చైనా నుంచి నిధులు..న్యూస్‌క్లిక్ ఫౌండర్‌కు రిమాండ్‌

చైనాకు అనుకూలంగా వార్తలు రాస్తోందని ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యూస్ క్లిక్ పోర్టల్ పై కేసు నమోదు చేశారు దిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు. ఆ సంస్థకు చెందిన కార్యాలయంతో, జర్నలిస్టుల ఇళ్లు సహా 30 ప్రదేశాలలో దాడులు నిర్వహించారు. న్యూస్ క్లిక్ ఎడిటర్ ఇన్ చీఫ్తో పాటు పలువురు జర్నలిస్టులను స్పెషల్ సెల్ పోలీసులు తమ కార్యాలయానికి తీసుకెళ్లారు. న్యూస్ క్లిక్ ఆన్ లైన్ పోర్టల్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థాను ఢిల్లీ పోలీసుల అరెస్ట్ చేశారు. ఆయనతో […]

Share:

చైనాకు అనుకూలంగా వార్తలు రాస్తోందని ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యూస్ క్లిక్ పోర్టల్ పై కేసు నమోదు చేశారు దిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు. ఆ సంస్థకు చెందిన కార్యాలయంతో, జర్నలిస్టుల ఇళ్లు సహా 30 ప్రదేశాలలో దాడులు నిర్వహించారు. న్యూస్ క్లిక్ ఎడిటర్ ఇన్ చీఫ్తో పాటు పలువురు జర్నలిస్టులను స్పెషల్ సెల్ పోలీసులు తమ కార్యాలయానికి తీసుకెళ్లారు. న్యూస్ క్లిక్ ఆన్ లైన్ పోర్టల్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థాను ఢిల్లీ పోలీసుల అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. చైనా అనుకూల ప్రచారానికి నిధులు అందుకున్నారని ఆరోపణలు రావడంతో ఉప చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. 

చైనీస్ అనుకూల కంటెంట్‌ను ప్రచారం చేయడానికి చైనీస్ సంస్థలు డబ్బు అందించాయని ఆరోపణలతో, న్యూస్‌క్లిక్‌కి వ్యతిరేకంగా రూ.38 కోట్ల విదేశీ నిధులను స్వీకరించడంపై కేసు నమోదైంది. వారు 2018లో యూఎస్-ఆధారిత కంపెనీ నుండి విదేశీ పెట్టుబడి గా $9.6 మిలియన్లు అందుకున్నారు. ఇది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనాతో అనుసంధానించబడిందని దర్యాప్తులో వెల్లడైంది. న్యూస్‌క్లిక్ యూఎస్- ఆధారిత సంస్థల నుండి ఎగుమతి చెల్లింపుల్లో రూ.28 కోట్లను స్వీకరించింది, కానీ ఈ కంపెనీలకు అందించిన సేవలకు సంబంధించిన రుజువును అందించలేకపోయింది. నిధుల సమస్యలతో పాటు, గౌతమ్ నవ్లాఖా, తీస్తా సెతల్వాద్ కుటుంబ సభ్యులు మరియు జర్నలిస్టు పరంజోయ్ గుహా థాకుర్తాతో సహా కార్యకర్తలు మరియు జర్నలిస్టులకు చెల్లింపులు జరిగినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఇప్పటివరకు ప్రబీర్ పుర్కాయస్థతో పాటు ఆ సంస్థ హెచ్ఆర్ హెడ్ అమిత్ చక్రవర్తిని అరెస్టు చేసినట్లు ఢిల్లీ పోలీస్ అధికార ప్రతినిధి సుమన్ నల్వా వెల్లడించారు. అయితే అమిత్ చక్రవర్తికి ఈ కేసుతో ఏమిటి సంబంధం అనే వివరాలు పోలీసులు వెల్లడించలేదు.

ఆరోపణలు ఇవీ..

ఆగస్టు 5న అమెరికాకు చెందిన న్యూ యార్క్‌ టైమ్స్‌ ఓ కథనం ప్రచురించింది. చైనా ప్రభుత్వానికి సన్నిహితంగా ఉండే అమెరికాకు చెందిన మిలియనీర్‌ నెవిల్‌ రాయ్‌ సింగం నుంచి గ్లోబల్‌ నెట్‌వర్క్‌లో భాగంగా ఉన్న న్యూస్‌క్లిక్‌ నిధులు పొందినట్లు న్యూయార్క్‌ టైమ్స్‌ తన కథనంలో పేర్కొంది. ఆ తర్వాత ఈ ఏడాది ఆగస్టు 17న చట్టవిరుద్ధ కార్యకలాపాలు (నివారణ)- ఉపా చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు దిల్లీ పోలీసులు.

