చంద్రయాన్–3పై బ్రిటిష్ జర్నలిస్టు అక్కసు..

ప్రపంచంలో ఏ దేశానికీ సాధ్యం కాని రీతిలో చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టింది భారతదేశం. చంద్రయాన్–3తో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. దీనిపై ఎన్నో దేశాలు ప్రశంసలు కురిపిస్తున్నాయి. ఇస్రో, భారతదేశానికి అభినందనలు తెలుపుతున్నాయి. చివరికి పొరుగు దేశం పాకిస్థాన్ కూడా పొగడ్తలు కురిపిస్తుంటే.. బ్రిటన్‌ మాత్రం పెడబొబ్బలు పెడుతోంది. వాళ్లకు చేతకానిది ఇండియా చేసినందుకు అక్కసు వెళ్లగక్కుతోంది. ఇటీవల బీబీసీకి చెందిన ఓ వీడియో వైరల్ కాగా.. తాజాగా ఓ బ్రిటిష్ జర్నలిస్టు చేసిన వ్యాఖ్యలపై […]

Share:

ప్రపంచంలో ఏ దేశానికీ సాధ్యం కాని రీతిలో చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టింది భారతదేశం. చంద్రయాన్–3తో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. దీనిపై ఎన్నో దేశాలు ప్రశంసలు కురిపిస్తున్నాయి. ఇస్రో, భారతదేశానికి అభినందనలు తెలుపుతున్నాయి. చివరికి పొరుగు దేశం పాకిస్థాన్ కూడా పొగడ్తలు కురిపిస్తుంటే.. బ్రిటన్‌ మాత్రం పెడబొబ్బలు పెడుతోంది. వాళ్లకు చేతకానిది ఇండియా చేసినందుకు అక్కసు వెళ్లగక్కుతోంది. ఇటీవల బీబీసీకి చెందిన ఓ వీడియో వైరల్ కాగా.. తాజాగా ఓ బ్రిటిష్ జర్నలిస్టు చేసిన వ్యాఖ్యలపై పెద్ద దుమారమే రేగుతోంది. అతడు చేసిన కామెంట్లపై భారతీయులు తీవ్రంగా స్పందిస్తున్నారు. 2016 నుంచి 2021 మధ్య బ్రిటిష్ ప్రభుత్వం సహాయ నిధిగా రూ.24,081 కోట్లను భారత దేశం తిరిగి ఇవ్వాలంటూ ఓ జర్నలిస్టు అడుగుతున్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. 

అభినందించాలని అనుకుంటున్నానంటూనే.. 

జీబీ న్యూస్‌కు చెందిన మీడియా ప్రెజెంటర్ పాట్రిక్ క్రిస్టీస్ మాట్లాడుతూ.. ‘‘చంద్రుడి చీకటి వైపు దిగినందుకు నేను భారతదేశాన్ని అభినందించాలని అనుకుంటున్నా. ఇదే సమయంలో 2016 నుంచి 2021 మధ్య ఇండియాకు మేము పంపిన రూ.24,081 కోట్ల సహాయ డబ్బును తిరిగి ఇవ్వాలని కోరుతున్నాం. మేం (బ్రిటన్) వచ్చే ఏడాది రూ.597.03 కోట్లను కూడా ఇవ్వాల్సి ఉంది. కానీ బ్రిటిష్ పన్ను చెల్లింపుదారులు ఆ డబ్బును తమ వద్దే ఉంచుకోవాలని నేను భావిస్తున్నా. రూల్స్ ప్రకారం అంతరిక్ష ప్రయోగాలు చేసే దేశాలకు మనం డబ్బు సాయం చేయకూడదు” అని అతడు అక్కసు వెళ్లగక్కాడు. భారతదేశంలో పేదరిక పరిస్థితిని, ఆ దేశాన్ని ప్రభుత్వం ఎందుకు ఆదుకోవాలన్న విషయాన్ని కూడా అతడు  చెప్పుకొచ్చాడు. 

