6 గ్యారెంటీలకు అప్లికేషన్ ఫాం రెడీ.. డిసెంబర్ 28 నుంచి దరఖాస్తుల స్వీకరణ

Telangana CM Revant Reddy: అర్హులైన లబ్దిదారులందరికీ పథకాలను అందించడమే తమ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేందుకు కృషి చేస్తోందని అన్నారు.

Courtesy: x

Share:

హైదరాబాద్: అర్హులైన లబ్దిదారులందరికీ పథకాలను అందించడమే తమ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేందుకు కృషి చేస్తోందని అన్నారు. ఆరు గ్యారంటీలకు సంబంధించిన అభయ హస్తం దరఖాస్తు ఫాంను సీఎం రేవంత్ రెడ్డి బుధవారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పలువురు మంత్రులతో కలిసి విడుదల చేశారు. సచివాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రజాపాలన అభయహస్తం ఆరు గ్యారంటీల లోగో, పోస్టర్‌, దరఖాస్తు ఫారంను విడుదల చేశారు. డిసెంబర్ 28వ తేదీ నుంచి పథకాలకు అర్హులైన వారు ఈ అప్లికేషన్ ను గ్రామాలు, పట్టణాల్లో సంబంధిత అధికారులకు అందించాల్సి ఉంటుంది.

జనవరి 6వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ
డిసెంబరు 28 నుంచి గ్రామాలు, పట్టణాలు, మున్సిపల్‌ వార్డుల్లో ఐదు పథకాలకు (మహాలక్ష్మి, రైతుభరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత) సంబంధించిన దరఖాస్తులను స్వీకరిస్తామని రేవంత్ తెలిపారు. జనవరి 6వ తేదీ వరకు గ్రామ సభల ద్వారా దరఖాస్తుల స్వీకరణ ఉంటుందన్నారు. ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్లి న్యాయం చేసేందుకు యత్నిస్తుందని తెలిపారు. ఈ దరఖాస్తుల ప్రక్రియకు ప్రతి మండలానికి తహసీల్దార్‌ బాధ్యత వహిస్తారని, ప్రతి అధికారి రోజూ రెండు గ్రామాలను సందర్శిస్తారని తెలిపారు. గడీల మధ్య జరిగిన పాలనను గ్రామాలకు తీసుకువస్తున్నామన్నారు. 

కేటీఆర్ దోచుకున్న రూ.లక్ష కోట్లలో రూ.లక్ష కక్కించాం
"ప్రజావాణిలో సమస్య పరిష్కారం కాలేదని ఓ మహిళ కేటీఆర్‌ను కలిసినట్లు తెలిసింది. బాధిత మహిళకు కేటీఆర్‌ రూ.లక్ష సాయం అందించారు. కేటీఆర్‌ దోచుకున్న రూ.లక్ష కోట్లలో బాధితురాలికి రూ.లక్ష ఇచ్చారు. దోచుకున్న సొమ్ము మొత్తం ప్రజలకు చేరేలా చేస్తాం. కేసీఆర్‌ హయాంలో 22 కొత్త కార్లు కొని దాచి పెట్టారు. మూడోసారి అధికారంలోకి వస్తే కార్లు వాడుదామనుకున్నారు." అని రేవంత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌, సభ్యులను నియమిస్తాం
"రేషన్‌ కార్డుల జారీ అనేది నిరంతర ప్రక్రియ. ఏడాదిలోగా 2లక్షల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తాం. అర్హులైన ప్రతిఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతాయి. టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ లేకుండా పరీక్షల ప్రక్రియ జరగదు. టీఎస్‌పీఎస్సీ సభ్యులు ఇప్పటికే రాజీనామాలు సమర్పించారు. గవర్నర్‌ నిర్ణయం  తీసుకున్నాక కొత్త బోర్డు ఏర్పాటు చేస్తాం. టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌, సభ్యులను నియమిస్తాం. అనంతరం ఉద్యోగ నియామకాల పోటీ పరీక్షలు నిర్వహిస్తాం. గ్రూప్‌- 2 పరీక్షలపై అధికారులతో చర్చించి నిర్ణయిస్తాం. రైతుబంధుకు సంబంధించి ఎలాంటి పరిమితి విధించలేదు. మేడిగడ్డకు సంబంధించి న్యాయ విచారణ జరుగుతోంది. విచారణ తర్వాత ఎల్‌ అండ్‌ టీ, అధికారుల పాత్ర ఏమిటనేది తెలుస్తుంది. గత ప్రభుత్వ అవినీతిపై శ్వేతపత్రాలు విడుదల చేశాం. ₹6.71లక్షల కోట్లు అప్పులు చేసి నిండా ముంచారు. పరిస్థితుల నుంచి తేరుకుని ముందుకు వెళ్లేందుకు కృషి చేస్తున్నాం. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను రాబడతాం’’ అని రేవంత్ రెడ్డి తెలిపారు.

ఉర్దూలోనూ దరఖాస్తుల స్వీకరణ ఉండాలి
హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రభుత్వం ముందు కీలక డిమాండ్ ఉంచారు. ఆ ఐదు హామీల అమలుకు ప్రభుత్వ ప్రజాపరిపాలన దరఖాస్తుల స్వీకరణ కూడా ఉర్దూ భాషలోనే ఉండాలన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, సీఎస్‌ శాంతికుమారిని కోరారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని లబ్ధి పొందాలన్నారు.