క‌ర్ణాట‌క నుంచే రాజ్య‌స‌భ‌కు సోనియా

కర్ణాటకలో నాలుగు స్థానాలకు జరిగే రాజ్యసభ ఎన్నికలకు ఎనిమిది నెలల సమయం ఉంది. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో పాటు సయ్యద్ నసీర్ హుస్సేన్, సుప్రియా శ్రీనాథ్ లను రాజ్యసభకు పంపించాలని ఊహాగానాలు మొదలైనాయి. సోనియా గాంధీని రాజ్యసభకు పంపించి మేడమ్ దగ్గర మంచి మార్కులు కొట్టేయాలని సిద్దరామయ్య బ్యాచ్ ప్రయత్నిస్తున్నదని తెలిసింది. నలుగురు ఎంపీలు చంద్రశేఖర్, సయ్యద్ నసీర్ హుస్సేన్, డాక్టర్ ఎల్ హనుమంతయ్య, రాజీవ్ చంద్రశేఖర్ పదవీకాలం 2024 ఏప్రిల్ 2వ తేదీతో […]

Share:

కర్ణాటకలో నాలుగు స్థానాలకు జరిగే రాజ్యసభ ఎన్నికలకు ఎనిమిది నెలల సమయం ఉంది. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో పాటు సయ్యద్ నసీర్ హుస్సేన్, సుప్రియా శ్రీనాథ్ లను రాజ్యసభకు పంపించాలని ఊహాగానాలు మొదలైనాయి. సోనియా గాంధీని రాజ్యసభకు పంపించి మేడమ్ దగ్గర మంచి మార్కులు కొట్టేయాలని సిద్దరామయ్య బ్యాచ్ ప్రయత్నిస్తున్నదని తెలిసింది.

నలుగురు ఎంపీలు చంద్రశేఖర్, సయ్యద్ నసీర్ హుస్సేన్, డాక్టర్ ఎల్ హనుమంతయ్య, రాజీవ్ చంద్రశేఖర్ పదవీకాలం 2024 ఏప్రిల్ 2వ తేదీతో ముగుస్తుంది. ప్రస్తుత బలం ప్రకారం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటక రాష్ట్రాల్లో నాలుగింటికి మూడు సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఏఐసీసీ సమన్వయకర్త నాసీర్‌కు మరోసారి రాజ్యసభ పదవి ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ సిద్దం అయ్యింది.

ఈ నేపథ్యంలో సోనియాగాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా చీఫ్ శ్రీనాథ్‌ను కూడా కాంగ్రెస్ పార్టీ రాజ్యసభకు పంపించాలని ఆలోచిస్తుందని తెలిసింది. అలాగే, విపక్షాల సమావేశం కోసం సోనియా గాంధీ బెంగళూరు పర్యటనకు వచ్చిన సందర్భంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పార్టీలో మాతృకగా భావించే మాజీ ఏఐసీసీ చీఫ్‌ సోనియా గాంధీని రాజ్యసభకు పంపించాలని మనవి చేశారని ఆ పార్టీ ఉన్నత వర్గాలు తెలిపాయి

సోనియా ఎన్నికకు, ఆమె నివాసం 10 జన్‌పథ్‌కు లింకుంది. 1989 ఎన్నికల్లో ఓటమి తర్వాత రాజీవ్‌గాంధీ ప్రతిపక్ష నేతగా 10 జన్‌పథ్‌లో ప్రవేశించారు. అప్పటి నుంచి సోనియా ఆ ఇంట్లోనే ఉంటున్నారు. దేశంలోని అనేక రాజకీయ పరిణామాలకు ప్రత్యక్ష సాక్షి ఆ నివాసం. దేశ రాజకీయాలను ప్రభావితం చేసే ఎన్నో నిర్ణయాలకు అది కేంద్రం. అయితే ప్రస్తుతం ఆ ఇంటిని సోనియా కోల్పోయే ముప్పు పొంచి ఉంది. వచ్చే ఎన్నికల్లో సోనియాగాంధీ పోటీ చేయకపోతే ఆ ఇంటిని వదులుకోవాల్సిందే. సోనియా తప్పుకుంటే రాయబరేలిలో ప్రియాంకగాంధీ పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ప్రియాంక గెలిచినా తొలిసారి ఎంపీగా ఆమెకు ఆ నివాసాన్ని కేటాయించే అవకాశాల్లేవు. కాబట్టి ఆ ఇంటిని కాపాడుకోవాలంటే సోనియా ఖచ్చితంగా పార్లమెంట్ సభ్యురాలిగా ఉండాల్సిందే. 

