కేంద్రంపై శశిథరూర్ ఇటు ప్రశంసలు.. అటు విమర్శలు

18వ జీ20 సమిట్‌లో ఆమోదించిన ‘ఢిల్లీ డిక్లరేషన్’ నిస్సందేహంగా భారత్‌కు దౌత్య విజయమని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ అన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఇది తమ వ్యక్తిగత విజయంగా చెప్పుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. మన దేశంలో తొలి సారి నిర్వహించిన జీ20 సమిట్‌ను కేంద్ర ప్రభుత్వం విజయవంతంగా ముగించింది. ఢిల్లీలోని భారత మండపంలో రెండు రోజుల పాటు నిర్వహించిన సమావేశాల్లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునేలా ముందడగు వేసింది. ఈ నేపథ్యంలో దేశ […]

Share:

18వ జీ20 సమిట్‌లో ఆమోదించిన ‘ఢిల్లీ డిక్లరేషన్’ నిస్సందేహంగా భారత్‌కు దౌత్య విజయమని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ అన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఇది తమ వ్యక్తిగత విజయంగా చెప్పుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.

మన దేశంలో తొలి సారి నిర్వహించిన జీ20 సమిట్‌ను కేంద్ర ప్రభుత్వం విజయవంతంగా ముగించింది. ఢిల్లీలోని భారత మండపంలో రెండు రోజుల పాటు నిర్వహించిన సమావేశాల్లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునేలా ముందడగు వేసింది. ఈ నేపథ్యంలో దేశ విదేశాల నుంచి భారత్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ జాబితాలో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కూడా చేరారు. 18వ జీ20 సమిట్‌లో ఆమోదించిన ‘ఢిల్లీ డిక్లరేషన్’ నిస్సందేహంగా భారత్‌కు దౌత్య విజయమని ఆయన అన్నారు. న్యూఢిల్లీ డిక్లరేషన్‌పై అన్ని సభ్య దేశాలను ఏకతాటిపైకి తెచ్చినందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ఆయన ప్రశంసించారు. ఇదే సమయంలో ఆయన విమర్శలు కూడా చేశారు. జీ20 సమిట్‌ను ప్రభుత్వం ఓ సాధనంగా మార్చుకుందని, తమ వ్యక్తిగత విజయంగా మార్చుకోవాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు 

గొప్ప దౌత్య విజయం

‘న్యూఢిల్లీ జీ20 లీడర్స్‌ డిక్లరేషన్‌’ను ఏకగ్రీవంగా ఆమోదించినట్లు జీ20 సమిట్ తొలి రోజైన శనివారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. అసలు డిక్లరేషన్‌పై ఏకాభిప్రాయం కష్టమని, చైర్మన్ ప్రకటన మాత్రమే ఉంటుందని ఊహాగానాలు సాగాయి. కానీ సుదీర్ఘ చర్చల తర్వాత డిక్లరేషన్‌ను ఏకాభిప్రాయంతో ఇండియా ఆమోదింపజేసుకుంది. దీనిపై జాతీయ మీడియా సంస్థతో శశిథరూర్ మాట్లాడుతూ.. ‘‘ఢిల్లీ డిక్లరేషన్.. నిస్సందేహంగా భారతదేశానికి దౌత్యపరమైన విజయం. ఇది గొప్ప అచీవ్‌మెంట్. ఒప్పందం కుదరకపోవచ్చని, ఉమ్మడి ప్రకటన సాధ్యం కాకపోవచ్చని, చైర్మన్ ప్రకటనతో సదస్సు ముగస్తుందని.. జీ20 సమిట్ ప్రారంభానికి ముందు ఊహాగానాలు సాగాయి” అని అన్నారు. ఏకాభిప్రాయం సాధించడంలో భారతదేశానికి చెందిన జీ20 షెర్పా (అధికార ప్రతినిధి) అమితాబ్ కాంత్‌ కృషిని శశిథరూర్ అభినందించారు.

