సచిన్‌ రికార్డు బద్దలు కొట్టిన కోహ్లి..!

దాయాది పాకిస్తాన్‌తో మ్యాచ్‌ అంటే టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి పూనకాలే అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతేడాది టీ20 వరల్డ్‌కప్‌-2022లో చిరకాల ప్రత్యర్థిపై భారత్‌కు తన అద్భుత ఇన్నింగ్స్‌తో చిరస్మరణీయ విజయం అందించిన తీరును ఎవరూ మర్చిపోలేరు.  ఇక తాజాగా మరోసారి పాక్‌పై అదిరిపోయే బ్యాటింగ్‌తో తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు. ఆసియా కప్‌-2023 సూపర్‌ -4 మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా అజేయ సెంచరీతో చెలరేగాడు.  సోమవారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత […]

Share:

దాయాది పాకిస్తాన్‌తో మ్యాచ్‌ అంటే టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి పూనకాలే అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతేడాది టీ20 వరల్డ్‌కప్‌-2022లో చిరకాల ప్రత్యర్థిపై భారత్‌కు తన అద్భుత ఇన్నింగ్స్‌తో చిరస్మరణీయ విజయం అందించిన తీరును ఎవరూ మర్చిపోలేరు.  ఇక తాజాగా మరోసారి పాక్‌పై అదిరిపోయే బ్యాటింగ్‌తో తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు. ఆసియా కప్‌-2023 సూపర్‌ -4 మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా అజేయ సెంచరీతో చెలరేగాడు. 

సోమవారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లి సెంచరీతో అదరగొట్టాడు. అతను ఆసియా కప్ 2023 సూపర్-4 రౌండ్ మ్యాచ్‌లో పాకిస్థాన్ బౌలర్లకు చుక్కలు చూపించి తన 77వ అంతర్జాతీయ సెంచరీని సాధించాడు. కోహ్లి 94 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 122 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కోహ్లీ తన 98వ పరుగు చేసిన వెంటనే దిగ్గజ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు కింగ్ కోహ్లీ. వన్డేల్లో అత్యంత వేగంగా 13 వేల పరుగులు చేసిన క్రికెటర్‌గా కోహ్లీ నిలిచాడు. కేవలం 267 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు. అదే సమయంలో సచిన్ 321 ఇన్నింగ్స్‌లలో 13 వేల వన్డే పరుగులు పూర్తి చేశాడు. వన్డే కెరీర్‌లో కోహ్లీకి ఇది 47వ సెంచరీ.

భారతదేశం నుండి రెండవ ఆటగాడు

13 వేల వన్డే పరుగుల సంఖ్యను చేరుకున్న ఆటగాళ్లలో కోహ్లి ప్రపంచంలో ఐదో ఆటగాడు కాగా భారతదేశం నుండి రెండవ ఆటగాడు. ఈ జాబితాలో 341 ఇన్నింగ్స్‌ల్లో 13 వేల పరుగులు చేసిన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ మూడో స్థానంలో ఉన్నాడు. శ్రీలంక మాజీ బ్యాట్స్‌మెన్ కుమార సంగక్కర (363 ఇన్నింగ్స్‌లు) నాలుగో స్థానంలో, సనత్ జయసూర్య (416) ఐదో స్థానంలో ఉన్నారు. వన్డేల్లో అత్యంత వేగంగా 8, 9, 10, 11, 12 వేల పరుగులు చేసిన రికార్డు కూడా కోహ్లీ పేరిట ఉంది. సచిన్ పేరిట ఉన్న మరో పవర్‌ఫుల్ రికార్డును బద్దలు కొట్టేందుకు కోహ్లి దూసుకుపోతున్నాడు. రానున్న రోజుల్లో కోహ్లి మూడు వన్డే సెంచరీలు సాధిస్తే.. ఈ ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్‌గా నిలుస్తాడు. సచిన్ తన వన్డే కెరీర్‌లో 49 వన్డే సెంచరీలు సాధించాడు.

మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే..

అంతకు ముందు ఆదివారం ఓపెనర్లు రోహిత్‌ శర్మ (56), శుబ్‌మన్‌ గిల్‌(58) అర్ధ శతకాలు సాధించారు. కాగా కొలంబోలో జరగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన పాకిస్తాన్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకున్న విషయం తెలిసిందే. మూడో స్థానంలో వచ్చిన కోహ్లి, KL రాహుల్ (106 బంతుల్లో 111 నాటౌట్)తో కలిసి గొప్ప శైలిలో ఆధిక్యం సాధించాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 233 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వన్డే ఆసియా కప్ చరిత్రలో ఇదే అతిపెద్ద భాగస్వామ్యం. భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ వర్షం కారణంగా ఆదివారం పూర్తి కాలేదు. దీని కారణంగా రిజర్వ్ డే రోజున అంటే సోమవారం ఇరు జట్లు తలపడ్డాయి. ఆదివారం కోహ్లి 8 పరుగులతో నాటౌట్‌గా నిలవగా, రాహుల్ 16 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. మరుసటి రోజు కూడా ఇద్దరూ తమ వికెట్లు నష్టపోకుండా పాక్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచి చిత్తు చిత్తు చేశారు.

ఎవరికి ఎన్ని ఇన్నింగ్స్‌ అవసరమయ్యాయంటే?

1. విరాట్‌ కోహ్లి- 267

2. సచిన్‌ టెండుల్కర్‌- 321

3. రిక్కీ పాంటింగ్‌- 341

4. కుమార్‌ సంగక్కర- 363

5. సనత్‌ జయసూర్య- 416.