చంద్రయాన్–3లోనే అద్భుతమైన ఫొటో.. ‘స్మైల్ ప్లీజ్’!

చంద్రయాన్–3 మిషన్‌కే హైలైట్‌గా నిలిచిపోయే అద్భుతమైన ఫొటోను ప్రజ్ఞాన్ రోవర్ తీసింది. ‘విక్రమ్‌’ ల్యాండర్‌‌ ఫొటోను క్లిక్‌మనిపించింది. ‘స్మైల్ ప్లీజ్’ అంటూ ఈ ఫొటోను ఇస్రో ట్వీట్ చేసింది.  చంద్రుడిపై బుడిబుడి నడకలు వేస్తోంది ప్రజ్ఞాన్ రోవర్. చందమామ ఉపరితలంపై పరిశోధనలు చేస్తూనే.. ఓ గొప్ప పని చేసింది. దక్షిణ ధ్రువంపై రాళ్లు, రప్పలను, గుంతలను తప్పించుకుని జాగ్రత్తగా తిరుగుతూ అక్కడి మట్టిని స్టడీ చేస్తోంది. ఈ క్రమంలో చంద్రయాన్–3 మిషన్‌కే హైలైట్‌గా నిలిచిపోయే అద్భుతమైన పని […]

Share:

చంద్రయాన్–3 మిషన్‌కే హైలైట్‌గా నిలిచిపోయే అద్భుతమైన ఫొటోను ప్రజ్ఞాన్ రోవర్ తీసింది. ‘విక్రమ్‌’ ల్యాండర్‌‌ ఫొటోను క్లిక్‌మనిపించింది. ‘స్మైల్ ప్లీజ్’ అంటూ ఈ ఫొటోను ఇస్రో ట్వీట్ చేసింది. 

చంద్రుడిపై బుడిబుడి నడకలు వేస్తోంది ప్రజ్ఞాన్ రోవర్. చందమామ ఉపరితలంపై పరిశోధనలు చేస్తూనే.. ఓ గొప్ప పని చేసింది. దక్షిణ ధ్రువంపై రాళ్లు, రప్పలను, గుంతలను తప్పించుకుని జాగ్రత్తగా తిరుగుతూ అక్కడి మట్టిని స్టడీ చేస్తోంది. ఈ క్రమంలో చంద్రయాన్–3 మిషన్‌కే హైలైట్‌గా నిలిచిపోయే అద్భుతమైన పని చేసింది. ఎన్నో అవాంతరాలను దాటుకుని, లక్షల కిలోమీటర్లు మోసుకుని వచ్చి, చంద్రుడిపై సురక్షితంగా దింపిన ‘విక్రమ్‌’ ల్యాండర్‌‌ ఫొటోను తీసింది. జాబిల్లిపై నిటారుగా నిలబడి ఉన్న విక్రమ్ ల్యాండర్‌‌కు ఎదురుగా వెళ్లి.. ముందువైపు ఉన్న నావిగేషన్ కెమెరాలతో క్లిక్‌ మనిపించింది. 

