రెండు ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయాలు గుజరాత్‌లో క్యాంపస్‌లను ఏర్పాటు చేస్తాయి: ప్రధాన్

ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో ఉన్నత విద్యపై మూడు ముఖ్యమైన నిబంధనలు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. విదేశీ యూనివర్సిటీలు భారత్‌లో క్యాంపస్‌లు ఏర్పాటు చేసుకునేందుకు, భారతీయ యూనివర్సిటీలు విదేశాల్లో బ్రాంచ్‌లు ప్రారంభించేందుకు, ప్రైవేట్ విద్యాసంస్థల్లో మెరుగైన నాణ్యతా నియంత్రణలు ఉండేలా నిబంధనలను కఠినతరం చేసేలా నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు ఆస్ట్రేలియన్ యూనివర్శిటీలు వొలోంగాంగ్ , డీకిన్ త్వరలో గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీ (గిఫ్ట్ సిటీ)లో […]

Share:

ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో ఉన్నత విద్యపై మూడు ముఖ్యమైన నిబంధనలు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. విదేశీ యూనివర్సిటీలు భారత్‌లో క్యాంపస్‌లు ఏర్పాటు చేసుకునేందుకు, భారతీయ యూనివర్సిటీలు విదేశాల్లో బ్రాంచ్‌లు ప్రారంభించేందుకు, ప్రైవేట్ విద్యాసంస్థల్లో మెరుగైన నాణ్యతా నియంత్రణలు ఉండేలా నిబంధనలను కఠినతరం చేసేలా నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో రెండు ఆస్ట్రేలియన్ యూనివర్శిటీలు వొలోంగాంగ్ , డీకిన్ త్వరలో గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీ (గిఫ్ట్ సిటీ)లో క్యాంపస్‌లను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బుధవారం తెలిపారు. ఇది రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలలో “అద్భుతమైన అధ్యాయాన్ని” జోడిస్తుందని ఉద్ఘాటించారు.

ఢిల్లీ యూనివర్సిటీలోని శ్రీ వెంకటేశ్వర కాలేజీలో జరిగిన కార్యక్రమంలో నాలుగు రోజుల విద్యా పర్యటన నిమిత్తం భారత్‌కు వచ్చిన ఆస్ట్రేలియా విద్యా మంత్రి జాసన్ క్లేర్‌ను కలిసి ప్రధాన్ ప్రసంగించారు.

“కనీసం 25 ప్రతిష్టాత్మక భారతీయ విశ్వవిద్యాలయాలు ఆస్ట్రేలియాలోని తమ ప్రత్యర్ధులతో ఒక రకమైన సంబంధం కలిగి ఉన్నాయి. వచ్చే వారం రెండు ప్రతిష్టాత్మక ఆస్ట్రేలియన్ విశ్వ విద్యాలయాలు భారతదేశానికి రానున్నందున మా ప్రయాణంలో మరో అద్భుతమైన అధ్యాయం జోడించబడుతుంది” అని ప్రధాన్ చెప్పారు.

వచ్చే వారం జరగనున్న ఆస్ట్రేలియా ప్రధాని భారత పర్యటన సందర్భంగా అన్ని పూర్తవుతాయని కేంద్ర మంత్రి తెలిపారు. ఇదిలా ఉండగా.. ఆస్ట్రేలియా మంత్రి భారత పర్యటన సందర్భంగా విద్యాపరమైన సంబంధాల కోసం రెండు దేశాల మధ్య 10 కొత్త అవగాహన ఒప్పందాలు (ఎంఓయులు) కుదుర్చుకోనున్నాయి.

“నాణ్యమైన విద్యను అందరికీ అందుబాటులో ఉండేలా.. తక్కువ ఖర్చుకే అందించడానికి భారతదేశం ఆస్ట్రేలియాతో భాగస్వామి కావాలని కోరుకుంటోంది. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారే ప్రయాణంలో భారత్‌కు ఆస్ట్రేలియా ఒక ముఖ్య భాగస్వామిగా మారుతుంది” అని ప్రధాన్ అన్నారు.

ఆస్ట్రేలియా మంత్రితో పాటు ఆస్ట్రేలియన్ విశ్వవిద్యాలయాల యొక్క 10 మంది వైస్ ఛాన్సలర్లు , ఇతర ఉన్నత విద్యావేత్తల ప్రతినిధి బృందంతో పాటు, యూనివర్సిటీ ఆఫ్ వోలోంగాంగ్ గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ , ఆస్ట్రేలియన్ మాజీ క్రికెటర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ కూడా ఉన్నారు.

రెండు దేశాలలో విద్యార్ధులకూ విద్య అందుబాటులో ఉండేలా అర్హతల పరస్పర గుర్తింపు కోసం ఒక యంత్రాంగాన్ని రూపొందించడానికి రెండు దేశాలూ గురువారం ఒక ముఖ్యమైన ఒప్పందంపై సంతకం చేయనున్నాయని క్లార్ తన ప్రసంగంలో చెప్పారు.

“ఒక భారతీయ విద్యార్థి ఆస్ట్రేలియన్ విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ పొందిన తరువాత ఇంకా భారతదేశంలోనే విద్యను కొనసాగించాలనుకుంటే వారికి ఖచ్చితంగా గుర్తింపు లభిస్తుందని దీని అర్థం. ఇప్పటివరకు భారతదేశం ఏ దేశంతోనైనా కుదుర్చుకున్న ఒప్పందాలలోకెల్లా ఇది అద్భుతమైన, అత్యంత అనుకూలమైన ఒప్పందమని నా విభాగం నాకు సలహా ఇచ్చింది.” అని క్లార్ చెప్పారు.

“ఇది ప్రారంభం మాత్రమే. ఇది రెండు దశల ప్రక్రియలో భాగం. మొదటిది, అర్హత డిగ్రీలను గుర్తించే విధానం. రెండవది పరస్పర గుర్తింపు ఒప్పందాలపై వృత్తులతో కలిసి పనిచేయడం, తద్వారా ఆస్ట్రేలియన్ , భారతీయ గ్రాడ్యుయేట్లు ఏ దేశంలోనైనా వృత్తిపరంగా ప్రాక్టీస్ చేయగలరు” అన్నారాయన.

గిల్‌క్రిస్ట్ వోలోంగాంగ్ యూనివర్సిటీకి గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నందున భారతదేశంలో యూనివర్సిటీ క్యాంపస్‌ను ఏర్పాటు చేయడంలో సహాయం చేస్తారని ఆస్ట్రేలియా మంత్రి ప్రకటించారు.