‘ఇండియా’ కూటమికి తొలి పరీక్ష..

వచ్చే ఏడాది దేశంలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని మట్టికరిపించే లక్ష్యంతో విపక్ష పార్టీలు ఇండియా కూటమిగా ఏకమయ్యాయి. మరికొన్ని తటస్ధ విపక్షాలు కలిసి రాకపోయినా దాదాపు 28 పార్టీలు కలిసి ఏర్పాటు చేసుకున్న ఇండియా కూటమికి నిన్న తొలి పరీక్ష ఎదురైంది. ఇప్పటివరకూ పాట్నా, బెంగళూరు, ముంబైలో మూడు సమావేశాలు ఏర్పాటు చేసుకుని వచ్చే ఎన్నికల్లో సీట్ల పంపకాల వరకూ వచ్చిన ఇండియా కూటమికి నిన్న ఆరు రాష్ట్రాల్లో తొలి పరీక్ష ఎదురైంది. ఆరు రాష్ట్రాల్లోని […]

Share:

వచ్చే ఏడాది దేశంలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని మట్టికరిపించే లక్ష్యంతో విపక్ష పార్టీలు ఇండియా కూటమిగా ఏకమయ్యాయి. మరికొన్ని తటస్ధ విపక్షాలు కలిసి రాకపోయినా దాదాపు 28 పార్టీలు కలిసి ఏర్పాటు చేసుకున్న ఇండియా కూటమికి నిన్న తొలి పరీక్ష ఎదురైంది. ఇప్పటివరకూ పాట్నా, బెంగళూరు, ముంబైలో మూడు సమావేశాలు ఏర్పాటు చేసుకుని వచ్చే ఎన్నికల్లో సీట్ల పంపకాల వరకూ వచ్చిన ఇండియా కూటమికి నిన్న ఆరు రాష్ట్రాల్లో తొలి పరీక్ష ఎదురైంది. ఆరు రాష్ట్రాల్లోని 7 అసెంబ్లీ సీట్లకు ఇవాళ ఉపఎన్నికలు జరుగుతున్నాయి.

వీటిలో జార్ఖండ్‌లోని డుమ్రీ, త్రిపురలోని బోక్సానగర్ మరియు ధన్‌పూర్, ఉత్తరాఖండ్‌లోని బాగేశ్వర్, ఉత్తరప్రదేశ్‌లోని ఘోసి, కేరళలోని పుతుపల్లి, పశ్చిమ బెంగాల్‌లోని ధూప్‌గురి అసెంబ్లీ స్ధానాలు ఉన్నాయి. వీటిలో పశ్చిమబెంగాల్, యూపీలో ఇండియా కూటమి పక్షాలకు అసలు పరీక్ష ఎదురుకాబోతోంది. ఇప్పటి వరకూ ఐక్యంగా ఉన్నట్లు చెప్పుకుంటున్న ఇండియా కూటమి పార్టీలు ఈ రెండు చోట్ల ఏం చేయబోతున్నాయనేది ఇవాళ తేలిపోనుంది.

ఉత్తరప్రదేశ్‌లోని ఘోసీ స్థానానికి భాజపా నుంచి దరా సింగ్ చౌహన్‌, సమాజ్‌వాదీ పార్టీ నుంచి సుధాకర్‌ సింగ్‌ పోటీలో ఉన్నారు. ఇక్కడ ఎస్పీకి మద్దతుగా కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ, వామపక్షాలు సహా పలు విపక్ష కూటమి పార్టీలు అభ్యర్థులను నిలబెట్టలేదు. దీంతో ఘోసీలో భాజపా, ‘ఇండియా’ కూటమి మధ్య ద్విముఖ పోరు నెలకొంది.

కేరళ మాజీ సీఎం ఊమెన్‌ చాందీ మరణంతో పూతుపల్లి నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ స్థానానికి రికార్డు స్థాయిలో 53 ఏళ్ల పాటు చాందీ ప్రాతినిధ్యం వహించారు. తాజాగా జరుగుతున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌ తరఫున ఊమెన్‌ కుమారుడు చాందీ ఊమెన్‌ పోటీలో ఉండగా.. సీపీఎం, భాజపా కూడా అభ్యర్థులను నిలబెట్టింది. దీంతో ఈ ఎన్నిక త్రిముఖ పోరుగా మారింది.