“ప్రధాన కారణం (డిక్లరేషన్‌ విషయంలో ఏకాభిప్రాయానికి రాకపోవడం).. ఇటు ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని ఖండించాలని కొందరు కోరుకోవడం.. అటు అసలు యుద్దానికి సంబంధించిన అంశాలే లేకుండా చూడాలని రష్యా, చైనా కోరుకోవడమే. రెండు వర్గాల మధ్య గ్యాప్‌ను తగ్గించడానికి భారతదేశం ఓ సూత్రం కనుగొనగలిగింది. ఇది ఒక ముఖ్యమైన దౌత్యపరమైన విజయం. ఎందుకంటే.. ఉమ్మడి ప్రకటన లేకుండా శిఖరాగ్ర సమావేశం ముగిసిందంటే.. చైర్మన్‌ (ఆతిథ్య దేశం)కు తగిలిన ఎదురుదెబ్బగా పరిగణిస్తారు” అని వివరించారు. 

తమ ఆస్తిగా మార్చుకుంది

భారత అధ్యక్షతన జరిగిన సమిట్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రజల జీ20 గా మార్చిందని శశిథరూర్ అన్నారు. ఇదే సమయంలో ఈ మెగా ఈవెంట్‌ను బీజేపీ తమ ఆస్తిగా మార్చుకోవడానికి ప్రయత్నం చేసిందని ఆరోపించారు. ‘‘జీ20 నిర్వహణలో ప్రభుత్వ తీరు విషయంలో చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే.. మునుపటి జీ20 ప్రెసిడెన్సీ దేశం చేయని పనిని మనవాళ్లు చేశారు. వాళ్లు నిజానికి దీన్ని దేశవ్యాప్త ఈవెంట్‌గా చేశారు. 58 నగరాల్లో 200కు పైగా సమావేశాలు నిర్వహించారు. అలా ఈ జీ20ని ప్రజల జీ20గా చేశారు. పబ్లిక్ ఈవెంట్స్, యూనివర్సిటీ అనుసంధాన కార్యక్రమాలు, సివిల్ సొసైటీలను మన ప్రెసిడెన్సీ హయాంలో నిర్వహించారు. జీ20 సందేశాన్ని మొత్తం ప్రజల వద్దకు తీసుకెళ్లారు. అయితే ఇదే సమయంలో ఇది తమకు ఆస్తిగా మార్చుకునేందుకు కూడా ప్రయత్నం చేశారు. 

వ్యక్తిగత విజయంగా ప్రచారం..

అంతర్జాతీయ ఆర్థిక సహకారం కోసం సమిట్‌లో చేసిన సూచనలు, ప్రతిపాదనలను సమీక్షించడానికి నవంబర్‌‌లో వర్చువల్ జీ20 సెషన్‌ను నిర్వహించాలన్న మోదీ ప్రతిపాదనపై శశిథరూర్ స్పందించారు. అలా చేయడానికి ప్రతి హక్కు ప్రెసిడెన్సీ దేశానికి ఉందని అన్నారు. ‘‘మోదీ కటౌట్‌ను ప్రతి 50 మీటర్లకు పెట్టారు. జీ20 విజయం మోదీ, బీజేపీ విజయంగా చెప్పుకుంటున్నారు” అని మండిపడ్డారు. ప్రతిపక్షాలను ఆహ్వానించకపోవడంపైనా విమర్శలు చేశారు. మదర్ ఆఫ్ డెమోక్రసీ అని పిలుచుకునే దేశంలో.. ప్రజాస్వామ్య ప్రతిపక్షాన్ని ఈ ఈవెంట్‌ నుంచి దూరంగా ఉంచారని ఆరోపించారు. ఇది చాలా దురదృష్టకరమని అన్నారు. జీ20 ఈవెంట్‌లో ప్రతిపక్షాలకు చోటు కల్పించడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందన్నారు.