అభ్యంత‌క‌ర పోస్ట్‌ల‌పై సుప్రీంకోర్టు ఝులుం

సోషల్ మీడియా యుగమిది.. పుకార్లు షికార్లు చేస్తుంటాయి. ఏది నిజమో.. ఏది అబద్ధమో వెంటనే కనిపెట్టడం అసాధ్యం. నిజం బయటికొచ్చేలోపు అబద్ధం ప్రపంచాన్ని చుట్టేస్తుంది. కనిపించే దృశ్యాలన్నీ నిజాలు కావు.. రాసే రాతలన్నీ సత్యాలు కావు.. కృత్రిమ మేధ సాయంతో లేని వాళ్లను ఉన్నట్లు.. ఉన్న వాళ్లను లేనట్లు చూపిస్తున్నారు. ఇలాంటి ఘటనల నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఓ మహిళా జర్నలిస్టుపై అనుచిత పోస్టులు పెట్టిన మాజీ ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సోషల్ […]

Share:

సోషల్ మీడియా యుగమిది.. పుకార్లు షికార్లు చేస్తుంటాయి. ఏది నిజమో.. ఏది అబద్ధమో వెంటనే కనిపెట్టడం అసాధ్యం. నిజం బయటికొచ్చేలోపు అబద్ధం ప్రపంచాన్ని చుట్టేస్తుంది. కనిపించే దృశ్యాలన్నీ నిజాలు కావు.. రాసే రాతలన్నీ సత్యాలు కావు.. కృత్రిమ మేధ సాయంతో లేని వాళ్లను ఉన్నట్లు.. ఉన్న వాళ్లను లేనట్లు చూపిస్తున్నారు. ఇలాంటి ఘటనల నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఓ మహిళా జర్నలిస్టుపై అనుచిత పోస్టులు పెట్టిన మాజీ ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెట్టే వాళ్లు.. వాటి పర్యవసానాలకు కూడా సిద్ధంగా ఉండాలని తేల్చిచెప్పింది. 

తమిళనాడు మాజీ ఎమ్మెల్యే అభ్యంతరకర పోస్టులు

2018లో మహిళా జర్నలిస్టుపై తమిళనాడు మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీ శేఖర్‌‌ ఫేస్‌బుక్‌లో అభ్యంతరకర పోస్టులు పెట్టారు. దీంతో ఆయనపై రాష్ట్రవ్యాప్తంగా ఫిర్యాదులు నమోదయ్యాయి. అప్పటి అన్నాడీఎంకే ప్రభుత్వం ఆయనపై క్రిమినల్ చర్యలకు దిగింది. దీంతో అన్నాడీఎంకే మిత్రపక్షం బీజేపీకి చెందిన శేఖర్ ఆ పోస్టును కొద్ది గంటల్లోనే తొలగించారు. బేషరతుగా క్షమాపణలు చెప్పారు. అయితే కేసులు మాత్రం కొనసాగాయి. ఈ నేపథ్యంలో ఆయా కేసులను కొట్టివేయాలని కోరుతూ హైకోర్టును ఆయన ఆశ్రయించారు. కానీ హైకోర్టు అందుకు నిరాకరించింది. ఆయనకు వ్యతిరేకంగా జులై 14న తీర్పు చెప్పింది. 2018 ఏప్రిల్ 19న తన ఫేస్‌బుక్‌ ఖాతాలో శేఖర్ అసభ్యకరమైన, అవమానకరమైన వ్యాఖ్యలను షేర్ చేశారని వ్యాఖ్యానించింది. ఆ తర్వాత చెన్నై సీపీ ఆఫీసులో ఆయనపై ఫిర్యాదు నమోదైనట్లు చెప్పింది. కేసును కొట్టేసేందుకు నిరాకరించింది. 

‘‘2018 ఏప్రిల్ 19న పిటిషనర్‌‌ తన ఫేస్‌బుక్‌ ఖాతా నుంచి ఫార్వర్డ్ చేసిన సందేశాలను చదివితే.. మహిళా జర్నలిస్టుపై దారుణ వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. ఆ పోస్టును అనువదించడానికి కోర్టు సంశయిస్తోంది. ఎందుకంటే అది జుగుప్సాకరంగా ఉంది. తమిళనాడులోని పత్రికారంగంపైనే చేసిన అవమానకర వ్యాఖ్యల్లా ఉన్నాయి” అని హైకోర్టు ఆక్షేపించింది.

తన కంట్లో మందు వేసుకుని పోస్ట్ చేశారట

ఈ నేపథ్యంలో ఆయన సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు. ఈ కేసుపై విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం.. తమ పోస్టులు ఎంతదూరం వెళ్తాయి? ఎంత ప్రభావం చూపిస్తాయనే స్పృహ వాటిని పెట్టే ప్రతి ఒక్కరికీ ఉండాలని వ్యాఖ్యానించింది. ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెట్టే వాళ్లు.. వాటి పర్యవసానాలకు కూడా సిద్ధంగా ఉండాలని తేల్చిచెప్పింది. ఈ సందర్భంగా శేఖర్ తరఫున న్యాయవాది వాదనలు వినిపించారు. ‘‘పోస్టు పెట్టిన రోజు శేఖర్ తన కంట్లో మందు వేసుకున్నారు. పోస్టు చేసిన అంశంలోని ప్రతి అంశాన్ని ఆయన పూర్తిగా చదవలేదు” అని కోర్టుకు విన్నవించారు. అయితే ఈ వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. ఈ సందర్భంగా న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ పీకే మిశ్రాతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘సోషల్ మీడియా వాడే వాళ్లు తాము పోస్టు చేస్తున్న కంటెంట్ ఏంటనే స్పృహ కలిగి ఉండాలి. ఒక అంశాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నప్పుడే.. దాని ద్వారా తలెత్తే పరిణామాలకు బాధ్యత వహించేందుకు సిద్ధంగా ఉండాలి. సోషల్ మీడియా పోస్టు అనేది.. విల్లు నుంచి వదలిని బాణంతో సమానం. ఒకసారి పోస్టు చేశాక జరిగే నష్టాన్ని నివారించడం సాధ్యం కాదు” అని చెప్పింది. పిటిషనర్ అభ్యర్థనను తోసిపుచ్చింది. దీంతో ఆయనపై నమోదైన కేసుల విచారణ కొనసాగనుంది.