రవీంద్ర జడేజా 250 వికెట్లు, 2500 టెస్టు పరుగులు

టెస్టుల్లో 250 వికెట్లు, 2500 పరుగుల మైలురాయిని చేరుకున్న జడేజా అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన రెండో ఆటగాడిగా రికార్డు టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా గురించి తెలియని క్రికెట్ అభిమాని ఉండడంటే అతి శయోక్తి కాదు. జడ్డూ ఉంటే బౌలింగ్​తో పాటు బ్యాటింగ్​లో కూడా టీమ్​కు కొండంత అండగా నిలుస్తాడు. ప్రస్తుతం ఆసీస్​తో జరుగుతున్న బోర్డర్– గవాస్కర్ ట్రోఫీలో తొలి రెండు టెస్టుల్లో ఆసీస్ నడ్డి విరిచాడు. అటు బ్యాటుతోనూ విలువైన పరుగులు […]

Share:

టెస్టుల్లో 250 వికెట్లు, 2500 పరుగుల మైలురాయిని చేరుకున్న జడేజా

అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన రెండో ఆటగాడిగా రికార్డు

టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా గురించి తెలియని క్రికెట్ అభిమాని ఉండడంటే అతి శయోక్తి కాదు. జడ్డూ ఉంటే బౌలింగ్​తో పాటు బ్యాటింగ్​లో కూడా టీమ్​కు కొండంత అండగా నిలుస్తాడు. ప్రస్తుతం ఆసీస్​తో జరుగుతున్న బోర్డర్– గవాస్కర్ ట్రోఫీలో తొలి రెండు టెస్టుల్లో ఆసీస్ నడ్డి విరిచాడు. అటు బ్యాటుతోనూ విలువైన పరుగులు జోడించాడు. 5 నెలల విరామం తర్వాత గ్రౌండ్​లోకి ఎంట్రీ ఇచ్చినా కానీ అదరగొడుతున్నాడు. జడ్డూ ప్లేస్​ను ఎవరూ భర్తీ చేయలేరని అంతా భావించేలా ఆడుతున్నాడు. అదే విధంగా అతడు మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. టెస్టుల్లో 250 వికెట్లు, 2500 పరుగులు చేసిన జడేజా.. టెస్టుల్లో ఈ ఘనత సాధించిన రెండో ఆల్‌రౌండర్‌గా నిలిచాడు. 

రవీంద్ర జడేజా టెస్టు 250 వికెట్లు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో జడేజా ఈ ఘనత సాధించాడు. రెండో టెస్టులో ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌ 46వ ఓవర్‌లో జడేజా 250వ వికెట్‌గా ఉస్మాన్ ఖవాజాను అవుట్ చేసి ఈ ఘనతను అందుకున్నాడు. కేఎల్ రాహుల్ పట్టిన అద్భుత ఈ క్యాచ్ తో జడేజా 250 వికెట్ల మైలురాయికి చేరుకున్నాడు. 62వ టెస్టు మ్యాచ్‌లోనే జడేజా ఈ ఘనత సాధించాడు. భారత దిగ్గజ ఆల్‌రౌండర్ కపిల్ దేవ్ 65 మ్యాచ్‌ల్లో 250 వికెట్లకు చేరుకోగా.. కపిల్ కంటే 3 మ్యాచ్‌ల ముందుగానే ఈ ఫీట్ సాధించాడు. మొత్తంగా టెస్టు క్రికెట్లో ఈ ఘనత సాధించిన వారిలో రెండవ స్థానంలో జడేజా నిలిచాడు. మొదటి స్థానంలో ఉన్న ఇంగ్లాండ్ దిగ్గజ ఆల్ రౌండర్ ఇయాన్ బోథమ్ 55 మ్యాచ్‌ల్లోనే ఈ ఘనతను అందుకున్నాడు. 

టెస్టుల్లో 2500 పరుగులు చేసిన భారత నాలుగో ఆల్‌రౌండర్‌ జడేజా

అదేవిధంగా తాజా ఫీట్‌తో టెస్టుల్లో 250 వికెట్లు 2500 పరుగులు చేసిన భారత నాలుగో ఆల్‌రౌండర్‌గా కూడా జడేజా నిలిచాడు. ఈ జాబితాలో జడేజా కంటే ముందు కపిల్ దేవ్, అనిల్ కుంబ్లే, రవిచంద్రన్ అశ్విన్ ఉన్నారు. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో ఆల్‌రౌండర్ల జాబితాలో జడేజా ప్రస్తుతం 14వ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. ఇక రెండో టెస్టు తర్వాత ఐసీసీ విడుదల చేసిన ఆల్​రౌండర్ల జాబితాలో జడ్డూ తొలిస్థానంలో నిలిచాడు. ఇండియాకు చెందిన మరో ఆల్​రౌండర్ రవి చంద్రన్ అశ్విన్ రెండో స్థానంలో నిలిచాడు. ఇక మార్చి 1 నుంచి జరిగే మూడో టెస్టులో జడ్డూ ఎటువంటి ఇంపాక్ట్ చూపుతాడో వెయిట్ చేయాలి. ప్రస్తుతం జడ్డూని ఆడించకపోవడం అంటే మన ఓటమికి మనమే బాటలు వేసుకున్నట్లు అవుతుందని మాజీలు అంచనా వేస్తున్నారు. స్పిన్ పిచెస్ తయారు చేశారని కంగారూ మాజీలు, అక్కడి మీడియా కోడై కూస్తున్నా కానీ.. మన జడ్డూ బ్యాటింగ్​లో అదరగొడుతున్నాడు. తొలి టెస్టులో అర్ధ సెంచరీ చేయడంతో పాటుగా… రెండో టెస్టులో కూడా విలువైన పరుగులు చేసి వికెట్ కాపాడాడు. తొలి రెండు టెస్టుల్లో కూడా జడ్డూనే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్​గా నిలిచిన విషయం తెలిసిందే. ప్రస్తుత వరల్డ్​ క్రికెట్​లో జడేజా వంటి నమ్మకమైన ఆల్​రౌండర్లు అరుదుగా ఉంటారు.