ఇమేజ్ ఆఫ్ ది మిషన్

రోవర్ తీసి పంపిన ఫొటోలను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) షేర్ చేసింది. ‘స్మైల్ ప్లీజ్’ అంటూ క్యాప్షన్ ఇచ్చి ట్వీట్ చేసింది. ఫొటోను గమనిస్తే బ్లాక్ అండ్ వైట్ కలర్‌‌లో నిటారుగా నిలబడి ఉంది ల్యాండర్. ఒకవైపు నుంచి ఎండ పడుతుండగా.. ఇంకోవైపు ల్యాండర్ నీడ కనిపిస్తోంది.  ల్యాండర్‌‌లోని అతి కీలకమైన చాస్ట్ పరికరం.. డ్రిల్లింగ్ చేస్తున్న దృశ్యం కూడా ఫొటోలో కనిపించింది. మరోవైపున ఇల్సా అనే మరో కీలక పరికరం కూడా తీగల సాయంతో చంద్రుడి ఉపరితలానికి ఆనుకుని ఉంది. దీంతో దీన్ని ‘ఇమేజ్ ఆఫ్ ది మిషన్’ ఇస్రో చెబుతోంది. ల్యాండర్‌‌లోని చాస్ట్ (చంద్రాస్ సర్ఫేస్ థర్మో ఫిజికల్ ఎక్స్‌పరిమెంట్) పరికరం చంద్రుడిపై డ్రిల్లింగ్ చేస్తోంది. రోవర్ తీసిన ఫొటోలో ఈ దృశ్యం కనిపిస్తోంది. ఇది నేలలోకి 10 సెంటీమీటర్లకు వరకు చొచ్చుకుపోయి.. టెంపరేచర్లను కొలుస్తోంది. ఇప్పటికే అక్కడి థర్మల్ ప్రొఫైల్‌ను తొలిసారిగా పంపింది. ప్రస్తుతం ఉష్ణోగ్రతలను కొలుస్తోంది.

కెమెరాలు కీలకం

రోవర్‌‌కు ముందు వైపున ఏర్పాటు చేసిన రెండు రెండు నేవిగేషన్ కెమెరాలే రెండు కళ్ల మాదిరి పని చేస్తున్నాయి. బెంగళూరులోని ఇస్రో ల్యాబ్ (ల్యాబోరేటరీ ఫర్ ఎలక్ట్రో ఆప్టిక్స్ సిస్టమ్స్) సైంటిస్టులు ఈ కెమెరాలను రూపొందించారు. ఇటీవల ఎదురైన భారీ గొయ్యిని ఈ కెమెరాల ఆధారంగానే రోవర్ గుర్తించింది. తర్వాత ఇస్రో శాస్త్రవేత్తల సాయంతో తన దారిని మార్చుకుంది. మరోవైపు రోవర్ తాను తీసే ఫొటోలను, మట్టిని టెస్టు చేసి విశ్లేషించే డేటాను నేరుగా ఇస్రోకు పంపలేదు. రోవర్ ముందుగా ల్యాండర్‌‌కు పంపితే.. ల్యాండర్‌‌ వాటిని ఇస్రోకు ఫార్వర్డ్ చేస్తుంది. ఇస్రోకు, రోవర్‌‌కు మధ్య ఎలాంటి కనెక్టివిటీ లేకపోవడం గమనార్హం. అదీకాక ల్యండర్‌‌ నుంచి 500 మీటర్ల దూరం దాటితే సిగ్నల్స్‌ కట్ అవుతాయి. అందుకే 500 మీటర్ల లోపే రోవర్ తిరిగేలా ఇస్రో సైంటిస్టులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

చంద్రుడిపై ఆక్సిజన్

చంద్రుడి ఉపరితలంపై సల్ఫర్ నిక్షేపాలు ఉన్నట్లు ప్రజ్ఞాన్ రోవర్ కనుగొన్నట్లు ఇస్రో ప్రకటించింది. రోవర్‌‌లోని ఇండ్యూస్డ్ బ్రేక్ డౌన్ స్పెక్ట్రో స్కోప్ గుర్తించిందని తెలిపింది. సల్ఫర్ మాత్రమే కాదు.. ఆక్సిజన్ కూడా ఉన్నట్లు కనుగొంది. అల్యూమినియం, కాల్షియం, ఐరన్, క్రోమియం, టైటానియం, మాంగనీస్, సిలికాన్కూడా ఉన్నట్లు గుర్తించింది. మరోవైపు కీలకమైన హైడ్రోజన్ కోసం రోవర్ అన్వేషిస్తున్నట్లు ఇస్రో తెలిపింది. రోవర్ గురించిన ప్రతి అప్‌డేట్‌ను ఇస్రో ట్విట్టర్‌‌లో షేర్ చేస్తోంది. ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్ అయినప్పటి నుంచి రోవర్ దిగడం, ముందుకు సాగడం, ఫొటోలు తీయడం వంటి విశేషాలను షేర్ చేస్తోంది.