లోక్ సభ వాయిదా.. రాజ్యసభలో నినాదాలు..

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమై ఐదు రోజులు గడుస్తున్న ఉభయ సభలు ముందుకు సాగడం లేదు. ఈశాన్య రాష్ట్రమైనా మణిపూర్ లో మూడు నెలలుగా అల్లర్లు కొనసాగుతున్నా, మహిళలపై అకృత్యాలు జరుగుతున్నా కేంద్రం స్పందన పేలవంగా ఉంది. ప్రధాని మోడీ ఇప్పటివరకు అక్కడ పర్యటించలేదు. పార్లమెంటులో సైతం తాను స్పందించకుండా హోమ్ మంత్రి అమిత్ షా తో మాట్లాడించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రతిపక్ష ఎంపీలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ సమస్యపై మాట్లాడాలని పట్టుబడుతున్నాయి. మోదీ నోరు విప్పాలని […]

Share:

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమై ఐదు రోజులు గడుస్తున్న ఉభయ సభలు ముందుకు సాగడం లేదు. ఈశాన్య రాష్ట్రమైనా మణిపూర్ లో మూడు నెలలుగా అల్లర్లు కొనసాగుతున్నా, మహిళలపై అకృత్యాలు జరుగుతున్నా కేంద్రం స్పందన పేలవంగా ఉంది. ప్రధాని మోడీ ఇప్పటివరకు అక్కడ పర్యటించలేదు. పార్లమెంటులో సైతం తాను స్పందించకుండా హోమ్ మంత్రి అమిత్ షా తో మాట్లాడించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రతిపక్ష ఎంపీలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ సమస్యపై మాట్లాడాలని పట్టుబడుతున్నాయి. మోదీ నోరు విప్పాలని మౌనాన్ని విడాలని ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేస్తుండగా మోడీ మోడీ అంటూ బిజెపి సభ్యులు నినాదాలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో సభను నడపడం సాధ్యం కాదని లోక్ సభ సభాపతి ఓం బిర్లా స్పష్టం చేశారు. సభను గురువారం మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా వేశారు. రాజ్యసభలో కూడా సభ్యులు నినాదాలతో హోరెత్తిస్తున్నారు. 

లోక్సభలో కాంగ్రెస్ పార్టీ పెట్టిన అవిశ్వాస తీర్మానం వెనుక ప్రధాన లక్ష్యం మణిపూర్ ఘటనలపై  ప్రధాని నోరు విప్పించడమే. మణిపూర్ ఘటనలపై రెండు నెలలగా మౌనంగా ఉండిపోయి తాజాగా మహిళల నగ్న ప్రదర్శన వీడియోలు బయటపడ్డాక దేశం సిగ్గుపడుతోందంటూ చెప్పి తప్పించుకున్నారు. దీనిపై విపక్షాలు నాలుగు రోజులుగా పార్లమెంటును స్తంభింప చేస్తున్న కేంద్రం మాత్రం మౌనవ్రతం పాటిస్తోంది. దీంతో అవిశ్వాస తీర్మానం ద్వారా చర్చ పెట్టిస్తే ప్రధాని మోడీ ప్రకటన చేస్తారని లక్ష్యంతో కాంగ్రెస్తో కూడిన ఇండియా కూటమి ఈ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

ప్రతిపక్ష కూటమి ఇండియా సభ్యులు నల్ల దుస్తులు, చొక్కాలు ధరించి సభకు హాజరయ్యారు. మణిపూర్లో దురాగతాలను, ఆటవికతను వ్యతిరేకించాలని ఇండియా కూటమి సభ్యులు నిర్ణయించుకున్నట్లు, వారికి సంఘీభావం తెలిపేందుకు ఈ నిర్ణయాలు తీసుకున్నామని ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా  మీడియాతో  తెలిపారు. మన దేశంలో భాగమైన మణిపూర్ తగలబడుతోంది అని ఆ విషయం ప్రభుత్వానికి అర్థమయ్యే విధంగా చేయడం కోసమే తాము నలుపు రంగు దుస్తులను ధరించి పార్లమెంటుకు హాజరవుతున్నామని తెలిపారు ముఖ్యమంత్రి ఎన్ బిరెన్ సింగ్ ను ఆ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. మణిపూర్ బాధ్యతను కేంద్ర ప్రభుత్వం స్వీకరించాలన్నారు. 

కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ మాట్లాడుతూ.. మోడీ దురహంకారానికి వ్యతిరేకంగానే తాము నలుపు రంగు దుస్తులను ధరించి పార్లమెంటుకు హాజరవుతున్నామని తెలిపారు. మణిపూర్ ప్రజల గాయాలపైన మోడీ ఉప్పు, కారం చల్లుతున్నారని ఆరోపించారు. మోడీ మణిపూర్ వెళ్లాలని దేశ భద్రత కోసం పనిచేయాలని ఆయనను తాము కోరుతున్నామని.. అయితే మోడీ మాత్రం ఇక్కడే ఉండి ఉపన్యాసాలు చేస్తున్నారే తప్ప అక్కడికి వెళ్లి వారిని సంరక్షించే బాధ్యతల గురించి ఆలోచించడం లేదని ఆయన మండిపడ్డారు.  దేశంలోని ఓ ప్రాంతం తగలబడుతూ ఉంటే ఇలా ఉపన్యాసాలు ఇవ్వడంలో తీరిక లేకుండా గడిపే మోదీని భారతదేశం ఇప్పుడే చూస్తోందన్నారు. మోదీ దురహంకారాన్ని వ్యతిరేకించడానికి తాము ఎన్ని రోజులైనా ఇలా నిరసనలు తెలియజేస్తామని తెలిపారు. దేశం తగలబడుతూ, మణిపూర్ విభజన పాలైతే, మోడీ తన పేరు ప్రతిష్టల కోసం మాత్రమే పాటుపడుతున్నారని ఆయన దుయ్యబట్టారు.

ప్రతిపక్ష ఇండియా సభ్యులు నలుపు రంగు దుస్తులను ధరించి పార్లమెంటుకు హాజరవ్వడంపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి స్పందించారు.  మోడీ నేతృత్వంలోనే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడం వలన కానీ, నలుపు రంగు దుస్తులు ధరించి పార్లమెంటుకు హాజరవ్వడం వలన కానీ, ఎటువంటి ప్రయోజనం ఉండదని తెలిపారు. 2024లో జరిగే లోక్సభ ఎన్నికల్లో నరేంద్ర మోడీ మరోసారి కచ్చితంగా విజయం సాధిస్తారని ఆయన అన్నారు.

Tags :