కాళేశ్వరంపై జ్యుడీషియల్ ఎంక్వైరీ వేసి నిజాలు తేలుస్తాం: మంత్రి ఉత్తమ్

Medigadda Barage: రూ.లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో మూడేళ్లకే మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవటం అత్యంత బాధాకరమని.. త్వరలోనే నిజానిజాలు బయటపెడతామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి (Uttam Kumar Reddy) తెలిపారు.

Courtesy: x

Share:

రూ.లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో మూడేళ్లకే మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవటం అత్యంత బాధాకరమని.. త్వరలోనే నిజానిజాలు బయటపెడతామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి (Uttam Kumar Reddy) తెలిపారు. మేడిగడ్డ ఘటనకు సంబంధించి క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించేందుకు శుక్రవారం మంత్రుల బృందం మేడిగడ్డను సందర్శించింది. మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, శ్రీధర్‌ రెడ్డి, పొంగులేటి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్‌లు ప్రత్యేక హెలిక్యాప్టర్ లో మేడిగడ్డకు చేరుకుని సమీక్ష నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిస్థితిపై మంత్రులకు అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. 

ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. "కాళేశ్వరం కంటే చేవెళ్ల ప్రాణహితకే కాంగ్రెస్ ప్రాధాన్యత ఇస్తోంది. 16 లక్షల ఎకరాల టార్గెట్ తో రూ.38వేల కోట్లతో ప్రాణహిత చేపట్టాం. మహారాష్ట్రలో కొద్దిపాటి ముంపుతో ప్రాణహిత పూర్తయ్యేది. కానీ, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రాణహిత ప్రాజెక్టును పక్కన పెట్టి మూడు బ్యారేజ్‌లు కట్టారు. రూ.38 వేల కోట్లతో 16 లక్షల ఎకరాలకు నీరందే ప్రాజెక్టును పక్కన పెట్టి కాళేశ్వరం కట్టారు. భారీ వ్యయం చేసి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుల్లో లోపాలు ఎందుకు వస్తున్నాయి. దీన్ని మేం సీరియస్‌గా తీసుకున్నాం. మేడిగడ్డ పిల్లర్లు 5 ఫీట్ల లోతుకు కుంగిపోయాయి.దీనిపై గత ప్రభుత్వం విచారణ చేపట్టకపోవడం విచారకరం. అన్నారం బ్యారేజికి కూడా నష్టం జరిగింది. పిల్లర్లు కుంగడంపై అప్పటి ముఖ్యంత్రి కేసీఆర్ నోరు మెదపలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం రూ.80వేల కోట్ల నుంచి లక్షనర కోట్లకు చేరింది. ఇప్పటి వరకు రూ.95వేల కోట్లు ఖర్చు అయ్యింది. ప్రాజెక్టు కింద కొత్త ఆయకట్టు లక్ష ఎకరాలు మాత్రమే.  కాళేశ్వరంతో వడ్డీల భారం తప్పితే ఎలాంటి ప్రయోజనం లేదు. త్వరలోనే కాళేశ్వరంపై జ్యూడిషియల్ ఎంక్వైరీ వేస్తాం" అని తెలిపారు.

అసెంబ్లీలో సాగునీటి ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. ఆర్ధిక పరిస్థితి, విద్యుత్‌పై శ్వేతపత్రాలు విడుదల చేసినట్టే లక్ష కోట్ల సాగు నీటి ప్రాజెక్టుల వ్యవహారాన్ని కూడా ప్రజల ముందు ఉంచాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. మేడిగడ్డ వైఫల్యానికి తమ బాధ్యత లేదనే ఎల్‌ అండ్‌ టి వాదన విషయంలో వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతామని ఉత్తమ్‌ కుమార్ రెడ్డి చెప్పారు.

 ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పాలనలో కట్టడాలు ఎలా జరిగాయి? అవి ఎందుకు పాడైపోయాయి? తెలంగాణ సంపదను సరైన విధానంలో ఖర్చు చేశారా? లేదా? అనే విషయాలపై సమీక్ష చేయడానికి వచ్చామని చెప్పారు. రాష్ట్ర ప్రజలకు అన్ని విషయాలను తెలియజేయడానికే వచ్చామని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మేడిగడ్డ సందర్శనకు వచ్చిన రాహుల్ గాంధీ సమక్షంలో ఇచ్చిన హామీలను ఖచ్చితంగా అమలు చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు.

గత ప్రభుత్వ హయంలో మేడిగడ్డ ఘటనలో కుట్ర ఉందని కేసులు పెట్టారని, వాస్తవ పరిస్థితిని తెలుసుకోడానికి తాము వచ్చామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. వాస్తవ పరిస్థితిని తెలంగాణ ప్రజలకు తెలియ చేయాల్సిన అవసరం ఉందన్నారు. అప్పటి ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ప్రకటన చేయలేదని ప్రశ్నించారు. కేటీఆర్‌ చిన్న విషయం అంటున్నారని, ఆ విషయాలను బయటకు తీస్తామని, అన్ని ప్రజల ముందు ఉంచుతామన్నారు. ఏమి జరిగిందో ప్రజలే నిర్ణయిస్తారని చెప్పారు.