KCR:కామారెడ్డిలో కేసీఆర్‌‌పై పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు?

అయితే కామారెడ్డి నుంచి ఎవరు పోటీ చేస్తారనేది మాత్రం ప్రకటించలేదు. దీంతో అక్కడ కేసీఆర్‌‌పై ఎవరు బరిలో నిలుస్తారనేది ఆసక్తికరంగా మారింది.  తెలంగాణలో రాజకీయ వాతావరణం ( Telangana Elections) వేడెక్కింది. అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ఇప్పటికే రిలీజ్ అయింది. పదేళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ (BRS) హ్యాట్రిక్ కొట్టాలని ఉవ్విళ్లూరుతోంది. మునుపటి కన్నా ఎంతో బలంగా మారిన కాంగ్రెస్‌ (Congress) ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో హోరాహోరీ పోటీ కనిపిస్తోంది. రెండు […]

Share:

అయితే కామారెడ్డి నుంచి ఎవరు పోటీ చేస్తారనేది మాత్రం ప్రకటించలేదు. దీంతో అక్కడ కేసీఆర్‌‌పై ఎవరు బరిలో నిలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. 

తెలంగాణలో రాజకీయ వాతావరణం ( Telangana Elections) వేడెక్కింది. అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ఇప్పటికే రిలీజ్ అయింది. పదేళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ (BRS) హ్యాట్రిక్ కొట్టాలని ఉవ్విళ్లూరుతోంది. మునుపటి కన్నా ఎంతో బలంగా మారిన కాంగ్రెస్‌ (Congress) ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో హోరాహోరీ పోటీ కనిపిస్తోంది. రెండు పార్టీలు నువ్వా నేనా అన్నట్లుగా ప్రచారంలో దూకుడు పెంచుతున్నాయి. పోటాపోటీగా మేనిఫెస్టోలు ప్రకటించాయి. ప్రచారంలో దూసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ బస్సు యాత్రకు ప్లాన్ చేయగా.. కేసీఆర్ నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను ఆదివారం ప్రకటించింది. 55 స్థానాల నుంచి పోటీ చేయబోయే క్యాండిడేట్ల పేర్లను వెల్లడించింది. అయితే ఇదే సమయంలో బీఆర్‌‌ఎస్‌ అభ్యర్థులకు కేసీఆర్ బీఫామ్స్ అందజేశారు. దాదాపు 70 మంది దాకా అభ్యర్థులకు ఆదివారం బీఫామ్స్ ఇచ్చారు. అయితే ఇక్కడ ఒక విషయం ఆసక్తికరంగా మారింది. కామారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్‌ నుంచి కేసీఆర్‌‌పై పోటీ చేసేది ఎవరనేది ప్రశ్నార్థకంగా మారింది.

కావాలనే ఆపారా?

2014, 2018లో గజ్వేల్‌ నుంచి కేసీఆర్ (KCR) ప్రాతినిధ్యం వహించారు. ఈ సారి కామారెడ్డి బరిలో కూడా నిలవనున్నట్లు ప్రకటించారు. నోటిఫికేషన్ విడుదలయ్యాక గజ్వేల్, కామారెడ్డి (Kamareddy) సీట్ల నుంచి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇక ఇదే సమయంలో ఆదివారం నాడు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థుల తొలి జాబితాను రిలీజ్ చేసింది. అయితే అందులో కామారెడ్డి నుంచి ఎవరు పోటీ చేస్తున్నారనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు. ఆ సీటును హోల్డ్‌లో పెట్టింది.

నిజానికి కామారెడ్డి నుంచి కొన్నేళ్లుగా మహమ్మద్ షబ్బీర్ అలీ (Shabbir Ali) పోటీ చేస్తున్నారు. ఈ సారి కూడా ఆయనే పోటీ చేస్తారని అందరూ భావించారు. అక్కడి నుంచి పోటీ చేయడానికి కాంగ్రెస్‌ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నది కూడా షబ్బీర్ అలీ ఒక్కరే. నియోజకవర్గంలో కొన్ని నెలలుగా ఆయన జోరుగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్‌కు వచ్చిన ఊపుతో ఈ సారి తప్పకుండా గెలుస్తానని ధీమాగా ఉన్నారు. 

కానీ కేసీఆర్ అక్కడి నుంచి బరిలో దిగుతానని ప్రకటించడంతో సమీకరణాలు మారిపోయాయి. అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ను తప్పించి కేసీఆర్ పోటీ చేస్తున్నారు. దీంతో షబ్బీర్ అలీని దించాలా? లేక ఇంకెవరినైనా నిలపాలా? అనే విషయాలను కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ వ్యూహాత్మకంగానే అక్కడి అభ్యర్థిని ప్రకటించలేదని నేతల మధ్య చర్చ జరుగుతోంది. 

కామారెడ్డి నుంచే పోటీ చేస్తానంటున్న షబ్బీర్ అలీ

అభ్యర్థుల జాబితాను దశల వారీగా రిలీజ్ చేస్తామని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెప్పారు. తర్వాతి లిస్టులో షబ్బీర్ అలీ పేరు ఉంటుందని వెల్లడించారు. ఇదే విషయంపై షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. తాను కచ్చితంగా కామారెడ్డి (Kamareddy) నుంచి బరిలో ఉంటానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ హైకమాండ్ దీనిపై ప్రకటన చేస్తుందని, అప్పటిదాకా ఎదురుచూడాలని అన్నారు. 

నవంబర్ 30న పోలింగ్, డిసెంబర్ 3న ఫలితాలు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు  ( Telangana Elections)  నవంబర్ 3న నోటిఫికేషన్ విడుదల కానుంది. అదే రోజు నుంచి 10వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. నవంబర్ 30న పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడి కానున్నాయి. తెలంగాణతోపాటు చత్తీస్‌గఢ్‌, రాజస్థాన్, మిజోరం, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ నెలలో వీటికి పోలింగ్ జరగనుండగా.. డిసెంబర్ 3నే ఫలితాలు వెల్లడికానున్నాయి. తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య.. చత్తీస్‌గఢ్‌, రాజస్థాన్, మధ్యప్రదేశ్లో బీజేపీ కాంగ్రెస్ మధ్య హోరాహోరీగా పోరు సాగనుంది. వచ్చే ఏడాది ఏప్రిల్–మే నెలల్లో జరిగే పార్లమెంటు ఎన్నికలకు ఇవి సెమీఫైనల్‌గా మారనున్నాయి.