అందరూ వెళ్లినా ఇంకా ఇక్కడే కెనడా ప్రధాని..కారణమిదే!

జీ20 సమిట్ ముగిసి రెండు రోజులు గడిచినా కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మాత్రం ఇంకా ఇండియాలోనే ఉండిపోయారు. ఆయన విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో స్వదేశానికి వెళ్లలేకపోయారు. కెనడా తీరుపై ప్రధాని మోదీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన సమయంలో ఇలా జరగడం చర్చనీయాంశమవుతోంది.  ఢిల్లీలో రెండు రోజులపాటు జరిగిన జీ20 సమిట్ విజయంతంగా ముగిసింది. ప్రపంచదేశాల నేతల రాకతో దేశ రాజధానిలో నెలకొన్న హడావుడి సద్దుమణిగింది. ఒకరిద్దరు మినహా ఆదివారం మధ్యాహ్నం నుంచే ఆయా […]

Share:

జీ20 సమిట్ ముగిసి రెండు రోజులు గడిచినా కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మాత్రం ఇంకా ఇండియాలోనే ఉండిపోయారు. ఆయన విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో స్వదేశానికి వెళ్లలేకపోయారు. కెనడా తీరుపై ప్రధాని మోదీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన సమయంలో ఇలా జరగడం చర్చనీయాంశమవుతోంది. 

ఢిల్లీలో రెండు రోజులపాటు జరిగిన జీ20 సమిట్ విజయంతంగా ముగిసింది. ప్రపంచదేశాల నేతల రాకతో దేశ రాజధానిలో నెలకొన్న హడావుడి సద్దుమణిగింది. ఒకరిద్దరు మినహా ఆదివారం మధ్యాహ్నం నుంచే ఆయా దేశాల నేతలు ఒక్కొక్కరుగా తిరుగుపయనమయ్యారు. అయితే కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో విషయంలో తలెత్తిన పరిస్థితి వివాదాస్పదమైంది. ఆయన వెళ్లాల్సిన విమానంలో సాంకేతిక కారణాలు తలెత్తడంతో మొత్తం ప్రతినిధుల బృందం ఆగిపోవాల్సి వచ్చింది. అంతకుముందు కెనడా ప్రధాని ట్రూడో వ్యవహరించిన తీరు, ద్వైపాక్షిక భేటీలో ప్రధాని మోదీ లెవనెత్తిన అభ్యంతరాలు ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నాయి.

కెనడా నుంచి విమానాన్ని పంపినా..

జీ20 సమిట్ ఆదివారమే ముగియగా.. ట్రూడో, ప్రభుత్వ సిబ్బంది, జర్నలిస్టులు ఇక్కడే ఉండిపోయారు. మంగళవారం మధ్యాహ్నం దాకా కూడా ఆయన బయల్దేరలేదని సమాచారం. సాంకేతిక సమస్యతో ఆయన వెళ్లాల్సిన విమానం నిలిచిపోయింది. ట్రూడో కోసం మరో విమానాన్ని కెనడా ఎయిర్‌‌ఫోర్స్ పంపింది. దీన్ని తొలుత రోమ్‌ మీదుగా ఢిల్లీకి పంపాలని భావించారు. కానీ తర్వాత పలు కారణాలతో రూటు మార్చి లండన్ రూట్‌ వైపు మళ్లించారు. ‘‘ఈ సమస్యలు రాత్రికి రాత్రే పరిష్కారం కావు. ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసే వరకు మా ప్రతినిధి బృందం భారతదేశంలోనే ఉంటుంది” అంటూ ట్రూడో కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.  

అంటీముట్టనట్లుగా ట్రూడో

జీ20 సదస్సులో ట్రూడో అంటీముట్టనట్లు వ్యవహరించారు. సదస్సు తొలి రోజైన శనివారం నిర్వహించిన విందుకు హాజరుకాలేదు. కెనడా ప్రధాని కార్యాలయం దీనికి కనీసం కారణం కూడా చెప్పలేదు. ఇక ప్రపంచ నేతలు ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీకి నివాళులర్పించేందుకు వెళ్లగా..  ట్రూడో ఎవరితోనూ పెద్దగా కలవలేదు. దీంతో ప్రధాని మోదీ చొరవ తీసుకున్నారు. ట్రూడో చేయిపట్టుకుని, అక్కడి విశేషాలు వివరించేందుకు యత్నించారు. కానీ ట్రూడో సున్నితంగానే చేయి వెనక్కి తీసుకోవడంతో మోదీ కూడా సైలెంట్ అయిపోయారు. ఈ వ్యహారంపై మీడియా ప్రశ్నించగా.. ఎవరికి నచ్చినట్లు వాళ్లు అనుకోవచ్చని ట్రూడో సమధానమిచ్చారు. 

సిక్కు వేర్పాటువాదులకు సపోర్టుపై తీవ్ర అభ్యంతరం

జీ20 చివరి రోజైన ఆదివారం మోదీ–ట్రూడో మధ్య భేటీ జరిగింది. ఈ భేటీలో కెనడా తీరుపై మోదీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. భారత వ్యతిరేక శక్తులు కెనడాలో ఆశ్రయం పొందడాన్ని నేరుగా ట్రూడో ఎదుటే ఆయన ప్రస్తావించారు. ఇది కెనడాకు కూడా ముప్పుగా మారుతుందని మోదీ హెచ్చరించారు. దౌత్యవేత్తలపై దాడులు, దౌత్యకార్యాలయాలు, ప్రార్థన స్థలాలపై దాడుల విషయంలో ఆందోళన వ్యక్తం చేశారు. రెండు దేశాల దౌత్య సంబంధాల పురోగతిలో పరస్పర గౌరవం, నమ్మకం చాలా ముఖ్యమని తేల్చి చెప్పారు. ట్రూడోతో మోదీ చర్చలపై ప్రధాన కార్యాలయం ప్రకటన రూపంలో విడుదల చేయడం గమనార్హం. కెనడా తీరుపై భారత ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు ఇది చెప్పకనే చెప్పింది.  

పర్యటనకు ముందే వివాదం

నిజానికి జీ20 పర్యటనకు ముందే కెనడా వివాదం సృష్టించింది. భారత్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చర్చలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని ప్రకటించింది. దీనికి సరైన కారణం కూడా వెల్లడించకపోవడం రెండు దేశాల మధ్య దూరం పెరగడానికి కారణమైంది. మరోవైపు జులైలో కెనడాలోని ఖలిస్తానీ గ్రూపులు భారత దౌత్యవేత్తలను బెదిరిస్తూ పోస్టర్లను విడుదల చేశాయి. ఇక సిక్కు వేర్పాటువాదుల కార్యకలాపాలు కెనడాలో భారీగా విస్తరించాయి. ఈ విషయంలో కెనడా ప్రభుత్వం పెద్దగా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. 

ఇదిలా ఉంటే 2018లో భారత్‌లో పర్యటించిన సమయంలో తన తీరుతో ట్రూడో విమర్శలపాలయ్యారు. అప్పట్లో ఆయన గౌరవార్థం కెనడా హైకమిషన్ ఇచ్చిన విందుకు ఖలిస్తానీ ఉగ్రవాది జస్పాల్ అత్వాల్‌ను ఆహ్వానించడం పెద్ద దుమారమే రేపింది. ఈ ఘటనల కారణంగా భారత ప్రభుత్వం ట్రూడో పర్యటనకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు.