తెలంగాణ ప్రజలకు వైసీపీ నాయకులు క్షమాపణలు చెప్పాలన్న పవన్ కళ్యాణ్

తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధిపై రెండు రాష్ట్రాల మంత్రులకు మధ్య మాటల యుద్ధం నడిచిన సంగతి తెలిసిందే. ఏపీలో అభివృద్ధిపై తెలంగాణ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై, ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు సహా పలువురు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అందుకు హరీష్ కూడా వారిపై సరైన రీతిలో స్పందిస్తూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కాగా తెలంగాణ మంత్రి హరీష్ రావుతో పాటు తెలంగాణ ప్రజలను కించపరిచే విధంగా ఏపీ మంత్రుల వ్యాఖ్యలు ఉన్నాయంటూ జనసేన అధినేత […]

Share:

తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధిపై రెండు రాష్ట్రాల మంత్రులకు మధ్య మాటల యుద్ధం నడిచిన సంగతి తెలిసిందే. ఏపీలో అభివృద్ధిపై తెలంగాణ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై, ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు సహా పలువురు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అందుకు హరీష్ కూడా వారిపై సరైన రీతిలో స్పందిస్తూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కాగా తెలంగాణ మంత్రి హరీష్ రావుతో పాటు తెలంగాణ ప్రజలను కించపరిచే విధంగా ఏపీ మంత్రుల వ్యాఖ్యలు ఉన్నాయంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణకు చెందిన మంత్రి హరీష్ రావును ఏపీ గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారని.. వారి మాటలకు వైసీపీ నాయకులు ప్రతిస్పందిస్తున్న తీరు ఇబ్బందికరంగా మారిందన్నారు. వైసిపి నాయకులు తెలంగాణ ప్రజలను కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని జనసేనాని విమర్శించారు. పాలకులు వేరు, ప్రజలు వేరు అని జనసేన ముందు నుంచి చెప్తూనే ఉందన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతినేలా మాట్లాడడం తనకు బాధ కలిగించిందన్నారు. వైసిపి నాయకులు కాస్త నోరు అదుపులో పెట్టుకోమని హితబోధ చేశారు. ఆంధ్ర పాలకులకు తెలంగాణలో వ్యాపారాలు, వాకిళ్లు ఉన్నాయని ఈ విధంగా గుర్తు చేశారు. మంత్రి బొత్స గతంలో తెలంగాణలో కేబుల్ బిజినెస్ చేశారన్నారు. ఒక వ్యక్తి విమర్శ చేస్తే ఆ వ్యక్తి పరంగానే ప్రతి విమర్శ ఉండాలని సూచించారు. నాయకులు మాట్లాడిన దానికి ప్రజలను భాగస్వాములు చేయకూడదని జనసేన కోరుతుందని పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ ఓ వీడియో సందేశాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలకు వైసీపీ బేషరతుగా క్షమాపణలు చెప్పాలన్నారు. వైసిపి మంత్రులు నోరు అదుపులో పెట్టుకోవాలని ఖండించారు. తెలంగాణ మంత్రి వ్యాఖ్యలు బాధ కలిగిస్తే వ్యక్తిగతంగా మాట్లాడాలని ప్రజలకు ఆపాదిస్తూ.. తెలంగాణ ప్రజలను తిట్టడం వారి ఆత్మ గౌరవం దెబ్బతినేలాగా వ్యాఖ్యలు చేయడం సరికాదు అన్నారు జనసేనాని. వైసిపి మంత్రులు అదుపుతప్పి మాట్లాడితే సీఎం స్పందించాలని అన్నారు.  ఇప్పటికే మంత్రి సిదిరి అప్పలరాజు చేసిన వ్యాఖ్యల పైన ముఖ్యమంత్రి కార్యాలయం ఆగ్రహం వ్యక్తం చేసింది. మంత్రి అప్పలరాజును మందలించింది. ఇప్పుడు పవన్ వ్యాఖ్యల పైన వైసిపి ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ ముస్లిం విద్యా, ధార్మిక సంస్థలు, ప్రార్థనా స్థలాలకు రూ. 25 లక్షల విరాళం అందించారు. జనసేన అధికారంలోకి వస్తే ముస్లింల ఆవాస ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తుందని హామీ ఇచ్చారు. ఏ మతం, కులంలో పుట్టాలనే ఛాయిస్ మన చేతుల్లో లేదని పవన్ అన్నారు. ఏ మతం, కులంలో పుట్టినా మానవత్వంతో జీవించడం మాత్రం మన చేతుల్లోనే ఉందన్నారు. భగవంతుడు దృష్టిలో మనందరం సమానమేనని తెలిపారు. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే కుల, మతాలకు అతీతంగా పేదరికం పారద్రోలడం మీద దృష్టి పెడతామని చెప్పుకొచ్చారు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ, ముస్లింలకు ప్రత్యేక పథకాలపై పార్టీ తరపున చర్చ నిర్వహిస్తామని పవన్ కళ్యాణ్ తెలిపారు.