మణిపూర్‌‌లో శాంతిని పునరుద్ధరించండి

ప్రతిపక్షాలకు చెందిన ఇండియన్‌ నేషనల్‌ డెవలప్‌మెంటల్‌ ఇన్‌క్లూజివ్‌ అలయన్స్‌(ఇండియా)కు చెందిన 21 మంది సభ్యుల బృందం రెండ్రోజుల పర్యటన సందర్భంగా మణిపూర్‌‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో చురాచంద్‌పూర్‌‌, మోయిరాంగ్‌, ఇంఫాల్‌లోని సహాయ శిబిరాలను ఈ బృందం సందర్శించింది. అక్కడున్న పరిస్థితుల గురించి వారిని అడిగి తెలుసుకుంది. మైతీలతోనూ, కుకీలతోనూ వారు మాట్లాడారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న వారి సమస్యలు కూడా తెలుసుకున్నారు. పర్యటనలో చివరి రోజైన ఆదివారం మొత్తం ప్రతిపక్ష సభ్యులు మణిపూర్‌‌ గవర్నర్‌‌ అనుసూయ ఉయికేతో […]

Share:

ప్రతిపక్షాలకు చెందిన ఇండియన్‌ నేషనల్‌ డెవలప్‌మెంటల్‌ ఇన్‌క్లూజివ్‌ అలయన్స్‌(ఇండియా)కు చెందిన 21 మంది సభ్యుల బృందం రెండ్రోజుల పర్యటన సందర్భంగా మణిపూర్‌‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో చురాచంద్‌పూర్‌‌, మోయిరాంగ్‌, ఇంఫాల్‌లోని సహాయ శిబిరాలను ఈ బృందం సందర్శించింది. అక్కడున్న పరిస్థితుల గురించి వారిని అడిగి తెలుసుకుంది. మైతీలతోనూ, కుకీలతోనూ వారు మాట్లాడారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న వారి సమస్యలు కూడా తెలుసుకున్నారు. పర్యటనలో చివరి రోజైన ఆదివారం మొత్తం ప్రతిపక్ష సభ్యులు మణిపూర్‌‌ గవర్నర్‌‌ అనుసూయ ఉయికేతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పరిస్థితులపై వివరించారు. ఈ సందర్భంగా మొమోరాండాన్ని సమర్పించారు. మణిపూర్‌‌లో శాంతి, సామరస్యాన్ని పునరుద్ధరించాలి” అని కోరారు. 

మూడు నెలలుగా మణిపూర్‌‌ అట్టుడికిపోతుంటే ప్రధాని మోదీ మౌనంగా ఉన్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతి స్థాపనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయన్నారు. ఘర్షణల్లో ఇప్పటివరకు 180 మందికి పైగా మరణించారని చెప్పారు. 500 మంది గాయపడ్డారని, 5 వేల ఇండ్లను తగలబెట్టారని, 60 వేల మంది పునరావాస కేంద్రాలకు తరలివెళ్లారని వెల్లడించారు. 

శిబిరాల్లో దయనీయ పరిస్థితి  

ప్రజలను, ఆస్తులను రక్షించడలో కేంద్ర, రాష్ట్రాల వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని గవర్నర్‌‌కు ప్రతిపక్ష సభ్యులు మెమొరాండం సమర్పించాయి. సహాయక శిబిరాల్లో పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. కనీసం పిల్లల కోసం ప్రత్యేకమైన చర్యలు తీసుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో ఇంటర్నెట్‌ నిషేధం వల్ల నిరాధారమైన పుకార్లకు దారి తీస్తోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తృణమూల్‌ కాంగ్రెస్‌కు చెందిన రాజ్యసభ సభ్యురాలు సుస్మితా దేవ్‌ మీడియాతో మాట్లాడారు. మణిపూర్‌‌ రాష్ట్ర ప్రజలకు ప్రతిపక్షాల కూటమి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మణిపూర్‌‌ అల్లర్లకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని జవాబుదారీగా చేయడానికి పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల చివరి రోజు వరకు పోరాడుతామని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు మణిపూర్‌‌కు ఫొటోలు తీయడానికి వెళ్లారని ఆరోపిస్తున్నాయని చెప్పారు. మణిపూర్‌‌ అంశంపై చర్చించేందుకు ఇష్టం లేకనే తాము పార్లమెంట్‌కు అంతరాయం కలిగిస్తున్నాయని బీజేపీ ప్రభుత్వం చెబుతుందని ఆమె అన్నారు. 

గవర్నర్‌‌ కూడా బాధపడ్డారు

మణిపూర్‌‌ పరిస్థితులపై గవర్నర్‌‌ కూడా విచారం వ్యక్తం చేశారని కాంగ్రెస్‌ నేత అధిర్‌‌ రంజన్‌ చౌధరి తెలిపారు. రాష్ట్రంలో కుకీ, మైతీతో పాటు అన్ని వర్గాల నాయకులందరితో మాట్లాడి సమస్య పరిష్కారానికి ఓ మార్గం కనుగొనాలని గవర్నర్‌‌ సలహా ఇచ్చారన్నారు. అఖిలపక్ష ప్రతినిధి బృందం మణిపూర్‌‌కు వచ్చి అన్ని వర్గాల నాయకులతో మాట్లాడాలని కూడా ఆమె చెప్పారన్నారు. ప్రజల్లో ఏర్పడిన అపనమ్మకాన్ని తొలగించాలని, రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు కృషి చేయాలన్నారు. 

మీ రాష్ట్రాల్లో నేరాల నివేదికను బయటపెట్టండి

కాగా, ప్రతిపక్షాల ఎంపీలు మణిపూర్‌‌ను సందర్శించడంపై కేంద్ర ప్రభుత్వం ఫైర్‌‌ అయ్యింది. మణిపూర్‌‌లో పరిస్థితులను ఎత్తిచూపే ఎంపీలు మీమీ రాష్ట్రాల్లో మహిళలపై జరుగుతున్న నేరాలకు సంబంధించి నివేదికలు కూడా బయటపెట్టాలని కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌‌ డిమాండ్‌ చేశారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఎంపీ అధిర్‌‌ రంజన్‌  చౌధరి.. మీ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న నేరాల సంగతి ఏంటని నిలదీశారు. ఈ 21 మంది ఎంపీలు రాజస్థాన్‌, పశ్చిమ బెంగాల్‌పై నివేదికలు ఇస్తారా అని ప్రశ్నించారు.

మే 4వ తేదీ మణిపూర్‌‌లో ఒక గుంపు ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి, లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తర్వాత రాష్ట్రంలో  భారీ అల్లర్లు జరిగాయి. ఎంతో మంది ఈ ఘర్షణల్లో మరణించారు. దీనికి బాధ్యత వహిస్తూ మణిపూర్‌‌ సీఎం బీరెన్‌ సింగ్‌ తన పదవికి రాజీనామా చేశారు. తర్వాత మళ్లీ విరమించుకున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో సాధారణ పరిస్థితులను నెలకొల్పేందుకు ఆగస్టు నెల ప్రారంభంలో అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.