జ‌మిలి ఎన్నిక‌లు నిరంకుశ‌త్వ‌మే అంటున్న మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే

జ‌మిలి ఎన్నిక‌ల విధానాన్ని తీసుకురావాల‌ని అనుకోవ‌డం నిరంకుశ‌త్వ‌మే అవుతుందని అన్నారు మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే. ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ జ‌మిలి ఎన్నిక‌లకు సంబంధించిన చర్చే జరుగుతుంది. ఈ జ‌మిలి ఎన్నిక‌ల విధానం మన దేశానికి ఆర్థిక వ్యవస్థకు ఉపయోగపడుతుందని కొంత మంది చెబుతుంటే అటువంటిదేం లేదని మరికొందరు చెబుతున్నారు. దీంతో సామాన్యులు దీనిపై ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ఎన్డీఏ గవర్నమెంట్ కు వ్యతిరేకంగా ఫామ్ అయిన విపక్ష కూటమి ఇండియాను దెబ్బ తీసేందుకు మోదీ ప్రభుత్వం ఇటువంటి ప్లాన్ […]

Share:

జ‌మిలి ఎన్నిక‌ల విధానాన్ని తీసుకురావాల‌ని అనుకోవ‌డం నిరంకుశ‌త్వ‌మే అవుతుందని అన్నారు మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే. ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ జ‌మిలి ఎన్నిక‌లకు సంబంధించిన చర్చే జరుగుతుంది. ఈ జ‌మిలి ఎన్నిక‌ల విధానం మన దేశానికి ఆర్థిక వ్యవస్థకు ఉపయోగపడుతుందని కొంత మంది చెబుతుంటే అటువంటిదేం లేదని మరికొందరు చెబుతున్నారు. దీంతో సామాన్యులు దీనిపై ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ఎన్డీఏ గవర్నమెంట్ కు వ్యతిరేకంగా ఫామ్ అయిన విపక్ష కూటమి ఇండియాను దెబ్బ తీసేందుకు మోదీ ప్రభుత్వం ఇటువంటి ప్లాన్ ను తీసుకొచ్చిందని కూటమి సభ్యులు తూర్పారా పడుతున్నారు. ఈ బిల్లును పాస్ చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలకు కూడా పిలుపునిచ్చింది. మోదీ ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ బిల్లును అడ్డుకునేందుకు విపక్ష కూటమి తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తోంది. ఎలాగైనా సరే ఈ బిల్లును పార్లమెంట్ లో పాస్ కానివ్వొద్దని కంకణం కట్టుకుంది. అందుకు అనుగుణంగా అడుగులు వేస్తోంది. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహ ప్రతి వ్యూహాలపై చర్చించేందుకు కాంగ్రెస్ తన కూటమి సభ్యులతో ప్రత్యేకంగా సమావేశం అవుతోంది. 

బీజేపీని ఐక్యంగా ఎదుర్కొంటాం… 

ఈ పార్లమెంట్ సమావేశాలకు సంబంధించి కూటమి ఎజెండా గురించి కాంగ్రెస్ అధ్యక్షుడు రాజ్య సభ నేత మల్లికార్జున్ ఖర్గే స్పందించారు. ఆయన మాట్లాడుతూ… పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో కూటమి నేతలు అనుసరించాల్సిన వ్యూహం ఖరారు కాకపోయినా కానీ బీజేపీని ఐక్యంగా ఎదుర్కొనేలా ముందుకు సాగుతామని ఆయన తెలిపారు. ఇక కాంగ్రెస్ లోక్ సభ నాయకుడు, పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ లీడర్ అధిర్ రంజన్ చౌదరి ఇప్పటికే ప్రభుత్వానికి షాక్ ఇచ్చారు. జమిలి ఎన్నికల కోసం నియమించిన కమిటీలో అధిర్ పేరును కూడా ప్రభుత్వం చేర్చింది. కానీ ఆయన ఆ కమిటీలో మెంబర్ గా ఉండేందుకు అంగీకరించలేదు. దీంతో ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేఖతను ఆయన చూపెట్టినట్లైంది. 

ఇది నిరంకుశ‌త్వ‌మే.. 

ఇక కాంగ్రెస్ అధ్యక్షుడు సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. జమిలి ఎన్నికల గురించి ఆయన మాట్లాడుతూ… ఇది ముమ్మాటికీ నిరంకుశ‌త్వ‌మే అని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం తమకు సంఖ్యా బలం ఉందని ఏం చేసినా చెల్లుతుంది అని అనుకుంటుందని తెలిపారు. ప్రభుత్వం నిరంకుశ‌త్వ‌ పోకడలు పోతోందని ఆరోపించారు. ఇక జమిలి ఎన్నికలపై కమిటీని ఏర్పాటు చేయడం గురించి కూడా ఆయన స్పందించారు. కమిటీ ఏర్పాటు అనేది పెద్ద జిమ్మిక్కు అని దుయ్యబట్టారు. మన ఇండియా సమాఖ్యతత్వాన్ని విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని అన్నారు. ప్రతిపక్ష ఇండియా కూటమిని చూసి బీజేపీ భయపడుతోందని అందుకోసమే ఇటువంటి బిల్లులను తీసుకొస్తుందని ఆయన మండిపడ్డారు. ఈ జమిలి ఎన్నికల విషయంలో ఆయన ప్రభుత్వానికి మూడు ప్రశ్నలు సంధించారు. రాష్ట్రాల్లో ఎన్నికైన ప్రభుత్వాలను సంప్రదించకుండా ఇలా నిర్ణయం తీసుకోవడం సరికాదంటూ ఆయన చురకలంటించారు. అంతే కాకుండా ఈ కమిటీలో ప్రతిష్టాత్మకమైన ఎన్నికల సంఘానికి చెందిన ప్రతినిధిని మినహాయించడం కలవరానికి గురి చేస్తోందని అన్నారు.

బీజేపీకి అది అలవాటే… 

ప్రజలు కోరుకుంటున్న దానిని తిరస్కరించడం, ఎన్నికైన ప్రభుత్వాలను కూలదోయడం బీజేపీ పార్టీకి అలవాటే అని ఖర్గే అన్నారు. అందుకోసమే ఈ సారి బీజేపీ ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకువచ్చిందని ఆరోపించారు. ఈ విధానం వల్ల ఎన్నికల ఖర్చు తగ్గుతుందని చెబుతున్నారని కానీ అటువంటిదేమీ ఉండదని ఆయన చెప్పారు.  2014 నుంచి పార్లమెంట్ మరియు అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన మొత్తం 436 ఉప ఎన్నికల్లో అయిన ఖర్చును ఆయన లెక్కగట్టారు. ఎలాగైనా మరోసారి అధికారం హస్తగతం చేసుకోవాలని బీజేపీ ఇటువంటి ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. జమిలి ఎన్నికలు వంటి చర్యలు మన రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేస్తాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి ఎన్నికల సంస్కరణల ద్వారా సాధించేది ఏమీ ఉండదని అన్నారు. అన్ని చర్యలకు విఘాతం కలిగించేలా ప్రధాని ఆలోచనలు ఉన్నాయని దుయ్యబట్టారు. అందుకోసం ఎలాగైనా ఈ బిల్లును పాస్ కాకుండా చేసి బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలని దేశంలో ఉన్న రాజకీయ పార్టీలకు ఆయన పిలుపునిచ్చారు. ఎలాగైనా సరే 2024 సాధారణ ఎన్నికల్లో బీజేపీని గద్దె దించాలని, అందుకోసం శాయశక్తులా కృషి చేయాలని ఆయన కూటమి నేతలకు పిలుపునిచ్చారు.