అజిత్ పవార్ వ్యవహారంపై శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నేత అజిత్ పవార్ మహారాష్ట్ర బీజేపీ కూటమి ప్రభుత్వంలో చేరనున్నారంటూ వస్తున్న వార్తలపై ఆ పార్టీ అధినేత శరద్ పవార్ స్పందించారు. ఈ అంశంపై పార్టీలో ఎటువంటి చర్చ జరగలేదని స్పష్టం చేశారు. ఎవరైనా పార్టీ నుండి విడిపోవాలని ప్రయత్నిస్తున్నట్లయితే అది వారి వ్యూహం అయి ఉండవచ్చని అన్నారు. మేము ఒక స్టాండ్ తీసుకుని ఉంటే దానిపై గట్టిగా నిలబడతామని అన్నారు. పార్టీలో ఎలాంటి చర్యలు జరగనందున దానిపై మాట్లాడటం సరికాదని […]

Share:

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నేత అజిత్ పవార్ మహారాష్ట్ర బీజేపీ కూటమి ప్రభుత్వంలో చేరనున్నారంటూ వస్తున్న వార్తలపై ఆ పార్టీ అధినేత శరద్ పవార్ స్పందించారు. ఈ అంశంపై పార్టీలో ఎటువంటి చర్చ జరగలేదని స్పష్టం చేశారు. ఎవరైనా పార్టీ నుండి విడిపోవాలని ప్రయత్నిస్తున్నట్లయితే అది వారి వ్యూహం అయి ఉండవచ్చని అన్నారు. మేము ఒక స్టాండ్ తీసుకుని ఉంటే దానిపై గట్టిగా నిలబడతామని అన్నారు. పార్టీలో ఎలాంటి చర్యలు జరగనందున దానిపై మాట్లాడటం సరికాదని శరద్ పవార్ పేర్కొన్నారు.  అంతకు ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి తాను సిద్దంగా ఉన్నానని, రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆశలు పెట్టుకోవటంలో తప్పేమీ లేదని అజిత్ పవార్ చేసిన వ్యాఖ్యలపై ఎన్సీపీ ఎంపి సుప్రియా సూలే మద్దతు పలికారు. 

రాజకీయాల్లో ఉన్న వారికి కలలు, ఆశయాలు ఉండటంతో తప్పేముందని సూలే ప్రశ్నించారు. ఇలాంటి కలలు రాజకీయాల్లో ఉన్న అందరికి ఉంటాయని అన్నారు. అజిత్ పవార్ తన ఆశయం గురించి బహిరంగంగా చెప్పడంలో ఎలాంటి తప్పులేదని ఆమె అభిప్రాయపడ్డారు. పైగా ఆయన నిజాయితీగా మాట్లాడారని ఎఎన్ఐతో అన్నారు సుప్రియా సూలే. రీసెంట్ గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో మీరు ముఖ్యమంత్రి కావాలని అనుకుంటున్నారా.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీపీ ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడుతుందా అన్న ప్రశ్నలకు అజిత్ పవార్ చెప్పిన సమాధానం ఆసక్తికరంగా మారింది. నూరు శాతం అనుకుంటున్నాను, ఎన్నికల్లో పోటీ చేసేందుకు 2024 వరకు ఎందుకు.. మేం ఇప్పుడు కూడా ఆ పదవి పొందేందుకు సిద్దంగా ఉన్నామని అజిత్ పవార్ బదులు ఇవ్వడం మహారాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. అజిత్ పవార్ ఎన్సీపీని వీడి బీజేపీలో చేరనున్నారంటూ వస్తున్న వార్తలపై అంతకు ముందు సూలేను ప్రశ్నించగా, తాను రాష్ట్రంలో పలు అభివృద్ధి పనులకు సంబంధించి బిజీగా ఉన్నాననీ, వస్తున్న వదంతులపై స్పందించడానికి సిద్దంగా లేనని తెలిపారు. మహారాష్ట్ర రాజకీయాల్లో ఈ అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 

అజిత్ పవార్ ఎన్సీపీపై అలగడం ఇది మొదటి సారి కాదు. ఇంతకు ముందు 2019 ఎన్నికల అనంతరం ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేన కలిసి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు చర్చలు జరుపుతున్న వేళ .. అజిత్ పవార్ బిగ్ ట్విస్ట్ ఇస్తూ బీజేపీతో కలిసి ప్రభుత్వ ఏర్పాటునకు మద్దతు ప్రకటించారు. దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా, అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం, ఆ తర్వాత 80 గంటల్లోనే ప్రభుత్వం పడిపోవడం సంచలనం అయ్యింది. అప్పుడు ఎన్సీపీ సభ్యులు అందరూ శరద్ పవార్ కు మద్దతుగా నిలవడంతో అజిత్ పవార్ వెనక్కు వచ్చేశారు. అనంతరం శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల ఆధ్వర్యంలో మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం ఏర్పడింది. 

కొద్ది నెలల క్రితం ఏక్ నాథ్ శిండే శివసేన అధినేత, అప్పటి సీఎం ఉద్దయ్ ఠాక్రేపై తిరుగుబాటు చేయడం, ఆయన వెంట మెజార్టీ శివసేన ఎమ్మెల్యేలు మద్దతుగా వెళ్లిపోయి బీజేపీ పంచన చేరడంతో ఉద్దవ్ ఠాక్రే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ నేపథ్యంలో బీజేపీతో కలిసి ఏక్ నాథ్ శిండే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. బీజేపీ అధిష్టానం ఆదేశాలతో మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రి చేపట్టారు. మరో ఏడాదిలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ఏర్పాటైన బీఆర్ఎస్ కూడా మహారాష్ట్ర పై ఫోకస్ పెట్టింది. వివిధ రాజకీయ పార్టీల్లోని అసమ్మతి నేతలు బీఆర్ఎస్ పార్టీలోకి చేర్చుకోవడం ద్వారా బలపడేందుకు వ్యూహాలను సిద్దం చేస్తూ ముందుకు వెళుతున్నారు కేసీఆర్.