అహ్మ‌దాబాద్‌కు పాకిస్థానీ ఆట‌గాళ్లా? సిగ్గుచేటు

భారత్–పాక్ మ్యాచ్‌పై శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ థాక్రే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే పాకిస్థానీతో క్రికెట్ ఎందుకు ఆడాలని ఆయన ప్రశ్నించారు. భారతదేశంలో క్రికెట్ అంటే కేవలం ఆట మాత్రమే కాదు.. ఓ మతం. కేవలం వినోదం మాత్రమే కాదు.. ఓ భావోద్వేగం. ఆటగాళ్లకు అభిమానులు కాదు.. భక్తులు ఉంటారు. ఇక ఇండియా–పాకిస్థాన్ మ్యాచ్ అంటే.. దాదాపు యుద్ధం లాంటిదే. దాయాదుల పోరును ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఎంతో ఆసక్తితో, మరెంతో ఉద్వేగంతో చూస్తారు. […]

Share:

భారత్–పాక్ మ్యాచ్‌పై శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ థాక్రే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే పాకిస్థానీతో క్రికెట్ ఎందుకు ఆడాలని ఆయన ప్రశ్నించారు. భారతదేశంలో క్రికెట్ అంటే కేవలం ఆట మాత్రమే కాదు.. ఓ మతం. కేవలం వినోదం మాత్రమే కాదు.. ఓ భావోద్వేగం. ఆటగాళ్లకు అభిమానులు కాదు.. భక్తులు ఉంటారు. ఇక ఇండియా–పాకిస్థాన్ మ్యాచ్ అంటే.. దాదాపు యుద్ధం లాంటిదే. దాయాదుల పోరును ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఎంతో ఆసక్తితో, మరెంతో ఉద్వేగంతో చూస్తారు. త్వరలో ఆసియా కప్‌లో, తర్వాత వన్డే ప్రపంచకప్‌లో రెండు దేశాలు తలపడబోతున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్రకు చెందిన శివసేన పార్టీ తీవ్ర అభ్యంతరం చెబుతోంది. పాకిస్థాన్‌తో మ్యాచ్‌ ఆడొద్దని అంటోంది.

ఉగ్రవాదాన్నిప్రోత్సహించే దేశంతో క్రీడలా?

అక్టోబర్‌‌లో ఇండియా వేదికగా వన్డే వరల్డ్‌కప్‌ జరగనుంది. ఇందులో భాగంగా గుజరాత్‌లోని అహ్మదాబాద్ స్టేడియంలో ఇండియా, పాకిస్థాన్‌ మధ్య లీగ్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో పాక్‌తో మ్యాచ్‌ను టీమిండియా ఆడకూడదని శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాక్రే అంటున్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశంతో క్రికెట్ ఎందుకు ఆడాలని ఆయన ప్రశ్నించారు. మహారాష్ట్రలోని హింగోలిలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. ఈ విషయలో దివంగత బీజేపీ నేత సుష్మాస్వరాజ్ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ ప్రధాని మోదీని విమర్శించారు. ‘‘దేశభక్తి గురించి మీరు మాకు పాఠాలు చెబుతారు. మళ్లీ మీరు ఇండియా–పాకిస్థాన్ మ్యాచ్‌ను అహ్మదాబాద్‌లో నిర్వహిస్తారు. మీకన్నా సుష్మాస్వరాజ్ బెటర్. భారతదేశానికి వ్యతిరేకంగా చేస్తున్న ఉగ్ర కార్యకలాపాలను పాకిస్థాన్ నిలిపేసే వరకు క్రికెట్ ఆడకూడదని ఆమె స్పష్టం చేశారు. దీన్ని దేశభక్తి అంటారు” అని హితవు పలికారు. 

సిగ్గులేకుండా ఆడుతున్నారు..

నిఘా ఆరోపణలతో శిక్షకు గురై, పాకిస్తాన్ జైలులో ఉన్న ఇండియన్ నేవీ మాజీ అధికారి కులభూషణ్ యాదవ్‌ గురించి ఉద్ధవ్ ప్రస్తావించారు. ‘‘పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌కు కులభూషణ్‌ యాదవ్‌ను ఆహ్వానిస్తారా? అతడు పాకిస్థాన్‌ జైళ్లలో మగ్గిపోతున్నాడు. మన దేశం కోసం పని చేస్తూ అతడు పట్టుబడ్డాడు. కానీ ఇప్పుడు అతడు బతికున్నాడో లేడో కూడా తెలియదు. మీరేమో సిగ్గులేకుండా పాకిస్థాన్‌తో క్రికెట్ ఆడుతున్నారు” అని నిప్పులు చెరిగారు. మరోవైపు ముస్లిం సోదరీమణులతో రక్షా బంధన్‌ను జరుపుకోవాలంటూ బీజేపీ కార్యకర్తలకు ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపుపైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

గుజరాత్ అల్లర్ల సమయంలో సామూహిక అత్యాచారానికి గురైన బిల్కిస్ బానో లేదా మణిపూర్‌‌లో అల్లరి మూకల వికృతాల వల్ల నగ్నంగా తిరగిన ఇద్దరు మహిళలతో రాఖీలు కట్టించుకుంటారా? అని ఉద్ధవ్ ప్రశ్నించారు. ‘‘ముస్లిం మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడి, దోషులను విడుదల చేసిన తర్వాత.. ఇప్పుడు వారితో కలిసి రక్షా బంధన్ జరుపుకోవాలని అంటున్నారు. బిల్కిస్ బానో సంగతి వదిలేయండి.. మణిపూర్‌‌లో ఇద్దరు బాధిత మహిళలతో రాఖీ కట్టించుకోవడానికి మీరు వెళ్తున్నారా? మీరు ఈ పని చేస్తున్నారా?” అని నిలదీశారు.

గతంలోనూ వ్యతిరేకించిన శివసేన

భారత్– పాక్ మ్యాచ్‌లను గతంలోనూ శివసేన వ్యతిరేకించింది. మన దేశంపై ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న దేశంతో క్రికెట్ ఏంటని మండిపడుతోంది. ఈ క్రమంలో 1991 అక్టోబర్‌‌లో ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగాల్సిన భారత్–పాక్ మ్యాచ్‌కు అంతరాయం కలిగించేందుకు పిచ్‌ను శివసేన కార్యకర్తలు తవ్వేశారు. ఇది అప్పట్లో పెద్ద సంచలనమే అయింది. మరోవైపు 2008లో ముంబైలో ఉగ్రదాడులు జరిగిన తర్వాత నుంచి భారత్, పాక్ మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. పాక్‌లో ఇండియా పర్యటించలేదు. కేవలం ఐసీసీ ట్రోఫీల్లో మాత్రమే ఈ రెండు జట్లు తలపడుతున్నాయి.