రాజీవ్ జీవితం అత్యంత దారుణ రీతిలో ముగిసింది

భారత దేశ చరిత్రలో అత్యంత పిన్న వయసులో ప్రధాని అయిన నేత రాజీవ్ గాంధీ. తన తల్లి ఇందిరాగాంధీ హత్యతో అనుకోకుండా ఆయన ప్రధాని పదవి చేపట్టారు. తర్వాత తమిళనాడులో జరిగిన ఆత్మాహుతి దాడిలో ఆయన మరణించారు. ఈ క్రమంలో తన భర్తను గుర్తుచేసుకున్న కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ.. రాజీవ్ గాంధీ రాజకీయ జీవితం అత్యంత దారుణ రీతిలో ముగిసిందని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇదే సమయంలో ప్రధానిగా కొద్దికాలంలోనే ఎన్నో కీలక విజయాలను రాజీవ్ […]

Share:

భారత దేశ చరిత్రలో అత్యంత పిన్న వయసులో ప్రధాని అయిన నేత రాజీవ్ గాంధీ. తన తల్లి ఇందిరాగాంధీ హత్యతో అనుకోకుండా ఆయన ప్రధాని పదవి చేపట్టారు. తర్వాత తమిళనాడులో జరిగిన ఆత్మాహుతి దాడిలో ఆయన మరణించారు. ఈ క్రమంలో తన భర్తను గుర్తుచేసుకున్న కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ.. రాజీవ్ గాంధీ రాజకీయ జీవితం అత్యంత దారుణ రీతిలో ముగిసిందని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇదే సమయంలో ప్రధానిగా కొద్దికాలంలోనే ఎన్నో కీలక విజయాలను రాజీవ్ సాధించారని గుర్తు చేసుకున్నారు.

ఎన్నో విజయాలు సాధించారు

దేశవ్యాప్తంగా ఆగస్టు 20న రాజీవ్ గాంధీ 79వ జయంతి ఘనంగా జరిగింది. ఢిల్లీలో ‘వీర్‌‌ భూమి’లో సోనియా గాంధీ నివాళులర్పించారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ, రాబర్ట్ వాద్రా, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే తదితర నేతలు నివాళులర్పించారు.  ఈ నేపథ్యంలో నిర్వహించిన 25వ రాజీవ్‌ గాంధీ నేషనల్ సద్భావన అవార్డుల కార్యక్రమంలో సోనియా గాంధీ ప్రసంగించారు. రాజీవ్ గాంధీ రాజకీయ జీవితం దారుణ రీతిలో ముగిసిందని అన్నారు.

కానీ ఆయన పాలన సాగించిన కొద్ది సమయంలోనే లెక్కలేనన్ని విజయాలు సాధించారని సోనియా గుర్తు చేసుకున్నారు. ‘‘మహిళా సాధికారతకు రాజీవ్ కృషి చేశారు. పంచాయతీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు పోరాటం చేశారు. స్థానిక సంస్థల్లో ప్రస్తుతం భారీ స్థాయిలో ఎన్నికైన మహిళా ప్రజా ప్రతినిధులు ఉన్నారంటే.. అందుకు రాజీవ్ శ్రమ, దూరదృష్టి మాత్రమే కారణం” అని వివరించారు. ఓటు వేసే వయసును 21 నుంచి 18 ఏళ్లకు తగ్గించారని సోనియా చెప్పారు. 

బీజేపీపై పరోక్ష విమర్శలు

దేశంలో విద్వేషం, విభజన, పక్షపాత రాజకీయాలు పెరిగిపోతున్నాయని సోనియా గాంధీ ఆరోపించారు. వాటికి అధికార పక్షం నుంచి మద్దతు లభిస్తోందని పరోక్షంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో మత సామరస్యం, శాంతి, దేశ ఐక్యత వంటి సిద్ధాంతాలు ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయని చెప్పారు. అన్ని మతాలు, సంస్కృతులు, భాషలు, జాతుల సమాహారం వల్లే దేశ ఐక్యత బలోపతం అవుతుందని రాజీవ్ భావించారని సోనియా గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాజస్థాన్‌లోని బనస్థలి విద్యాపీఠ్‌కు 25వ రాజీవ్ సద్భావన అవార్డును మాజీ ఉప రాష్ట్రపతి హమీ అన్సారీ బహూకరించారు. ఈ అవార్డు కింద రూ.10 లక్షల నగదు, ప్రశంసాపత్రాన్ని అందజేశారు. 

40 ఏళ్లకే ప్రధాని..

1944 ఆగస్టు 20న రాజీవ్ గాంధీ జన్మించారు. 1984లో తన బాడీగార్డుల చేతిలో ప్రధాని ఇందిరాగాంధీ హత్యకు గురయ్యారు. దీంతో ఆమె కొడుకు రాజీవ్ గాంధీ అదే ఏడాది అక్టోబర్ లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 40 ఏళ్లకే ప్రధాని బాధ్యతలు చేపట్టిన వ్యక్తిగా రికార్డులకెక్కారు. ఇప్పటికీ ఆ రికార్డు అలానే చెక్కుచెదరకుండా ఉంది. 1989 వరకు ఆయన పదవిలో కొనసాగారు. తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓడిపోవడంతో ప్రతిపక్ష నేతగా కొనసాగారు. ఈ క్రమంలో 1991లో తమిళనాడు పర్యటనకు వెళ్లారు.. శ్రీపెరంబదూరులో ఎన్నికల ప్రచారం చేస్తుండగా.. శ్రీలంకకు చెందిన లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (ఎల్‌టీటీఈ) సూసైడ్ బాంబర్ దాడి చేశారు. ఈ ఘటనలో రాజీవ్ అక్కడకిక్కడే చనిపోయారు. ఆయన వర్ధంతి రోజైన మే 21న జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవాన్ని దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. గాంధీ– నెహ్రూ కుటుంబం నుంచి ప్రధాని అయిన మూడో వ్యక్తి రాజీవ్ గాంధీ. ఆ తర్వాత ఆ కుటుంబం నుంచి ఎవరూ ప్రధాని కాలేదు.