‘బ్రిక్స్‌’ కూటమి విస్తరణకు మద్దతు పలికిన ప్రధాని మోదీ!

ఐదు దేశాల ‘బ్రిక్స్‌’ కూటమి విస్తరణకు ప్రధాని నరేంద్ర మోదీ తన పూర్తి మద్దతును తెలియజేశారు. ఏకాభిప్రాయం ఆధారంగా ముందుకు సాగాలనే నిర్ణయాన్నిభారతదేశం స్వాగతిస్తున్నట్లు ప్రకటించారు. దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్‌బర్గ్‌లో జరుగుతున్న 15వ బ్రిక్స్‌ సమ్మిట్ ఓపెన్‌ ప్లీనరీలో సెషన్‌లో ప్రధాని మాట్లాడారు. అద్భుతమైన భవిష్యత్‌కు బ్రిక్స్‌ సిద్ధంగా ఉండాలంటే.. అంతకన్నాముందు మనం మన సమాజాలను భవిష్యత్‌కు సిద్ధం చేయాలని సూచించారు. భారతదేశం తన జీ20 ప్రెసిడెన్సీలో గ్లోబల్ సౌత్ దేశాలకు చాలా ప్రాముఖ్యత ఇచ్చిందని వెల్లడించారు. మరోవైపు […]

Share:

ఐదు దేశాల ‘బ్రిక్స్‌’ కూటమి విస్తరణకు ప్రధాని నరేంద్ర మోదీ తన పూర్తి మద్దతును తెలియజేశారు. ఏకాభిప్రాయం ఆధారంగా ముందుకు సాగాలనే నిర్ణయాన్నిభారతదేశం స్వాగతిస్తున్నట్లు ప్రకటించారు. దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్‌బర్గ్‌లో జరుగుతున్న 15వ బ్రిక్స్‌ సమ్మిట్ ఓపెన్‌ ప్లీనరీలో సెషన్‌లో ప్రధాని మాట్లాడారు. అద్భుతమైన భవిష్యత్‌కు బ్రిక్స్‌ సిద్ధంగా ఉండాలంటే.. అంతకన్నాముందు మనం మన సమాజాలను భవిష్యత్‌కు సిద్ధం చేయాలని సూచించారు. భారతదేశం తన జీ20 ప్రెసిడెన్సీలో గ్లోబల్ సౌత్ దేశాలకు చాలా ప్రాముఖ్యత ఇచ్చిందని వెల్లడించారు. మరోవైపు బ్రిక్స్ సమ్మిట్‌కు ఆతిథ్యం ఇచ్చే విషయంలో దక్షిణాఫ్రికా చొరవను ఆయన ప్రశంసించారు. ‘‘బ్రిక్స్‌లో గ్లోబల్ సౌత్ దేశాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చేలా దక్షిణాఫ్రికా తీసుకున్న చర్యలను మేం స్వాగతిస్తున్నాం. ఈ విషయంలో భారతదేశం కూడా తన జీ20 అధ్యక్షతన ప్రాధాన్యం ఇచ్చింది” అని వివరించారు.

అద్భుత ప్రయాణం

బ్రిక్స్‌ గత రెండు దేశాబ్దాల్లో సుదీర్ఘ, అద్భుత ప్రయాణం చేసిందని ప్రధాని మోదీ చెప్పారు. గ్లోబల్‌ సౌత్‌లో అభివృద్ధి కార్యకలాపాలను ముందుకు తీసుకెళ్లడంతో ఈ గ్రూపునకు చెందిన న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. రైల్వే రీసెర్చ్ నెట్‌వర్క్‌ల కోసం చర్యలు చేపట్టాలని, ఎంఎస్‌ఎంఈ.. స్టార్టప్స్‌ మధ్య సహకారం ఉండాలని తమ దేశం సూచించిందని వివరించారు. ఈ రంగాల్లో గణనీయమైన పురోగతి ఉందని అన్నారు. రాబోయే భవిష్యత్తుకు సిద్ధమైన సంస్థగా బ్రిక్స్‌ను మార్చేందుకు.. ముందుగా తమ దేశాలను ఫ్యూచర్ రెడీ సొసైటీలుగా మార్చాలని పిలుపునిచ్చారు. ఈ ప్రయత్నాల్లో సాంకేతికత ముఖ్య పాత్ర పోషిస్తుందని అన్నారు. ఆఫ్రికన్‌ యూనియన్‌కు జీ20లో శాశ్వత సభ్యత్వాన్నితాము ప్రతిపాదిస్తున్నట్లు మోదీ చెప్పారు. ‘‘జీ20 సదస్సును భారత దేశంలో సెప్టెంబర్ 9, 10 తేదీల్లో నిర్వహిస్తున్నాం. బ్రిక్స్ దేశాలు అందులో శాశ్వత సభ్యులే. ఆఫ్రికన్ యూనియన్‌కు కూడా జీ20లో శాశ్వాత సభ్యత్వం ఇవ్వాలని ప్రతిపాదిస్తున్నాం” అని ప్రధాని చెప్పారు.

