యువరాజ్, ధోనీ తర్వాత ఆ స్థానాలకు న్యాయం చేసింది ఎవరో తెలుసా…

కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ, సిక్సర్ల వీరుడు యువరాజ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరైన తర్వాత నుంచి ఇండియాకు సరైన విధంగా ఆడే నెం.4, నెం.5 బ్యాట్స్ మన్ దొరకలేదని అందరూ ఒప్పుకోవాల్సిన సత్యం. 2019లో యువరాజ్ రిటైర్ అయిన నుంచి ఇండియా ఆ స్థానంలో 10 మంది కంటే ఎక్కువ ఆటగాళ్లను పరీక్షించింది. కానీ దురదృష్టవశాత్తు ఏ ఒక్కరు కూడా ఆ స్థానం కోసం సరైన విధంగా ఫిట్ కాలేదు. దీంతో టీమిండియాకు […]

Share:

కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ, సిక్సర్ల వీరుడు యువరాజ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరైన తర్వాత నుంచి ఇండియాకు సరైన విధంగా ఆడే నెం.4, నెం.5 బ్యాట్స్ మన్ దొరకలేదని అందరూ ఒప్పుకోవాల్సిన సత్యం. 2019లో యువరాజ్ రిటైర్ అయిన నుంచి ఇండియా ఆ స్థానంలో 10 మంది కంటే ఎక్కువ ఆటగాళ్లను పరీక్షించింది. కానీ దురదృష్టవశాత్తు ఏ ఒక్కరు కూడా ఆ స్థానం కోసం సరైన విధంగా ఫిట్ కాలేదు. దీంతో టీమిండియాకు ఈ బెడద అలాగే వెంటాడుతోంది. 

2019 ప్రపంచకప్ ఓడింది అందుకే

2011 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత 2019 వరల్డ్ కప్ ను కూడా ఇండియా ఒడిసిపడుతుందని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. టీమిండియా సెమీస్ గడప వద్ద బోల్తా పడింది. న్యూజిలాండ్ జట్టుతో సెమీస్ పోరులో తలపడిన ఇండియా సరిగ్గా ఆడలేక చేతులెత్తేసింది. దీంతో వరల్డ్ కప్ తీసుకుని వస్తారనుకున్న కోట్లాది మంది భారతీయుల కలలు కల్లలయ్యాయి. ఇక 2019 వరల్డ్ కప్ తర్వాత జట్టులోకి ఎంతో మంది కొత్త ప్లేయర్లు ఎంట్రీ ఇచ్చినా కానీ నెం.4, నెం.5 స్థానాల్లో పాతుకుపోయే ప్లేయర్ ని అయితే ఇండియా ఇంత వరకు కనుగొనలేకపోయింది. దీనికి అనేక కారణాలు ఉన్నా కానీ ఆ ప్లేయర్ లేని లోటు మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో జట్టు యాజమాన్యంతో పాటు క్రికెట్ ఫ్యాన్స్ కూడా తెగ టెన్షన్ పడుతున్నారు. 

వారిద్దరే న్యాయం చేశారు… 

ఈ నెం.4, నెం. 5  స్థానం గురించి టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. ఈ ఇష్యూ గురించి యాష్ మాట్లాడుతూ… అవును ఇండియా గత కొద్ది రోజుల నుంచి ఈ స్థానంలో సరైన ఆటగాడు లేక స్ట్రగుల్ అవుతోంది. ఎంతో మంది ఆటగాళ్లను ఇక్కడ ట్రై చేసినా కానీ ఇండియాకు నిరాశే ఎదురైందని చెప్పాడు. కేవలం ఇప్పటి వరకు యువరాజ్, ధోనీ తర్వాత కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ మాత్రమే ఈ స్థానాలకు న్యాయం చేశారని అతడు చెప్పుకొచ్చాడు. వీరిద్దరు తప్ప ఈ స్థానాల్లో ఎవరూ సరిగా పర్ఫామ్ చేయలేదని తన మనసులో మాటను బయటపెట్టేశాడు. 

రోహిత్ బెంగ కూడా అదే…

నెం.4, నెం.5 స్థానం ఎంతలా కలవరపెడుతుందో మనందరికీ తెలిసిందే. ఈ అంశంపై జట్టు కెప్టెన్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ కూడా స్పందించాడు. యువరాజ్ సింగ్ రిటైర్ అయిన తర్వాత ఈ ప్లేస్ లో చాలా మార్పులు చేశామని, ఏ ఒక్క మార్పు కూడా సరైన విధంగా సక్సెస్ కాలేదని రోహిత్ తెలిపాడు. రోహిత్ నాయకత్వంలోనే టీమిండియా త్వరలో జరగబోయే ఆసియా కప్, వరల్డ్ కప్ వంటి మెగా టోర్నీల్లో పాల్గొంటోంది. 

వారు మాత్రమే న్యాయం చేయగలరు

నెం.4, నెం.5 స్థానాలకు కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ అయితేనే న్యాయం చేయగలరని అశ్విన్ తన యూ ట్యూబ్ చానల్ లో పేర్కొన్నాడు. అవును ఆ స్థానాలకు వారయితే న్యాయం చేయగలరు. ఆసియా కప్ లో వారిద్దరూ ఆడడం భారత్ కు పెద్ద ప్లస్ అని తెలిపాడు. వారిద్దరూ ఆసియా కప్ మ్యాచెస్ వరకు ఫిట్ నెస్ సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ స్థానాల్లో ఆడినపుడు కేఎల్ రాహుల్ కు 99 స్ట్రైక్ మరియు అయ్యర్ కు 94 స్ట్రైక్ రేట్ ఉందని యాష్ గుర్తు చేశాడు. ఈ ఇద్దరి స్ట్రైక్ రేట్స్ అనేవి ఇండియాకు ఎంతో ప్లస్ అవుతాయని తెలిపాడు. ఇక అంతే కాకుండా కేఎల్ రాహుల్ కీపింగ్ ఆప్షన్ గా కూడా పనికొస్తాడని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. ఆసియా కప్ మొదటి మ్యాచ్ వరకు రాహుల్ పూర్తి ఫిట్ నెస్ సాధిస్తాడని సెలెక్షన్ కమిటీ చైర్మన్ అగార్కర్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. కావున ఇషాన్ కిషన్ సెకండ్ వీకెట్ కీపర్ గా పనికొస్తాడని అంతా కామెంట్ చేస్తున్నారు.