భగ్గుమన్న భారతీయులు

ఈ వీడియోపై భారతీయులు భగ్గుమన్నారు. అతడి వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. ‘‘మిత్రమా.. ముందు మీ బ్రిటిష్ సామ్రాజ్యం భారతదేశం నుంచి దోచుకున్నది తిరిగి ఇవ్వండి” అని ఒకరు కౌంటర్ ఇచ్చారు. ‘‘గుర్తుంచుకోండి.. భారతదేశం విజయం కంటే మించిన అవమానం బ్రిటన్‌కు ఇంకేమీలేదు. భారత్ చేపట్టిన విజయవంతమైన అంతరిక్ష కార్యక్రమాన్ని చూసినప్పుడల్లా వారికి ‘సాయం’ గుర్తుకు వస్తుది. భారత్ సాధించిన విజయాలను చూసినప్పుడు వారు ఎంత అవమానంగా భావిస్తున్నారో ఇది తెలియజేస్తోంది” అని మరొకరు ఎద్దేవా చేశారు. ‘‘ఇది చాలా ఇబ్బందికరం.. అతడు బాధపడినట్లు ఉన్నాడు.. అతడి సాయం అందుతుందని ఆశిస్తున్నా” అని మరొకరు సెటైర్ వేశారు. ‘మండుతున్నట్లు ఉంది’ అని మరొకరు కామెంట్ చేశారు. ‘ఇంత ఏడుపు ఎందుకు మీకు?’ అని మరొకరు రాసుకొచ్చారు.

బీబీసీ వీడియో వైరల్

చంద్రయాన్–3 ప్రాజెక్టు విజయవంతమైన తర్వాత బీబీసీ వీడియో ఒకటి వైరల్‌గా మారింది. అందులో అంతరిక్ష ప్రయోగాలకు పెట్టుబడులు పెట్టాలనే భారత దేశ నిర్ణయాన్ని యాంకర్ ప్రశ్నించారు. ‘‘మౌలిక సదుపాయాలు లేని, అత్యంత పేదరికంలో ఉన్న భారతదేశం అంతరిక్ష కార్యక్రమం కోసం ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేయాలా?” అని అడిగారు. ఇది తీవ్ర వివాదానికి కారణమైంది. ప్రముఖ పరిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర సహా ఎంతో మంది తీవ్రంగా స్పందించారు.

ఈ వీడియోపై బీబీసీ స్పందించింది. బీబీసీ తెలుగు వెబ్‌సైట్‌లో ఓ వార్తను ప్రచురించింది. బీబీసీ వరల్డ్ న్యూస్‌లో ప్రసారమైన నాలుగేళ్ల నాటి వీడియోను ఎడిట్ చేసి, తాజా వీడియోగా సోషల్ మీడియాలో నెటిజన్లు షేర్ చేస్తున్నారని చెప్పుకొచ్చింది. ‘‘అది 2019లో చంద్రయాన్-2 ప్రయోగానికి ముందు బీబీసీ వరల్డ్ టెలివిజన్ ప్రజెంటర్, బీబీసీ భారతీయ కరస్పాండెంట్ మధ్య జరిగిన చర్చకు సంబంధించిన వీడియో. దాన్ని ఎడిట్ చేసి ట్విటర్‌లో షేర్ చేయడం ప్రారంభించాయి కొన్ని హ్యాండిళ్లు. సోషల్ మీడియాలో షేర్ అవుతున్న ఆ వీడియో క్లిప్‌కు చంద్రయాన్-3తో ఎలాంటి సంబంధమూ లేదు. దానిలో కేవలం ప్రజెంటర్ ప్రశ్నను మాత్రమే పూర్తిగా చూపించారు. ప్రజెంటర్ ప్రశ్నకు ఇచ్చిన సమాధానంలో సగం మాత్రం ఎడిట్ చేసి, వీడియో క్లిప్ తయారు చేసి తిప్పారు. ఈ వీడియో పాతదని స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే దానిపై బీబీసీ వరల్డ్ న్యూస్ లోగో ఉంది. వాస్తవం ఏమిటంటే ఈ లోగోతో ప్రస్తుతం బీబీసీ ఛానల్ ప్రసారం కావడం లేదు” అని తమ తెలుగు వెబ్‌సైట్‌లో రాసుకొచ్చింది.