ఝార్ఖండ్‌లోని దుమ్రి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర మంత్రి, జేఎంఎం నేత జగన్నాథ్‌ మహతో మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇండియా కూటమి తరఫున జగన్నాథ్ మహతో సతీమణి బేబి దేవి బరిలో ఉండగా.. ఎన్డీయే తరఫున యశోదా దేవి పోటీ చేస్తున్నారు. మజ్లీస్‌ పార్టీ కూడా అభ్యర్థిని నిలబెట్టింది.

త్రిపురలో ధాన్‌పుర్‌, బోక్సానగర్‌ ఉప ఎన్నికల్లో ప్రధానంగా సీపీఎం, భాజపా మధ్య పోటీ నెలకొంది. ఇక్కడ సీపీఎంకు మద్దతుగా కాంగ్రెస్‌, తిప్రా మోథా పార్టీలు అభ్యర్థులను నిలబెట్టలేదు.

ఉత్తరాఖండ్‌లోని బాగేశ్వర్‌ స్థానానికి ఐదుగురు అభ్యర్థులు పోటీ చేస్తుండగా.. ప్రధానంగా కాంగ్రెస్, భాజపా మధ్యే గట్టి పోటీ ఉంది.

పశ్చిమ బెంగాల్‌లోని ధూప్‌గురి స్థానంలో త్రిముఖ పోరు నెలకొంది. ఇక్కడ విపక్ష కూటమిలోని పార్టీలు వేర్వేరుగా అభ్యర్థులను నిలబెట్టాయి. తృణమూల్‌ కాంగ్రెస్‌, కాంగ్రెస్‌-వామపక్ష కూటమి, భాజపా మధ్య ప్రధానంగా పోటీ ఉంది.

ఈ 7 సీట్లకు ఇవాళ ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. ఆరు రాష్ట్రాల్లో జరుగుతున్న ఈ ఎన్నికల కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ ఎన్నికల్లో గెలుపు అటు ఎన్డీయే, ఇటు ఇండియా కూటమికి కీలకంగా మారడంతో ప్రతీ పార్టీ కూడా వీటిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అయితే మొత్తం ఏడు సీట్లలో ఇండియా కూటమి పార్టీలకూ, ఎన్డీయే కూటమి పార్టీలకూ మధ్య ముఖాముఖీ పోరు సాగుతుండగా.. యూపీ, బెంగాల్లోని రెండు సీట్లలో పోరు మరింత ఆసక్తికరంగా మారింది.

ఉత్తర్ ప్రదేశ్ లోని ఘోసి స్ధానానికి జరుగుతున్న ఉప ఎన్నికలో ఇండియా కూటమి పార్టీ అయిన సమాజ్ వాదీ పార్టీ పోటీ చేస్తుండగా.. బీజేపీ తరఫున ఎస్పీ నుంచి ఫిరాయించిన మాజీ ఎమ్మెల్యే దారాసింగ్ చౌహాన్ బరిలో నిలిచారు. అయితే కాంగ్రెస్, బీఎస్పీలు అభ్యర్ధుల్ని పోటీలో పెట్టలేదు. దీంతో వీరి ఓటు బ్యాంకు ఓటువైపు మొగ్గుతుందన్నది కీలకంగా మారింది. అదే సమయంలో ఓబీసీలు ఎక్కువగా ఉన్న ఈ సీటులో జరుగుతున్న ద్విముఖ పోరులో ఇండియాకూటమి పార్టీ అయిన ఎస్పీకి కాంగ్రెస్ లభించే సహకారం యూపీలో భవిష్యత్ సమీకరణాల్ని నిర్ణయించబోతోంది.

అలాగే పశ్చిమబెంగాల్ లోని ధూప్ గురి స్ధానంలోనూ తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ అభ్యర్ధుల మధ్య ఉపఎన్నికల పోరు జరుగుతోంది. అయితే ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్న కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల నుంచి ఇక్కడ తృణమూల్ అభ్యర్ధికి మద్దతు లభించాల్సి ఉంది. ఈ విషయంలో లెఫ్ట్, కాంగ్రెస్ ఏంతమేరకు తమ ఓట్లు వేయిస్తాన్నది ఉత్కంఠ రేపుతోంది. ఇలా యూపీ, బెంగాల్లో జరుగుతున్న ఉపఎన్నికల్లో ఏమాత్రం తేడా వచ్చినా ఇండియా కూటమి బీటలు వారడం ఖాయం. దీంతో అందరి దృష్టీ ఈ ఉపఎన్నికలపై నెలకొంది.