తెలంగాణలో ఫ్రీ బస్ సర్వీస్.. మహిళలకు సజ్జనార్ కీలక సూచన!

TSRTC Free Bus: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తూ మహాలక్ష్మి పథకం అమలులోకి తెచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా ఆర్డినరీ, ఎక్స్ ప్రెస్, పల్లె వెలుగు, మెట్రో బస్సుల్లో మహిళలు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకుంటున్నారు.

Courtesy: x

Share:

హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తూ మహాలక్ష్మి పథకం అమలులోకి తెచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా ఆర్డినరీ, ఎక్స్ ప్రెస్, పల్లె వెలుగు, మెట్రో బస్సుల్లో మహిళలు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకుంటున్నారు. డిసెంబర్ 9 నుంచి ఈ పథకం అమల్లోకి తెచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా బస్సుల్లో రద్దీ పెరిగింది. ఈ సోమవారం దాదాపు  51 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సాగించినట్లు అధికారులు తెలిపారు. గతంలో 40 శాతం మంది మహిళలే బస్సుల్లో ప్రయాణాలు సాగించగా, ఈ పథకం అమల్లోకి వచ్చాక వారి సంఖ్య 60 శాతానికి పెరిగినట్లు చెప్పారు. 

అయితే, ఈ పథకంపై ఇప్పటికే పలు విమర్శలు వచ్చాయి. ఉచితంగా సర్వీస్ నడపడం వల్ల రద్దీ పెరిగిందని, అదనపు బస్సులు ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఎక్కువగా వినిపిస్తోంది. అంతేకాకుండా, పురుషులు డబ్బులిచ్చి నిలబడి వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందంటూ ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ మరో ప్రకటన చేశారు. ఈ క్రమంలో ఈ పథకం విషయమై టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కీలక సూచనలు చేశారు. 

సజ్జనార్ కీలక సూచన:

'తక్కువ దూరం ప్రయాణించే వారు పల్లె వెలుగు బస్సుల్లో ఎక్కి సిబ్బందికి సహకరించాలి. మరోవైపు కొందరు మహిళలు ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ఎక్కి అనుమతించిన స్టేజీల్లో కాకుండా మధ్యలోనే బస్సులను ఆపమని సిబ్బందిపై ఒత్తిడి తెస్తున్నారని, దీనివల్ల ప్రయాణ సమయం పెరుగుతోంది. తక్కువ దూరం ప్రయాణించే మహిళలు ఎక్కువగా ఎక్స్ ప్రెస్ బస్సుల్లోనే ప్రయాణిస్తున్నట్లు టీఎస్ఆర్టీసీ యాజమాన్యం దృష్టికి వచ్చింది. దీని వల్ల దూర ప్రాంత ప్రయాణికులకు అసౌకర్యం కలుగుతుంది. ఇక నుంచి ఎక్స్‌ ప్రెస్‌ బస్సులను అనుమతించిన స్టేజీల్లోనే ఆపడం జరుగుతుంది,  దూర ప్రాంత ప్రయాణికులకు ప్రాధాన్యత ఇచ్చి సిబ్బందికి మహిళా ప్రయాణికులు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నా.' అంటూ ఎండీ సజ్జనార్ ఓ వీడియోను ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు.

ప్రయాణికుల సౌకర్యార్థం కొత్త బస్సుల గురించి కూడా సజ్జనార్ ఇప్పటికే ప్రస్తావించారు. 'ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలందించేందుకు కొత్త బస్సులను కొనుగోలు చేయాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. అందులో భాగంగా నాలుగైదు నెలల్లో 2 వేలకు పైగా కొత్త బస్సులు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. అందులో 400 ఎక్స్ ప్రెస్, 512 పల్లె వెలుగు, 92 లహరి స్లీపర్ కమ్ సీటర్, 56 ఏసీ రాజధాని బస్సులున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల విషయానికి వస్తే హైదరాబాద్ సిటీలో 540, తెలంగాణలో ఇతర ప్రాంతాలకు 500 బస్సులను వాడకంలోకి యాజమాన్యం తెస్తోంది. వీటిన్నటిని వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి అందుబాటులోకి తీసుకువచ్చేలా ప్రణాళికలు రూపొందించాం' అని సజ్జనార్ తెలిపారు.