కోహ్లీ కెప్టెన్‌గా కొనసాగి ఉండుంటే.. కథ ఇంకోలా ఉండేది

మరో రెండు నెలల్లో వన్డే ప్రపంచకప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో టీమిండియా బ్యాటింగ్‌పై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లీని కెప్టెన్‌గా కొనసాగించి ఉంటే.. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో టీమిండియా మెరుగైన పరిస్థితిలో ఉండేదని చెప్పాడు. స్వదేశంలో జరిగే ఈ టోర్నీకి ఇండియా సరిగ్గా సన్నద్ధం కాలేదని విమర్శించాడు. తన అధికారిక యూట్యూబ్ చానల్‌లో లతీఫ్ మాట్లాడుతూ.. ‘‘విరాట్‌ కోహ్లీని కెప్టెన్‌గా కొనసాగించి ఉంటే.. వరల్డ్‌కప్‌కు టీమిండియా 100 శాతం సన్నద్ధమయ్యేది. […]

Share:

మరో రెండు నెలల్లో వన్డే ప్రపంచకప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో టీమిండియా బ్యాటింగ్‌పై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లీని కెప్టెన్‌గా కొనసాగించి ఉంటే.. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో టీమిండియా మెరుగైన పరిస్థితిలో ఉండేదని చెప్పాడు. స్వదేశంలో జరిగే ఈ టోర్నీకి ఇండియా సరిగ్గా సన్నద్ధం కాలేదని విమర్శించాడు. తన అధికారిక యూట్యూబ్ చానల్‌లో లతీఫ్ మాట్లాడుతూ.. ‘‘విరాట్‌ కోహ్లీని కెప్టెన్‌గా కొనసాగించి ఉంటే.. వరల్డ్‌కప్‌కు టీమిండియా 100 శాతం సన్నద్ధమయ్యేది. బ్యాటింగ్ ఆర్డర్ విషయంలో టీమిండియా మేనేజ్‌మెంట్ ఎన్నో మార్పులు చేసింది. ముఖ్యంగా మిడిల్, లోయర్ ఆర్డర్‌‌లో కొత్త వాళ్లు కుదురుకునేందుకు, నిలదొక్కుకునేందుకు అసలు అవకాశమే ఇవ్వలేదు. టీమ్‌లో తరచూ ఎన్నో మార్పులు చేశారు. ఈ కారణంగానే ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో ఇండియా ఓడిపోయింది” అని చెప్పుకొచ్చాడు. మరోవైపు కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ లాంటి ఆటగాళ్లు గాయాల నుంచి కోలుకుంటున్నారని, కానీ వాళ్లతో ప్రపంచకప్‌కు వెళ్లడం రిస్క్‌ అని అభిప్రాయ పడ్డాడు.

దుమారం రేపిన గంగూలీ, కోహ్లీ వివాదం

విరాట్ కోహ్లీ.. పరుగుల రారాజుగా.. పరుగుల యంత్రంగా పేరు పొందిన మేటి క్రికెటర్. ఓ బ్యాట్స్‌మన్‌గా ఎన్నో రికార్డులను తిరగరాసిన కోహ్లీ.. కెప్టెన్‌గా మాత్రం విఫలమయ్యాడనే విమర్శను అతడు ఎదుర్కొన్నాడు. 2021 ఆఖర్లో టీ20 కెప్టెన్సీ నుంచి విరాట్ తప్పుకోవడం ఇండియన్ క్రికెట్‌లో పెను దుమారమే రేపింది. టీ20 వరల్డ్‌కప్‌కు కొద్ది రోజులకు ముందు కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఆ సమయంలో బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న క్రికెట్ దిగ్గజం సౌరవ్ గంగూలీ, కోహ్లీ మధ్య గొడవలు జరిగినట్లు ఊహాగానాలు సాగాయి. అయితే అప్పట్లో దీని గురించి వారిద్దరూ పెద్దగా స్పందించలేదు. తర్వాత జరిగిన పరిణామాలతో వన్డే జట్టు, కొన్నాళ్లకు టెస్టు జట్టు కెప్టెన్సీని విరాట్ కోహ్లీ వదులుకోవాల్సి వచ్చింది. దీంత మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌గా రోహిత్ శర్మ బాధ్యతలు స్వీకరించాడు. 

దశాబ్ద కాలంగా అందని ద్రాక్షగా ఐసీసీ ట్రోఫీ

28 ఏళ్లపాటు అందని ద్రాక్షగా ఉన్న వన్డే వరల్డ్‌ కప్ ట్రోఫీని మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని టీమిండియా 2011లో సాధించింది. అంతకుముందు 2007లో తొలి టీ20 ట్రోఫీని, తర్వాత 2013లో చాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. ఇవి మూడు కూడా ధోనీ కెప్టెన్‌గా ఉన్నప్పుడు సాధించినవే కావడం గమనార్హం.  అప్పటి నుంచి ఏ ఒక్క ఐసీసీ ట్రోఫీని టీమిండియా గెలవలేదు. కొన్నింటిలో ఫైనల్స్‌ దాకా వెళ్లి వెనక్కి వచ్చింది. కొత్తగా ప్రవేశపెట్టిన వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ విషయంలోనూ ఇదే పరిస్థితి. రెండు సార్లు ఫైనల్‌కు వెళ్లినా ట్రోఫీని గెలవలేకపోయింది. ధోనీ నుంచి కోహ్లీకి.. తర్వాత కోహ్లీ నుంచి రోహిత్‌కు కెప్టెన్సీ పగ్గాలు మారినా.. ఫలితాలు మాత్రం మారడం లేదు. 

స్వదేశంలో కలిసొచ్చేనా?

2011 వన్డే వరల్డ్‌కప్ మన దేశంలోనే జరిగింది. ముంబైలో జరిగిన ఫైనల్‌లో గెలిచి సగర్వంగా కప్‌ను అందుకుంది టీమిండియా. ఇప్పుడు మరోసారి మన దేశంలోనే వన్డే వరల్డ్‌కప్ జరగనుంది. సొంత గడ్డపై ఆడనుండటం మనకు కలిసొచ్చే అంశం. బహుశా కోహ్లీ, రోహిత్ వంటి కొందరికి ఇదే చివరి వరల్డ్‌ కప్ కూడా కావచ్చు. మరోవైపు సూర్య కుమార్ యాదవ్, తిలక్ వర్మ, బూమ్రా తదితరులు సూపర్ ఫామ్‌లో ఉన్నారు. వీళ్లందరూ సమష్టి గా ఆడితే విజయం మనదేనని, ఈ సారి ఎలాగైనా కప్పు కొట్టాలని కోట్లాది అభిమానులు కోరుకుంటున్నారు.