీయ పోటీలో పాల్గొనడం, పరికరాలు, కోచింగ్ క్యాంపులతో సహాయం చేస్తారు. ఇది కాకుండా వారికి నెలవారీ స్టైఫండ్ కూడా ఇస్తారు.