ఇటీవల అనర్హత వేటు పడటంతో రాహుల్ గాంధీ తుగ్లక్‌రోడ్‌లోని తన నివాసాన్ని ఖాళీ చేయాల్సి వచ్చింది. గతేడాది జులైలో లోధీ ఎస్టేట్‌లోని ఇంటిని కూడా ప్రియాంక ఖాళీ చేయాల్సి వచ్చింది. భద్రతా కారణాలతో 1997లో ప్రియాంకకు ఆ నివాసాన్ని కేటాయించారు. అలాంటి పరిస్థితి తనకు రాకూడదని సోనియాగాంధీ భావిస్తున్నారు. నెహ్రూ వంశీయులు ఎవరూ కూడా గత వందేళ్లలో ఢిల్లీలోని ప్రైవేట్ నివాసాల్లో అద్దెకు ఉండలేదు. ఇటీవలే రాహుల్ గాంధీ  అద్దె ఇంటికి మారారు. ఎమర్జెన్సీ తర్వాత అధికారాన్ని కోల్పోయిన సమయంలో ఇందిర కూడా తన నివాసాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఆ సమంయలో ఉండటానికి ఇల్లు కూడా లేదు. ఫామ్‌హౌస్ ఉన్నా అందులో నిర్మాణం పూర్తి కాలేదు. దీంతో తన నమ్మినబంటు మహ్మద్ యూనస్ నివాసంలో కొన్నాళ్లు ఉన్నారు.

ఈ ఇంటిపై చాలా కథలున్నాయి. ఆ నివాసంలో దెయ్యం ఉందన్న ప్రచారం కూడా ఉంది. ఇంట్లో రెండు సమాధులున్నట్లు చెబుతున్నారు. ఇక ఆ ఇల్లు సోనియాగాంధీకి అన్‌లక్కీ అన్న ప్రచారం కూడా ఉంది. అయితే రాజీవ్‌తో కలసి ఉన్న ఆ ఇంట్లోనే ఉండటానికి సోనియా ఇష్టపడ్డారు. నిజానికి ఎమర్జెన్సీ సమయంలో ఆ ఇంటిని యూత్ కాంగ్రెస్ ఆఫీసుగా వినియోగించారు. తర్వాత కొన్నాళ్లు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆఫీసు నడిచింది. కొన్నాళ్లు బక్సర్ ఎంపీ కెకె.తివారి కూడా అందులో ఉన్నారు. ప్రతిపక్ష నేతగా రాజీవ్‌కు ఆ ఇంటిని కేటాయించారు. ఆ సమయంలో రాజీవ్‌గాంధీని పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ ఉద్యోగులు వద్దని వారించారట. అయితే ఇంట్లో ఉన్న దెయ్యం.. దేశ రాజకీయాలను చూస్తే పారిపోతుందిలే అని రాజీవ్ జోక్ చేశారు. ఆ ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత కొన్ని అనూహ్య ఘటనలు జరిగాయని చెబుతున్నారు. ఆ ఇంట్లో చేరిన రెండేళ్లలోనే రాజీవ్ హత్యకు గురయ్యారు.

సోనియా ఎంపీగా పోటీ చేయకపోతే ఆ ఇల్లు ఉండదు. ప్రైవేట్ నివాసానికి మారాల్సి ఉంటుంది. కానీ రాజీవ్‌తో కలసి తానున్న ఆ ఇంటిని వదులుకోవడం ఆమెకు ఇష్టం లేదు. అందుకే రాజ్యసభకు ఆమె పోటీ చేసే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని చెబుతున్నారు. ఇందుకు ఇంకా 8 నెలల సమయం ఉంది కాబట్టి ఈ లోపు ఏమైనా పరిణామాలు మారతాయేమో చూడాలి