Haveri Incident: దాడి మాత్రమే కాదు.. సామూహిక అత్యాచారం చేశారు!

Haveri Incident: మహిళను బలవంతంగా అడవిలోకి లాక్కెళ్లిన యువకులు ఆమెపై ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేసినట్లు ఆరోపణలు రావడం కర్ణాటకలో తీవ్ర దుమారం రేకెత్తిస్తోంది.

Courtesy: Top Indian News

Share:

హవేరి: కర్ణాటకలో దారుణం చోటు చేసుకుంది. లాడ్జికి వచ్చిన ఓ జంటపై కొందరు దుండగులు దారుణంగా దాడి చేశారు. ఆపై ఆగకుండా మహిళను బలవంతంగా అడవిలోకి లాక్కెళ్లిన యువకులు ఆమెపై ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేసినట్లు ఆరోపణలు రావడం కర్ణాటకలో తీవ్ర దుమారం రేకెత్తిస్తోంది. కారు డ్రైవర్ సైతం అఘాయిత్యానికి పాల్పడట్లు ఆ మహిళ విడుదల చేసిన వీడియోలో తెలిపింది. అయితే ఈ ఘటనపై హవేరి పోలీస్ సూపరింటెండెంట్ అన్షు కుమార్ స్పందించారు. ఘటన జరిగిన రోజే కేసు నమోదు చేశామని తెలిపారు. ఆ రోజు కేవలం తమ జంటపై దాడి మాత్రమే జరిగినట్లు బాధితురాలు తెలిపిందని వెల్లడించారు. తాజాగా ఆమె విడుదల చేసిన వీడియోలో గ్యాంగ్ రేప్ జరిగినట్లు తాము టీవీ న్యూస్‌లో చూశామని చెప్పారు.  అత్యాచారం జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందని ఈమేరకు హత్యాయత్నం, అత్యాచారం, కిడ్నాప్ తదితర కేసులు నమోదు చేశామన్నారు. 

నిందితుల్లో ముగ్గురిని అరెస్టు చేసి, పోలీసులు విచారించగా.. యువతి- ఆమె స్నేహితునిపై దాడి చేసినట్లు అంగీకరించారు. పరారీలో ఉన్న మరో నలుగురు నిందితుల కోసం గాలిస్తున్నామని జిల్లా ఎస్పీ అన్షు కుమార్‌ తెలిపారు. మహిళ తనకు పరిచయం ఉన్న కేఎస్‌ఆర్టీసీ డ్రైవరుతో మాట్లాడేందుకు ఆమె హోటల్‌ గదికి వెళ్లిన సమయంలో దాడి జరిగిందని అనుమానిస్తున్నారు. నిందితులు ఈ లాడ్జి వద్ద కాపు కాసి జంటలపై తరచూ ఇలాంటి దాడులకు, అత్యాచారాలకు పాల్పడుతుంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించింది. ప్రభుత్వం ఈ ఘటన బయటకు రాకుండా ప్రయత్నిస్తోందని విపక్ష భాజపా ధ్వజమెత్తింది. మూకుమ్మడి దాడి, సామూహిక అత్యాచార ఘటనను ఎందుకు తొక్కిపెడుతున్నారని మాజీ ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇలాంటి పలు అకృత్యాలు జరుగుతున్నా ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందని భాజపా రాష్ట్రాధ్యక్షుడు బీవై విజయేంద్ర దుయ్యబట్టారు.

అసలేం జరిగిందంటే..
పోలీసుల వివరాల ప్రకారం.. హవేరి జిల్లా, హనగల్ తాలూకాలోని ఓ లాడ్జి గదిలో 26 ఏళ్ల మహిళ తనకు పరిచయం ఉన్న వ్యక్తితో లాడ్జికి వెళ్లింది. ఆ మహిళకు పెళ్లై భర్త కూడా ఉన్నాడు. ఆమె మూడేళ్లుగా కేఎస్ ఆర్టీసీకి చెందిన ఓ బస్ డ్రైవర్‌తో పరిచయం ఉంది. అయితే వివాహిత మహిళ డ్రైవర్ తో ఏకాంతంగా గడుపుతున్న విషయాన్ని గమనించిన ఆరుగురు యువకులు లాడ్జికి వెళ్లి తలుపు తట్టారు. ఆమె ప్రియుడు వచ్చి తలుపులు తీయగా.. ఆయన్ను పక్కకు నెట్టేసి లోపలికి వెళ్లారు. లాడ్జిలో మీరిద్దరు ఏం చేస్తున్నారు..? ఎందుకు వచ్చారు..? అని ఆమెను ప్రశ్నించారు. అనంతరం వారిద్దరిపై దాడి చేసి గది నుంచి లాక్కెళ్లారు. ఈ దృశ్యాలను మొత్తం యువకులు వీడియో రికార్డ్ చేశారు.

ఆ మహిళను సమీపంలోకి అడవి ప్రాంతానికి లాక్కెళ్లి ఒకరి తర్వాత మరొకరు కలిసి అత్యాచారం చేసినట్లు బాధితురాలు వీడియోలో ఆరోపించింది. ఆ తర్వాత కారులో ఎక్కించుకోని హవేరి నగరం చుట్టూ తిప్పారని.. ఆ సమయంలో కారు డ్రైవర్ సైతం ఆమెపై అత్యాచారం చేసినట్లు పేర్కొంది. ఈ ఘటన జనవరి 8వ తేదీన జరిగింది. అయితే ఆ రోజు కేవలం తనపై, తన ప్రియుడిపై దాడి మాత్రమే చేశారని ఫిర్యాదు చేసిన వివాహిత గురువారం విడుదల చేసిన వీడియోలో సంచలన విషయాలను బయటపెట్టింది. ఆ రోజు తనపై దాడి చేయడంతోపాటు ఆరుగురు యువకులు అత్యాచారం చేశారని, వీడియోలు తీశారని తను విడుదల చేసిన వీడియోలో తెలిపింది. ఆ తర్వాత నన్ను బస్టాప్‌లో వదిలేశారు.. వారిని శిక్షించాలని కోరుతున్నాను అని బాధితురాలు చెప్పింది.