పూంచ్ ఘటన: ఆర్మీ ట్రక్కు పై ఉగ్రవాదులు స్టీల్ బుల్లెట్లను వాడారు.

జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ లో ఆర్మీ ట్రక్కు పై మెరుపు దాడి చేసిన ఉగ్రవాదులు సాయుధ కవచాన్ని చీల్చగల స్టీల్ బుల్లెట్లను ఉపయోగించినట్లు సమాచారం. గురువారం మధ్యాహ్నం భటా ధురియన్ దట్టమైన అడవి ప్రాంతం సమీపంలోని గ్రామానికి ఇఫ్తార్ విందు కోసం తినుబండారాలు తీసుకెళ్తున్న ఒంటరి ఆర్మీ ట్రక్కు పై ఉగ్రవాదులు దాడి చేయడంతో వాహనం మంటల్లో చిక్కుకుంది. అక్కడికక్కడే ఐదుగురు సైనికులు మరణించారు. ఒకరు గాయపడ్డారు. ఐదుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయిన తీవ్రవాద దాడికి సంబంధించి […]

Share:

జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ లో ఆర్మీ ట్రక్కు పై మెరుపు దాడి చేసిన ఉగ్రవాదులు సాయుధ కవచాన్ని చీల్చగల స్టీల్ బుల్లెట్లను ఉపయోగించినట్లు సమాచారం. గురువారం మధ్యాహ్నం భటా ధురియన్ దట్టమైన అడవి ప్రాంతం సమీపంలోని గ్రామానికి ఇఫ్తార్ విందు కోసం తినుబండారాలు తీసుకెళ్తున్న ఒంటరి ఆర్మీ ట్రక్కు పై ఉగ్రవాదులు దాడి చేయడంతో వాహనం మంటల్లో చిక్కుకుంది. అక్కడికక్కడే ఐదుగురు సైనికులు మరణించారు. ఒకరు గాయపడ్డారు. ఐదుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయిన తీవ్రవాద దాడికి సంబంధించి 16 మంది పోలీసులు ప్రశ్నించడానికి అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలం నుంచి మరికొన్ని తూటాలను స్వాధీనం చేసుకున్నారు. వారు ప్రయాణిస్తున్న ట్రక్కు పై ఉగ్రవాదులు మెరుపు దాడి చేయడంతో ఆర్మీ రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్ కు చెందిన సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదులు ట్రక్కు పై స్టీల్  బుల్లెట్లు, గ్రెనేడ్ల తో విరుచుకుపడ్డారు. ఫలితంగా ఇంజిన్ ట్యాంక్ పగిలిపోయింది. దాంతో వాహనంలో మంటలు చెలరేగి ట్రక్కును మంటలు చుట్టుముట్టాయి.

తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాల కోసం మోహరించిన రాష్ట్రీయ రైఫిల్స్ విభాగానికి చెందిన సైనికులు, నేషనల్ సెక్యూరిటీ గార్డ్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సహా వివిధ ఏజెన్సీలకు చెందిన నిపుణులు గత రెండు రోజులుగా జరిగిన ప్రదేశాన్ని సందర్శించారు. ఉగ్రవాదులు వేసిన ఘోరమైన ఆకస్మిక దాడి గురించి అధికారులు త్వరలోనే పూర్తి విషయాలను వెల్లడించనున్నారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 12 మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సైన్యం వెల్లడించింది. మరోవైపు పూంచ్ ఉగ్రదాడి లో పాల్గొన్న ముష్కరుల కోసం సైన్యం వేటను మరింత తీవ్రం చేసింది. ఆర్మీ నార్తన్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఆదివారం స్వయంగా ఉదమ్  పూర్లోని కమాండ్ ఆసుపత్రిని సందర్శించారు. ఉగ్ర దాడిలో గాయపడిన సైనికుడితో ఆయన మాట్లాడారు ఇప్పటికే దాడి జరిగిన ప్రదేశాన్ని కూడా ద్వివేది పరిశీలించారు. ఆ ప్రాంతంలో భద్రత పరిస్థితిని దళాలు చేపట్టిన కూంబింగ్ ఆపరేషన్ ను ఆయన సమీక్షించారు.

అక్టోబర్ 2021 దాడి తర్వాత సైన్యంపై ఇది రెండవది. ఇందులో ఇద్దరు జూనియర్ కమిషన్ ఆఫీసర్లు సహా తొమ్మిది మంది సైనికులు మరణించారు. ఉగ్రవాదులు సమీపంలోని అడవుల్లోకి పారిపోయిన తరువాత వారి జాడ తెలియలేదు. గురువారం దాడి తరువాత సీనియర్ పోలీసు ఆర్మీ అధికారులు సంఘటన స్థలాన్ని సందర్శించారు. దుండగుల ఆచూకీ కోసం ఆ ప్రాంతంలో  పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. నేరస్తులను గుర్తించేందుకు భద్రతా బలగాలు డ్రోన్లు, హెలికాఫ్టర్లు, స్నిఫర్ డాగ్ లను కూడా రంగంలోకి దింపారు. శుక్రవారం జాతీయ దర్యాప్తు సంస్థ, రాష్ట్ర దర్యాప్తు సంస్థ, ఇంటిలిజెన్స్ బ్యూరో,   డిజిపి దిల్ బాగ్ సింగ్, అదనపు డీజీపీ ముఖేష్ సింగ్ తో సహా పలువురు పోలీసు ఉన్నతాధికారులు దర్యాప్తు కోసం సంఘటన స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు.  ఉగ్రవాదులు సాయుధ కవచంలోకి చొచ్చుకుపోయే స్టీల్ కోర్ బుల్లెట్లను ఉపయోగించారని ఉన్నతాధికారులు తెలిపారు. ఉగ్రవాదులు పారిపోయే ముందు సైనికుల ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని అపహరించినట్లు వారు చెప్పారు. దాడి జరిగిన ప్రాంతం చాలా కాలంగా తీవ్రవాద రహితంగా గుర్తించినప్పటికీ భటా దురియన్ అటవీ ప్రాంతం దాని భౌగోళిక స్వరూపం, దట్టమైన అటవీ ప్రాంతం కారణంగా నియంత్రణ రేఖ దాటి భారత్ లోకి చొరబడేందుకు ప్రయత్నించే ఉగ్రవాదుల చొరబాటు మార్గంగా మారింది. అక్టోబర్ 2021లో మూడు వారాలపాటు కొనసాగిన శోధన ఆపరేషన్ లో అటవీ ప్రాంతంలో నాలుగు రోజులలోనే ఉగ్రవాదులతో జరిగిన రెండు ప్రధాన కాలుపుల్లో 9 మంది సైనికులు మరణించారు.