కేసీఆర్ ఓ నిరంకుశుడు అంటూ తీవ్ర స్థాయిలో కామెంట్స్ చేసిన వైఎస్ షర్మిల

వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల మరోసారి సీఎం కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పోలీసులపై దాడి చేసిన కేసులో అరెస్టు అయిన షర్మిల చంచల్ గూడ జైలు నుండి విడుదల అయ్యారు. నాంపల్లి కోర్టు ఆమెకు షరతులతో కూడిన  బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో షర్మిల తరపు న్యాయవాదులు జైలుకు వెళ్లి కోర్టు కాపీ చూపించి పూచికత్తు పత్రాలు సమర్పించడంతో ఆమెను జైలు అధికారులు విడుదల చేశారు. అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడారు. కేసీఆర్‌పై […]

Share:

వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల మరోసారి సీఎం కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పోలీసులపై దాడి చేసిన కేసులో అరెస్టు అయిన షర్మిల చంచల్ గూడ జైలు నుండి విడుదల అయ్యారు. నాంపల్లి కోర్టు ఆమెకు షరతులతో కూడిన  బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో షర్మిల తరపు న్యాయవాదులు జైలుకు వెళ్లి కోర్టు కాపీ చూపించి పూచికత్తు పత్రాలు సమర్పించడంతో ఆమెను జైలు అధికారులు విడుదల చేశారు. అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడారు. కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్‌ను నిరంకుశుడిగా అభివర్ణించారు. పేపర్ లీకేజీ కేసుకు సంబంధించి సిట్ అధికారిని కలిసి వినతి పత్రం సమర్పించేందుకు వెళుతుంటే ఎటువంటి హౌస్ అరెస్టు కాపీ చూపించకుండా తనను పోలీసులు అడ్డుకున్నారన్నారు. ఇద్దరు మహిళా పోలీసులతో వచ్చిన పురుష పోలీసులు తన పట్ల దారుణంగా వ్యవహరించారని మండిపడ్డారు. పోలీసులకు తనకు అరెస్టు వారెంట్ గానీ, హౌస్ అరెస్టు ఆర్డర్ కానీ చూపలేదన్నారు. తనను బయటకు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు బెదిరించే రీతిలో వ్యవహరించారనీ, తనను వారు తాకిన నేపథ్యంలోనే సెల్ఫ్ డిఫెన్స్ చేసుకున్నట్లుగా చెప్పారు. 

రాజశేఖర్‌రెడ్డి బిడ్డ అంటే తెలంగాణ సీఎం కేసీఆర్ భయపడుతున్నారని అందుకే తనపై ఇన్ని ఆంక్షలు పెడుతున్నారని మండిపడ్డారు. తాను సీట్ ఆఫీసుకు కేవలం వినతి పత్రాన్ని ఇవ్వడానికే బయలుదేరానని చెప్పారు. పోలీసులు మాత్రం అత్యుత్సాహం ప్రదర్శించి తన పట్ల దురుసుగా ప్రవర్తించారని అన్నారు. పోలీసులు కేసీఆర్ తొత్తులుగా వ్యవహరిస్తూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారమని మండిపడ్డారు. రాజశేఖర్‌రెడ్డి బిడ్డ కేసీఆర్ తాటాకు చప్పుళ్లకు భయపడదని అన్నారు. ఎంత తొక్కాలని చూస్తే అంత పైకి వస్తాననీ, ప్రజల కోసం పోరాడతానని పేర్కొన్నారు. కేసీఆర్ ఇంతకు ఇంత అనుభవిస్తాడని శాపనార్ధాలు పెట్టారు. కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన ఏ హామీలు నెరవేర్చలేదని అన్నారు. కేసీఆర్ కుమార్తె లిక్కర్ స్కామ్‌లో, కుమారుడు రియల్ ఎస్టేట్ స్కామ్‌లో బిజీగా ఉన్నారని ఆరోపించారు. కేసీఆర్‌కు అవినీతి చేయడం తప్ప ఏమీ చేతకాదని విమర్శించారు. సిట్‌కు వినతి పత్రం ఇవ్వాలనుకోవడం కూడా నేరమా అని ప్రశ్నించారు. కేసీఆర్ పాలనను అప్ఘాన్ పాలన కాక.. ఇంకేం అనాలని షర్మిల ప్రశ్నించారు. 

పోలీసులు కొన్ని వీడియోలు మాత్రమే ఎంచుకుని వైరల్ చేశారనీ, తనను బెదిరించిన వీడియోలు, మగ పోలీసులు తన శరీరాన్ని తాకే ప్రయత్నం చేయడం, మహిళా పోలీసులు తన చేయి విరగొట్టే ప్రయత్నం చేసిన వీడియోలు ఎందుకు బయటపెట్టలేదని ఆమె ప్రశ్నించారు. ఆత్మరక్షణ కోసమే వారిని నెట్టానే తప్ప వారిని కొట్టలేదని షర్మిల తెలిపారు. కాగా నిన్న జూబ్లిహిల్స్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నారు. షర్మిలను అరెస్టు చేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించగా.. విషయం తెలుసుకున్న ఆమె తల్లి వైఎస్ విజయమ్మ కుమార్తెను చూసేందుకు పీఎస్ వద్దకు వెళ్లారు. అయితే పోలీసులు విజయమ్మను పోలీస్ స్టేషన్‌లోకి వెళ్లడానికి అనుమతి ఇవ్వలేదు. విజయమ్మను అడ్డుకుని వెనక్కి పంపారు. ఆ సమయంలో పోలీసులతో విజయమ్మ వాగ్వివాదానికి దిగారు. విజయమ్మ సైతం ఓ మహిళా పోలీసుపై చేయి చేసుకున్నారు. అయితే విజయమ్మపై ఆ మహిళా పోలీసు ఫిర్యాదు చేయకపోవడంతో ఆమెపై కేసు నమోదు కాలేదు.