చక్కెర ఎగుమతి త్వరలో ఆంక్షలు? కారణమేంటి?

టమాట, అల్లం, వెల్లుల్లి.. ఒకదాని తర్వాత మరొకటి పెరుగుతూ భయపెడుతున్నాయి. అంతకుముందు వంట నూనె రేట్లు భారీగా పెరిగిపోయాయి. ఇప్పుడు చక్కెర రేట్లు పెరిగేలా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చక్కెర ఎగుమతులను నిషేధించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. వచ్చే అక్టోబర్‌‌తో మొదలయ్యే సీజన్‌ నుంచి చక్కెరను ఎగుమతి చేయకుండా ప్రభుత్వం నిషేధించే అవకాశం ఉందని పరిశ్రమల వర్గాలు అంచనా వేస్తున్నాయి. గత ఏడేళ్లలో తొలిసారిగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవచ్చని ముగ్గురు ప్రభుత్వ అధికారులు చెప్పినట్లు ఓ […]

Share:

టమాట, అల్లం, వెల్లుల్లి.. ఒకదాని తర్వాత మరొకటి పెరుగుతూ భయపెడుతున్నాయి. అంతకుముందు వంట నూనె రేట్లు భారీగా పెరిగిపోయాయి. ఇప్పుడు చక్కెర రేట్లు పెరిగేలా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చక్కెర ఎగుమతులను నిషేధించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. వచ్చే అక్టోబర్‌‌తో మొదలయ్యే సీజన్‌ నుంచి చక్కెరను ఎగుమతి చేయకుండా ప్రభుత్వం నిషేధించే అవకాశం ఉందని పరిశ్రమల వర్గాలు అంచనా వేస్తున్నాయి. గత ఏడేళ్లలో తొలిసారిగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవచ్చని ముగ్గురు ప్రభుత్వ అధికారులు చెప్పినట్లు ఓ వార్తా సంస్థ వెల్లడించింది.

నిషేధం ఎందుకు?

దేశంలో చక్కెర ఉత్పత్తిలో సగానికి పైగా మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లోనే జరుగుతుంది. అయితే ఈ సారి దిగుబడి తగ్గిపోతుందనే అంచనాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో వర్షపాతం సగటున 50 శాతం కంటే తక్కువ నమోదైంది. ఇది పంటపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో 2023–24 సీజన్‌లో చక్కెర ఉత్పత్తి 3.3 శాతం తగ్గి.. 31.7 మిలియన్ టన్నులకు పరిమితం కావచ్చనే అంచనాలు ఉన్నాయి. ఎగుమతులపై నిషేధం విధించవచ్చనే ఆందోళనకు ఈ అంచనాలు బలం చేకూరుస్తున్నాయి.  ‘‘స్థానిక అవసరాలకు పోగా.. అదనపు చెరకు నుంచి ఎథనాల్ ఉత్పత్తి చేయడంపైనే మా ప్రాథమిక దృష్టి ఉంది. వచ్చే సీజన్‌లో ఎగుమతి కోటాలను కేటాయించేంత చక్కెర ఉండకపోవచ్చు” అని ఓ అధికారి చెప్పారు. 

ధరలను అదుపులో ఉంచేందుకే..

సెప్టెంబర్ 30 వ తేదీ వరకు కొనసాగే ప్రస్తుత సీజన్‌లో 6.1 మిలియన్ టన్నుల చక్కెర మాత్రమే ఎగుమతి చేసేందుకు మిల్లులకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. గత సీజన్‌లో రికార్డు స్థాయిలో 11.1 మిలియన్ టన్నుల ఎగుమతి పర్మిషన్ ఇచ్చింది. చక్కర ఎగుమతులను అదుపులో ఉంచేందుకు 2016లో 20 శాతం పన్నును కేంద్రం విధించింది. 

ఇటీవల చక్కెర ధరలు రెండేళ్ల గరిష్టానికి చేరాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో గణనీయంగా పెరిగాయి. మన దేశంలోనూ రిటైల్ మార్కెట్‌లో కిలో చక్కెర రూ.45 నుంచి రూ.48 మధ్య పలుకుతోంది. ఇక జులైలో రిటైల్ ద్రవ్యోల్బణం 15 నెలల గరిష్ట స్థాయికి చేరింది. 7.44 శాతంగా నమోదైంది. అహారం ద్రవ్యోల్బణం ఏకంగా 11.5 శాతానికి ఎగబాకింది. ఆహార ద్రవ్యోల్బనం ఆందోళనకరంగా మారిందని, చక్కెర ధరలు పెరిగిపోతున్నాయని, ఎగుమతులకు అవకాశాలు లేనట్లేనని ఓ కేంద్ర ప్రభుత్వ అధికారి చెప్పారు.

భయపెడుతున్న ఆహార ద్రవ్యోల్బణం

ఆహార ద్రవ్యోల్బణం ప్రస్తుతం భయపెడుతోంది. దీంతో దేశంలో తగినంత మేరకు సరఫరాలు జరిగేలా, స్థిరమైన ధరలు ఉండేలా చూడాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే బాస్మతి తప్ప మిగతా బియ్యం ఎగుమతులపై నిషేధం విధించింది. మరోవైపు ఉల్లి ఎగుమతులపై ఎన్నడూ లేని రీతిలో 40 శాతం సుకం విధించింది. ఇప్పుడు నిత్యావసర సరుకుల్లో ముఖ్యమైనదైన చక్కెర ఎగుమతులను నిలిపివేయాలని ప్లాన్ చేస్తోంది. చక్కెర దరలు పెరగడం వల్ల ఎగుమతులకు అవకాశం లేకుండా పోయిందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. రాబోయే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపడుతోందని విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు ప్రధాన చక్కరె ఎగుమతి దేశాలైనా థాయ్‌ల్యాండ్, బ్రెజిల్‌లో కూడా ఉత్పత్తి పెద్దగా లేదు. ఈ నేపథ్యంలో చక్కెర ధరలు విపరీతంగా పెరిగిపోయే ప్రమాదం ఉందనే సంకేతాలు వస్తున్నాయి. ఇప్పుడు భారత దేశం కూడా చక్కెర ఎగుమతులను నిషేధిస్తే గ్రోబల్‌గా ప్రపంచ చక్కెర మార్కెట్లు, ఆహార ధరలపై గణనీయమైన ప్రభావం పడే ప్రమాదం ఉంది.