ఇండియాలోనే ఐపీఎల్ 2024 నిర్వహణ? అభిమానులకు పండగేనా!

IPL 2024: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2024 సీజన్‌ కు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది.

Courtesy: IDL

Share:

మన దేశంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు భారీగా క్రేజ్ ఉంటుంది. చిన్నా పెద్దా తేడా లేకుండా క్రికెట్ అభిమానులంతా ఐపీఎల్ ను ఆసక్తిగా తిలకిస్తారు. అయితే, ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2024 సీజన్‌ కు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ పొందిన ఈ లీగ్‌ మార్చి 22న మొదలుకానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ సీజన్ మ్యాచ్ లను భారత్‌లోనే నిర్వహించేందుకు బీసీసీఐ ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ సారి సార్వత్రిక ఎన్నికల కారణంగా ఐపీఎల్ 2024 ను దుబాయ్ లో నిర్వహించాలని గతంలో పలు నివేదికలు చెప్పుకొచ్చాయి. దానికి తగ్గట్టుగానే ఐపీఎల్ 2024 మినీ వేలాన్ని దుబాయిలోనే జరిపారు. కానీ, ప్రస్తుతం మళ్లీ ఐపీఎల్ 2024 సీజన్ భారత్ లోనే జరగనుందని పలు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.         

2024 లో సార్వత్రిక ఎన్నికలు ఉన్నప్పటికీ ఇండియాలోనే ఐపీఎల్ నిర్వహిస్తారని.. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ) వర్గాల సమాచారం. ఐపీఎల్ భారత్‌లోనే జరుగుతుందని బీసీసీఐ విశ్వసనీయ వర్గాలు ధృవీకరించాయి. ఈ విషయంపై బీసీసీఐ అధికారి ఒకరు ఏఎన్‌ఐతో మాట్లాడుతూ..‘‘దేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఐపీఎల్‌ టోర్నమెంట్‌ వేదికను  విదేశాలకు తరలిస్తారన్న సందేహాలు వద్దు. ఈసారి అలాంటిదేమీ ఉండదు. సహేతుకమైన కారణాలు చూపుతూ ఏదైనా రాష్ట్రం మ్యాచ్‌ నిర్వహించలేమని చెబితే.. సదరు మ్యాచ్‌ వేదికను మరో రాష్ట్రానికి మార్చాలని భావిస్తున్నాం’’ అని పేర్కొన్నారు. తద్వారా ఐపీఎల్‌-2024ను భారత్‌లోనే నిర్వహిస్తామనే సంకేతాలు ఇచ్చారు.

ఐపీఎల్ ఎప్పుడు జరుగుతుందనే విషయాన్ని మాత్రం ఇంకా ప్రకటించలేదు. మార్చి 22 అని వార్తలు వస్తున్నా.. అధికారికంగా ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. జూన్ 1 నుంచి వెస్టిండీస్,అమెరికా వేదికగా టీ 20 వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో మే 20 లోపు ఈ మెగా టోర్నీని ముగించే అవకాశం ఉంది. 2019లో తొలి 19 మ్యాచ్‌ల షెడ్యూల్‌ను తొలుత విడుదల చేసిన ఐపీఎల్‌ పాలక మండలి.. ఎన్నికల నగారా మోగిన తర్వాత మిగతా మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ప్రకటించింది. అప్పుడు మ్యాచ్‌లన్నీ భారత్‌లోనే నిర్వహించింది. కాగా, గత నెలలో దుబాయ్‌లో జరిగిన ఐపీఎల్ 2024 వేలం తర్వాత ఫ్రాంచైజీలు ఇప్పటికే తమ జట్లని ఖరారు చేశాయి. ఆస్ట్రేలియన్ క్రికెటర్ మిచెల్ స్టార్క్ ను ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా రూ.24.75 కోట్లకు కోల్‌కతా నైట్ రైడర్స్ కొనుగోలు చేసింది.