పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు..అజెండా మాత్రం చెప్ప‌డంలేదు

పార్లమెంట్‌ సమావేశాల సందర్బంగా మోదీ సర్కార్‌పై ప్రతిపక్షాలు పెట్టిన అవిశ్వాస తీ​ర్మానం వీగిపో​యింది. ఈ క్రమంలో మణిపూర్‌ ఘటనపై మోదీ స్పందించాలని ప్రతిపక్ష నేతలు పట్టుబట్టారు. దీంతో, మణిపూర్‌పై స్పందించిన ప్రధాని మోదీ.. అక్కడ శాంతి నెలకొల్పే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది అంటూ కాంగ్రెస్‌, ప్రతిపక్ష పార్టీల నేతలకు గట్టి సమాధానం ఇచ్చారు.  మొత్తం 23 రోజుల పాటు జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో.. మొత్తం 23 బిల్లులకు లోక్ సభ, రాజ్యసభలు ఆమోదం తెలిపాయి. ఇదిలా ఉండగా […]

Share:

పార్లమెంట్‌ సమావేశాల సందర్బంగా మోదీ సర్కార్‌పై ప్రతిపక్షాలు పెట్టిన అవిశ్వాస తీ​ర్మానం వీగిపో​యింది. ఈ క్రమంలో మణిపూర్‌ ఘటనపై మోదీ స్పందించాలని ప్రతిపక్ష నేతలు పట్టుబట్టారు. దీంతో, మణిపూర్‌పై స్పందించిన ప్రధాని మోదీ.. అక్కడ శాంతి నెలకొల్పే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది అంటూ కాంగ్రెస్‌, ప్రతిపక్ష పార్టీల నేతలకు గట్టి సమాధానం ఇచ్చారు. 

మొత్తం 23 రోజుల పాటు జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో.. మొత్తం 23 బిల్లులకు లోక్ సభ, రాజ్యసభలు ఆమోదం తెలిపాయి. ఇదిలా ఉండగా పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఐదు రోజుల పాటు ఈ ప్రత్యేక సెషన్ జరగనున్నట్లు కేంద్ర మంత్రి తాజాగా వెల్లడించారు. అయితే ఈ ప్రత్యేక సమావేశాలు ఎందుకు నిర్వహిస్తున్నారన్నది మాత్రం కేంద్ర ప్రభుత్వం చెప్పలేదు. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు ఉన్న సమయంలో ఇలా ప్రత్యేక సమావేశాలకు పిలుపును ఇవ్వడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. సెప్టెంబర్ 18 వ తేదీ నుంచి సెప్టెంబరు 22 వ తేదీ వరకు స్పెషల్ సెషన్ ఆఫ్ పార్లమెంట్ నిర్వహించనున్నట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. మొత్తం ఐదు రోజుల పాటు పార్లమెంటు ఉభయ సభల సమావేశాలు జరగనున్నట్లు కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి గురువారం ట్విట్టర్ (ఎక్స్‌లో) ద్వారా వెల్లడించారు. 

అయితే ఈ అమృత్ కాలంలో నిర్వహించే పార్లమెంట్ సమావేశాల్లో ఫలవంతమైన చర్చలు జరుగుతాయని కేంద్ర ప్రభుత్వం ఎదురు చూస్తున్నట్లు మంత్రి తెలిపారు. అయితే ఈ ప్రత్యేక సమావేశాలకు కేంద్రం ఎందుకు పిలుపునిచ్చిందనే విషయాన్ని మాత్రం మంత్రి వెల్లడించలేదు. ఈ ప్రత్యేక సమావేశాల్లో 10 కి పైగా కీలక బిల్లులను ప్రవేశపెట్టి వాటికి ఆమోదం తెలిపే అవకాశం ఉందని తెలుస్తోంది.

అయితే ఈ పార్లమెంటు సమావేశాలు 17వ లోకసభలో 13 సెషన్ కాగా.. రాజ్యసభలో 261వ ఎడిషన్ అని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. అయితే అనుకోకుండా ఒక్కసారిగా ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు నిర్వహించనున్నట్లు కేంద్రం పిలుపునివ్వడంతో రాజకీయ వర్గాలతోపాటు విశ్లేషకుల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎవరూ ఊహించని విధంగా ఐదు రోజులపాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించటం రాబోయే రాజకీయంగా కలకలం రేపుతోంది. 

నిజానికి గత సమావేశాల్లో ప్రభుత్వం అన్ని బిల్లులనూ ఆమోదించుకున్న తర్వాతే అవిశ్వాస తీర్మానంపై చర్చను చేపట్టింది. ఆ సమావేశాల్లో ప్రవేశపెట్టిన నేర చట్టాలకు సంబంధించిన బిల్లులను పార్లమెంటరీ కమిటీకి పంపారు. ఇటీవల మూడు రోజులపాటు దానిపై చర్చలు జరిగాయి. అయితే ఉన్నట్టుండి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాల్సిన అవసరం ఏముంది.. ఈ సమావేశాల్లో ఏయే అంశాలపై చర్చించనున్నారు అనేది తీవ్ర ఉత్కంఠగా మారింది. 

కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్‌కు ముందుస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన ఏమైనా ఉందా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇటీవలె పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిశాయి. జులై 20 వ తేదీన ప్రారంభమైన ఈ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. ఆగస్ట్ 11వ తేదీ వరకు జరిగాయి. మణిపూర్‍‌లో చెలరేగిన హింస కారణంగా అదే అంశంపై పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లాయి.

ప్రతిపక్షాలు ఏకతాటిపైకి చేరుకుంటోన్న ప్రస్తుత పరిస్థితుల్లో.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలను తీసుకునే దిశగా అడుగులు వేయబోతోందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. పార్లమెంట్‌ను రద్దు చేసినా చేయొచ్చని అంచనాలు వెలువడుతున్నాయి. జమిలి లేదా మధ్యంతరం వైపు మొగ్గు చూపొచ్చనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీన్ని మరింత బలపరిచేలా.. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలకు పిలుపునివ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది.