ఇజ్రాయెల్‌ Vs హమాస్‌.. కాంగ్రెస్‌- భాజపా మధ్య మాటల యుద్ధం

ఇజ్రాయెల్‌- హమాస్‌ మధ్య భీకర పోరు.. భాజపా- కాంగ్రెస్‌ మధ్య మాటల యుద్ధం రాజేసింది. ఇరు పార్టీలు విమర్శలు, ప్రతి విమర్శలకు దిగాయి. ఇజ్రాయెల్‌- హమాస్‌ మధ్య యుద్ధం ముదురుతోంది. దాడులు, ప్రతిదాడులతో పశ్చిమాసియా అట్టుడుకుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ చేసిన ఓ ప్రకటన రాజకీయ దుమారం రేపింది. యుద్ధంలో పాలస్తీనా పక్షాన నిలుస్తూ ఆ పార్టీ తీర్మానం చేయడంపై భాజపా విమర్శలు గుప్పిచ్చింది. అయితే, గత చరిత్రను కూడా పరిశీలించాలని కాంగ్రెస్‌ పార్టీ విమర్శలను […]

Share:

ఇజ్రాయెల్‌- హమాస్‌ మధ్య భీకర పోరు.. భాజపా- కాంగ్రెస్‌ మధ్య మాటల యుద్ధం రాజేసింది. ఇరు పార్టీలు విమర్శలు, ప్రతి విమర్శలకు దిగాయి. ఇజ్రాయెల్‌- హమాస్‌ మధ్య యుద్ధం ముదురుతోంది. దాడులు, ప్రతిదాడులతో పశ్చిమాసియా అట్టుడుకుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ చేసిన ఓ ప్రకటన రాజకీయ దుమారం రేపింది. యుద్ధంలో పాలస్తీనా పక్షాన నిలుస్తూ ఆ పార్టీ తీర్మానం చేయడంపై భాజపా విమర్శలు గుప్పిచ్చింది. అయితే, గత చరిత్రను కూడా పరిశీలించాలని కాంగ్రెస్‌ పార్టీ విమర్శలను తిప్పికొట్టింది.

ఇజ్రాయెల్‌-హమాస్‌ దాడుల వేళ ఇటీవల కాంగ్రెస్‌ అత్యున్నత నిర్ణయాక మండలి సీడబ్ల్యూసీ (CWC) భేటీ జరిగింది. ఈ సందర్భంగా దేశవ్యాప్త కులగణనపై తీర్మానం చేసింది. ఇదే  సమావేశంలో పాలస్తీనా పక్షాన నిలుస్తూ తీర్మానం చేయడం తాజా విమర్శలకు కారణమైంది. ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య ఘర్షణ జరుగుతున్న నేపథ్యంలో పాలస్తీనా ప్రజల హక్కులకు, వారి స్వయంపాలనకు తాము మద్దతు ఇస్తున్నామని కాంగ్రెస్‌ తెలిపింది. ఇజ్రాయెల్‌ జాతీయ భద్రతా ఆందోళనలకు భరోసా ఇస్తూ చర్చల ద్వారా పాలస్తీనా ప్రజల న్యాయబద్ధమైన ఆకాంక్షలను నెరవేర్చాల్సిన అవసరం ఉందని ఆ పార్టీ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ పేర్కొన్నారు. అయితే, పాలస్తీనా అంశంలో పార్టీలోనే కొంత వ్యతిరేకత వ్యక్తమైందన్న వార్తలూ వచ్చాయి. 

కాంగ్రెస్‌ పార్టీ తీర్మానంపై భారతీయ జనతా పార్టీ  భగ్గుమంది. మైనారిటీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం హమాస్‌ ఉగ్రవాదులకు ఆ పార్టీ మద్దతిస్తోందని విమర్శించింది. ‘‘మోదీ ప్రధానిగా వచ్చేంత వరకు మైనారిటీ ఓట్ల కోసం భారత విదేశాంగ విధానం ఎలా ఉండేదో చెప్పడానికి సీడబ్ల్యూసీ తీర్మానమే ఒక ఉదాహరణ’’ అంటూ ఆ పార్టీ ఎంపీ తేజస్వి సూర్య పేర్కొన్నారు. మరోవైపు ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడిని ఖండించిన ప్రధాని మోదీ.. ఇజ్రాయెల్‌కు తన సంఘీభావం తెలియజేశారు.

తమపై భాజపా చేస్తున్న విమర్శలను కాంగ్రెస్‌ పార్టీ తిప్పికొట్టింది. ప్రజల దృష్టిని మరల్చేందుకు భాజపా ప్రయత్నిస్తోందని పేర్కొంది. కాంగ్రెస్‌ పార్టీ తీర్మానాన్ని రాజకీయం చేయడం తగదని ఆ పార్టీ సీనియర్‌ నేత గౌరవ్‌ గొగొయ్‌ పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌లో ఉన్నా, గాజాలో ఉన్నా భారత పౌరులు క్షేమంగా తిరిగి రావాలన్నదే తమ ఆకాంక్ష అని పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌-పాలస్తీనా అంశంలో నాటి ప్రధాని వాజ్‌పేయీ వైఖరిని కూడా ఓ సారి గుర్తు చేసుకోవాలని భాజపాకు హితవు పలికారు. 1999 నుంచి 2004 వరకు దేశ ప్రధానిగా ఉన్న వాజ్‌పేయీ పలు సందర్భాల్లో పాలస్తీనా పక్షాన నిలిచారని గొగొయ్‌ పేర్కొన్నారు.

మరో పైపు హమాస్ ఉగ్రవాదుల దాడితో కల్లోల పరిస్థితులు నెలకొన్న వేళ ఇజ్రాయెల్‌ కు అండగా ఉండేందుకు పలు దేశాలు ముందుకొచ్చాయి. హమాస్‌ నుంచి రక్షించుకునేందుకు ఇజ్రాయెల్‌ చేసే అన్ని ప్రయత్నాలకు తాము సంపూర్ణ మద్దతు ఇస్తామని అమెరికా, యూకే, ఫ్రాన్స్‌, ఇటలీ, జర్మనీ ఆస్ట్రియా,కెనడా, పోలండ్‌, స్పెయిన్‌, యూరోపియన్‌ యూనియన్‌ తదితర దేశాలు తాజాగా సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. అటు, ఇజ్రాయెల్‌కు మద్దతుగా అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం, యూకే ప్రధాని నివాసం సహా పలు చారిత్రక కట్టడాలు, అధికారిక భవనాలపై నీలం, తెలుపు వర్ణాలను ప్రదర్శించాయి.

ఇజ్రాయెల్‌ భూ భాగంపై మెరుపుదాడికి దిగి వందలాది మంది ప్రాణాలను బలిగొన్న ఉగ్రవాద సంస్థ హమాస్‌ను కూడా కొన్ని దేశాలు వెనకేసుకొస్తున్నాయి. ఇజ్రాయెల్‌ ప్రతిదాడిని వెంటనే విరమించుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాయి. అవసరమైతే హమాస్‌కు ఆయుధ సామగ్రిని కూడా అందించేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నాయి. ఇరాన్‌, దక్షిణాఫ్రికా,యెమెన్‌, సౌదీ అరేబియా, ఖతార్‌ వీటితో పాటు పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌, లెబనాన్‌ దేశాలు కూడా హమాస్‌కు మద్దతు పలుకుతున్నాయి.