వరసగా మాపై సోదాలు చేస్తున్నారు

తమపై నిర్దిష్ట అభియోగాలేమిటో పోలీసులు తెలియపర్చలేదని న్యూస్‌క్లిక్‌ ఆరోపించింది. ‘‘ఎలక్ట్రానిక్‌ పరికరాలను స్వాధీనం చేసుకున్నా దానికి అనుసరించాల్సిన ప్రక్రియను పాటించలేదు. పాత్రికేయ విధులు నిర్వర్తించకుండా అడ్డుకునేలా కార్యాలయాన్ని సీజ్‌ చేశారు. పత్రికా స్వేచ్ఛను గౌరవించకపోవడమే కాకుండా విమర్శను దేశద్రోహంగా అభివర్ణించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. 2021 నుంచి కేంద్ర సంస్థలు మమ్మల్ని లక్ష్యంగా చేసుకున్నాయి. మా ఈ-మెయిళ్లు, బ్యాంకు లావాదేవీలను ఇదివరకే పరిశీలించారు. నగదు అక్రమ చలామణిపై ఈడీకి మాపై ఫిర్యాదులు రాలేదు. ఆర్థిక నేరాల విభాగం కూడా అభియోగపత్రం దాఖలు చేయలేకపోయింది’’ అని వివరించింది.

పోలీసుల తీరుపై విమర్శలు…

మరోవైపు న్యూస్ క్లిక్ తో సంబంధం ఉన్న జర్నలిస్టులు, రచయితల ఇళ్లపై పోలీసులు దాడి చేయడంపై ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తాము ఈ పరిణామాలను పర్యవేక్షిస్తున్నామని వివరాలతో వెల్లడిస్తామంటూ ట్వీట్ చేసింది. న్యూస్ క్లిక్ పై దాడులు విపక్ష కూటమి ఇండియా నేతలు తీవ్రంగా ఖండించారు. వాస్తవాలు మాట్లాడే వారి గళాన్ని అణచివేసేందుకు కేంద్రం సోదాలు చేసిందని విమర్శించారు. బీహార్ లో కుల గణనలో బయటపడిన విషయాల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి కేంద్రం న్యూస్ క్లిక్ అంశాన్ని తెరపైకి తీసుకు వచ్చిందని విపక్షాలు మండిపడ్డాయి. 

న్యూస్ క్లిక్ సంస్థకు చైనా నుంచి నిధులు అందుతున్నాయి అంటూ ఈ ఏడాది ఆగస్టులో న్యూయార్క్ టైమ్స్ లో కథనం ప్రచూరితమైంది. చైనా ప్రభుత్వానికి సన్నిహితంగా ఉండే అమెరికా మిలియనీర్ నివిల్ రాయి సింగం నుంచి గ్లోబల్ నెట్వర్క్ లో భాగంగా ఉన్న న్యూస్ క్లిక్ నిధులు పొందినట్లు ఆ కథలలో పేర్కొంది. దీంతో చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు మంగళవారం న్యూస్ క్లిక్ ఆఫీస్ తో పాటు ఆ సంస్థలో పనిచేసే జర్నలిస్టుల ఇల్లు సహా మొత్తం 30చోట్ల సోదాలు జరిపారు. ఈ సందర్భంగా భారీగా పోలీసు బలగాలను మోహరించారు. 

పోలీసు దాడుల విషయాన్ని ఇద్దరు జర్నలిస్టులు ధ్రువీకరించారు. తమ ల్యాప్‌టాప్‌లు, ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్‌ ద్వారా వెల్లడించారు. అంతకుముందు న్యూస్ క్లిక్ కు  ఫండింగ్ ఎక్కడినుంచి వస్తుందనే విషయమై దిల్లీలోని ఆ సంస్థ కార్యాలయంపై ఈడీ సోదాలు నిర్వహించింది. ఈడీ ఇచ్చిన సమాచారంతోనే ప్రస్తుతం దిల్లీ పోలీసు ప్రత్యేక విభాగం పోలీసులు దాడులు చేస్తున్నారని తెలుస్తోంది.