తెలుగు ప్రజలకు సేవ చేయకుండా నన్ను భూమిపై ఉన్న ఏ శక్తీ ఆపలేదు

నంద్యాలలో అర్థరాత్రి నుంచి పెద్ద ఎత్తున హైడ్రామా చేసిన పోలీసులు శనివారం తెల్లవారుజామున చంద్రబాబు నాయుడును అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా తన అరెస్ట్‌పై బాబు స్పందించారు. అసలు తనను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలని పోలీసులను ప్రశ్నించారు. తాను ఏ తప్పు చేయలేదని చెప్పుకొచ్చారు. “ప్రజా సమస్యలపై పోరాడుతుంటే అణచివేయడానికి ప్రయత్నిస్తున్నారు. అర్ధరాత్రి వచ్చి భయభ్రాంతులకు గురి చేశారు. ఆధారాలు లేకుండా అరెస్ట్ ఏంటని అడిగితే.. సమాధానం చెప్పాల్సిన బాధ్యత లేదా? ఏ తప్పు చేశానో […]

Share:

నంద్యాలలో అర్థరాత్రి నుంచి పెద్ద ఎత్తున హైడ్రామా చేసిన పోలీసులు శనివారం తెల్లవారుజామున చంద్రబాబు నాయుడును అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా తన అరెస్ట్‌పై బాబు స్పందించారు. అసలు తనను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలని పోలీసులను ప్రశ్నించారు. తాను ఏ తప్పు చేయలేదని చెప్పుకొచ్చారు. “ప్రజా సమస్యలపై పోరాడుతుంటే అణచివేయడానికి ప్రయత్నిస్తున్నారు. అర్ధరాత్రి వచ్చి భయభ్రాంతులకు గురి చేశారు. ఆధారాలు లేకుండా అరెస్ట్ ఏంటని అడిగితే.. సమాధానం చెప్పాల్సిన బాధ్యత లేదా? ఏ తప్పు చేశానో చెప్పకుండా అరెస్ట్ చేస్తున్నారు. ప్రజా సమస్యలపై పోరాడాకుండా చేస్తున్నారు.

ఎవరెన్ని కుట్రలు చేసిన చివరికి గెలిచేది న్యాయమేనని, ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో శనివారం ఏపీ సీఐడీ అరెస్టుకు ముందు తెలుగు ప్రజలకు సేవ చేయకుండా తనను భూమిపై ఉన్న ఏ శక్తీ ఆపలేదని తెలుగుదేశం అధినేత ఎన్.చంద్రబాబు నాయుడు అన్నారు.  గత 45 ఏళ్లుగా తెలుగు ప్రజలకు నిస్వార్థంగా సేవ చేశానని, తెలుగు ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు నా ప్రాణాలను త్యాగం చేసేందుకు సిద్ధమయ్యానని, మాతృ భూమి అయిన ఆంధ్రప్రదేశ్‌కు సేవ చేయకుండా ఈ భూమిపై ఉన్న ఏ శక్తీ అడ్డుకోలేదని నాయుడు ట్వీట్ చేశారు.

చంద్రబాబు అరెస్టుపై ఆయన తరఫు న్యాయవాది స్పందించారు. ‘‘చంద్రబాబుకు వైద్య పరీక్షలు చేశారు. వైద్యపరీక్షల్లో చంద్రబాబుకు హైబీపీ, షుగర్‌ ఉంది. చంద్రబాబుకు హైకోర్టులో బెయిల్‌కు ప్రయత్నం చేస్తున్నాం. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి బాగోలేదు. కేసుతో సంబంధం లేని సెక్షన్లు నమోదు చేశారు. స్కిల్ డెవలెప్‌మెంట్‌ కేసులో 37వ ముద్దాయిగా పేర్కొన్నారు’’ అని తెలిపారు.

చంద్రబాబును తీసుకు వెళ్తున్న కాన్వాయ్‌ని టీడీపీ శ్రేణులు చిలకలూరిపేటలో అడ్డుకున్నాయి. మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో మహిళలు సహా వేలాదిమంది టీడీపీ కార్యకర్తలు జాతీయ రహదారిపై కూర్చున్నారు. దీంతో చంద్రబాబును తరలిస్తున్న కాన్వాయ్ ఇక్కడ దాదాపు అరగంటపాటు నిలిచిపోయింది. టీడీపీ శ్రేణులను పక్కకు తప్పించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేశారు. కానీ వారు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ క్రమంలో టీడీపీ అధినేత వాహనం నుండి దిగి దారి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ టీడీపీ శ్రేణులు నిరసనను ఆపలేదు. చంద్రబాబు ఒకటికి రెండుసార్లు దారి ఇవ్వాలని కోరడంతో తప్పుకున్నారు. దీంతో కాన్వాయ్ ముందుకు కదిలింది. 