భారతదేశంతో జొహన్నెస్‌బర్గ్‌కు లోతైన సంబంధాలు

భారతదేశం, మహాత్మా గాంధీతో జొహన్నెస్‌బర్గ్‌కు ఉన్న లోతైన, పాత సంబంధాలను ప్రధాని గుర్తు చేసుకున్నారు. అలాగే రెండు దేశాల మధ్య ఉన్న చారిత్రక సంబంధాలను ప్రస్తావించారు. ‘‘జొహెన్నెస్‌బర్గ్ లాంటి అందమైన నగరానికి రావడం నాకు, నా ప్రతినిధి బృందానికి సంతోషకరమైన విషయం. ఈ నగరంతో భారతీయులు,  భారతదేశ చరిత్రకు లోతైన సంబంధాలు ఉన్నాయి. ఇక్కడికి కొంత దూరంలోనే టాల్‌స్టాయ్ ఫామ్ ఉంది. 110 ఏళ్ల కిందట మహాత్మా గాంధీ దాన్ని నిర్మించారు. భారతదేశం, యురేషియా, ఆఫ్రికా దేశాల గొప్ప ఆలోచనలను అనుసంధానించడం ద్వారా.. మహాత్మా గాంధీ మన ఐక్యత, సామరస్యానికి బలమైన పునాది వేశారు. 

2019 తర్వాత తొలిసారి

మంగళవారం సాయంత్రం దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్‌బర్గ్‌కు ప్రధాని మోదీ చేరుకున్నారు. వాటర్‌‌క్లూఫ్ ఎయిర్‌‌ ఫోర్స్‌ బేస్‌లో ఆయనకు సౌతాఫ్రికా డిప్యూటీ ప్రెసిడెంట్ ఆహ్వానం పలికారు. అక్కడ ఆయనకు ప్రవాస భారతీయులు వందేమాతరం నినాదాలతో ఘనంగా  స్వాగతం పలికారు. బ్రిక్స్‌ అనేది బ్రెజిల్, రష్యా, భారతదేశం, చైనా, దక్షిణాఫ్రికా దేశాల సమూహం. ప్రపంచ జనాభాలో 40 శాతం ఈ దేశాల్లోనే ఉన్నారు. ప్రపంచ జీడీపీ, వాణిజ్యంలోనూ ఈ దేశాలు కీలకం. ఇక కరోనా కారణంగా మూడేళ్లుగా వ్యక్తిగతంగా బ్రిక్స్ సమావేశాలు జరగడం లేదు. 2019 తర్వాత ఇప్పుడే నేతలందరూ ఒక్కచోట కలిశారు. గత మూడేళ్లుగా వర్చువల్‌గానే సమావేశాలు జరుగుతున్నాయి. బ్రెజిల్, రష్యా, భారతదేశం, చైనా, దక్షిణాఫ్రికా దేశాలతో కూడిన బ్రిక్స్‌ కూటమిని విస్తరించాలన్న ప్రతిపాదనతో ఈ సారి భారత్ ముందుకు వచ్చింది. అయితే ఈ విస్తరణ ఏకాభిప్రాయాంతో జరగాలని ప్రధాని స్పష్టం చేశారు.