ఏసీబీ కోర్టులో హాజరు

ఏపీ సీఐడీ అధికారులు ఈ ఉదయం విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ఈ మేరకు  కోర్టుకు రిమాండ్ రిపోర్టును సమర్పించారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసుకు సంబంధించి 2021లో నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో చంద్రబాబు పేరు లేకపోవడంతో, కొద్దిసేపటి క్రితమే చంద్రబాబు పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చినట్టు తెలుస్తోంది. ఈ మార్పును కోర్టుకు తెలియపరుస్తూ సీఐడీ అధికారులు మెమో దాఖలు చేశారు. అంతకుముందు, విచారణ ప్రారంభం సమయంలో తన చాంబర్ లో విచారిస్తానని న్యాయమూర్తి సూచించగా, ఓపెన్ కోర్టు విచారణ జరగాలని టీడీపీ న్యాయవాదుల బృందం కోరింది. దాంతో న్యాయమూర్తి ఓపెన్ కోర్టు విచారణకు అంగీకరించారు.

సీఐడీ డీజీ సంజయ్ స్పందన

చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై ఏపీ  సీఐడీ డీజీ సంజయ్ స్పందించారు. చంద్రబాబు అరెస్ట్‌కు సంబంధించిన వివరాలను ఆయన మీడియా సమావేశంలో వెల్లడించారు. చంద్రబాబును అరెస్ట్ చేసే సమయంలో ఆయనను ఎలాంటి  ఇబ్బంది పెట్టలేదని అన్నారు. రాత్రికి 2.30 గంటలకు అక్కడికి చేరుకున్నప్పటికీ.. ఉదయం ఆరు గంటల వరకు చంద్రబాబును ఇబ్బంది పెట్టలేదని చెప్పారు. చంద్రబాబును ఓర్వకల్లు నుంచి హెలికాప్టర్‌లో విజయవాడకు తీసుకొస్తామని చెబితే.. ఆయనే వద్దని అన్నారని తెలిపారు.  ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌లో రూ. 550 కోట్ల స్కామ్ జరిగిందని చెప్పారు. ప్రభుత్వానికి రూ. 371 కోట్ల నష్టం వచ్చిందని తెలిపారు. 

 ఈ స్కామ్‌లో చంద్రబాబు పాత్ర ఉందని స్పష్టమైందని అన్నారు. ఇది లోతైన ఆర్థిక నేరం అని పేర్కొన్నారు. ఏపీ ఫైబర్ నెట్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసుల్లో కూడా లోకేష్ పాత్రపై విచారణ జరుపుతున్నామని చెప్పారు. న్యాయపరంగా అన్ని చర్యలు తీసుకునే చంద్రబాబును అరెస్ట్ చేశామని తెలిపారు. 

 పవన్ కళ్యాణ్ స్పందన

ప్రాథమిక ఆధారాలను చూపించకుండా అర్థరాత్రి అరెస్ట్ చేయడం దుర్మార్గమన్నారు. ఏ తప్పూ చేయని నాయకులపై మర్డర్ కేసులు పెట్టీ జైళ్లకు నెడుతున్నారంటూ విమర్శించారు. పాలన పరంగా అనుభవం ఉన్నా వ్యక్తి పట్ల ప్రభుత్వ తీరు సరైంది కాదన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అంశంలో ప్రభుత్వం పోలీసులు అందరి పట్ల ఒకలా ఉండాలని పవన్ హితవు పలికారు. 

అరెస్టుపై నిరసన తెలిపితే హౌస్ అరెస్టులు చేస్తారా అంటూ ప్రశ్నించారు. అక్రమాలు చేసిన జైలుకు వెళ్ళిన వాళ్ళు విదేశాలకు వెల్లోచ్చు కానీ చంద్రబాబు మద్దతుగా నిరసనలు తెలిపితే తప్పా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్ట్ లా అండ్ ఆర్డర్ అంశం కాదూ పూర్తిగా ఇధి కక్ష సాధింపు చర్యేనని అన్నారు. చంద్రబాబుకు అండగా ఉంటా మద్దతు తెలుపుతున్నాని పవన్ స్పష్టం చేశారు.