పారిపోయిన వారు తిరిగి మ‌ణిపూర్‌కి

గత మూడున్నర నెలలుగా అల్లర్లతో అట్టుడుకుతున్న మణిపూర్‌‌లో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. అక్కడక్కడ ఇంకా హింస చెలరేగుతున్నా… పోలీసులు వెంటనే చర్యలు తీసుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొస్తున్నారు. కుకీ, మైతీల మధ్య జరిగిన అల్లర్లు రాష్ట్రవ్యాప్తంగా వ్యాపించాయి. చాలామంది ప్రాణాలు కోల్పోయారు. మహిళలపై లైంగిక దాడులు జరిగాయి. వేల ఇళ్లు ధ్వంసమయ్యాయి. గొడవలకు భయపడి కొన్ని వేల కుటుంబాలు తాము ఉంటున్న ప్రాంతాన్ని వదిలి వేరే ప్రాంతాలకు వలస వెళ్లారు. ఇందులో చాలామంది మణిపూర్‌‌ పక్కనున్న […]

Share:

గత మూడున్నర నెలలుగా అల్లర్లతో అట్టుడుకుతున్న మణిపూర్‌‌లో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. అక్కడక్కడ ఇంకా హింస చెలరేగుతున్నా… పోలీసులు వెంటనే చర్యలు తీసుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొస్తున్నారు. కుకీ, మైతీల మధ్య జరిగిన అల్లర్లు రాష్ట్రవ్యాప్తంగా వ్యాపించాయి. చాలామంది ప్రాణాలు కోల్పోయారు. మహిళలపై లైంగిక దాడులు జరిగాయి. వేల ఇళ్లు ధ్వంసమయ్యాయి. గొడవలకు భయపడి కొన్ని వేల కుటుంబాలు తాము ఉంటున్న ప్రాంతాన్ని వదిలి వేరే ప్రాంతాలకు వలస వెళ్లారు. ఇందులో చాలామంది మణిపూర్‌‌ పక్కనున్న మయన్మార్‌‌కు పారిపోయి తల దాచుకున్నారు. మరికొందరు రాష్ట్రప్రభత్వం ఏర్పాటు చేసిన షెల్టర్లలో నివాసం ఉంటున్నారు. 

తాజాగా రాష్ట్రంలో పరిస్థితి కొంత అదుపులోకి రావడంతో మయన్మార్‌‌ వైపు పారిపోయి తాము ప్రాంతంలో తలదాచుకున్న మణిపూర్‌‌ వాసులను తిరిగి సొంత రాష్ట్రానికి తీసుకొచ్చారు. గత మూడు నెలలుగా దాదాపు 200 మందికి పైగా మణిపూర్‌‌ వాసులు మయన్మార్‌‌లో ఆశ్రయం పొందుతున్నారు. ఈ క్రమంలో వారందరినీ భారత రక్షణ దళాలు తిరిగి స్వదేశానికి తీసుకొచ్చాయి.

ఆర్మీకి మణిపూర్ సీఎం బీరెన్‌ సింగ్‌ కృతజ్ఞతలు…

దాదాపు 212  మంది పౌరులు (అందరూ మైతీలు) శుక్రవారం మధ్యాహ్నం తిరిగి వచ్చారు. మణిపూర్ రాజధాని ఇంఫాల్‌కు దక్షిణంగా 110 కిలోమీటర్ల దూరంలో సరిహద్దు వాణిజ్య పట్టణమైన మోరేహ్‌కు తీసుకొచ్చారు. వీరిని సరిహద్దు వద్ద అస్సాం రైఫిల్స్‌, గూర్బా రెజిమెంట్‌ కమాండెంట్ల నేతృత్వంలోని భారత సైన్యం రిసీవ్‌ చేసుకుందని సంబంధిత అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా మణిపూర్‌‌ సీఎం ఎన్‌.బీరెన్‌ సింగ్‌ శుక్రవారం రాత్రి ఆర్మీ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ‘‘మణిపూర్‌‌లోని మోరే పట్టణంలో మే 3వ తేదీ జరిగిన హింస తర్వాత మైతీ వర్గానికి చెందిన దాదాపు 212 మంది ఇండియన్లు మయన్మార్‌‌ సరిహద్దులకు పారిపోయి తలదాచుకున్నారు. ఇప్పుడు వారందరూ సురక్షితంగా తిరిగి ఇండియాకు వచ్చారు. వారిని స్వదేశానికి తీసుకురావడంలో కృషి చేసిన ఇండియన్‌ ఆర్మీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు” అని  ట్విట్టర్‌‌ (ఎక్స్‌)లో పేర్కొన్నారు. జీవోసీ ఈస్ట్రర్న్‌ కమాండ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ ఆర్పీ కలిత, జీవోసీ 3 కార్ప్‌, లెఫ్టినెంట్‌ జనరల్‌ హెచ్‌ఎస్‌ సాహి, 5ఏఆర్‌‌ సీవో, కల్నల్‌ రాహుల్‌ జైన్‌  సేనలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు. 

మణిపూర్‌‌లో మోరేలోని వార్డ్ నంబర్‌‌ 4లో జరిగిన హింసలో ప్రేమ్‌నగర్‌‌ నివాసితులు ఇండో,మయన్మార్‌‌ అంతర్జాతీయ సరిహద్దును దాటి మయన్మార్‌‌ వైపు పారిపోయారు. సాగింగ్‌ డివిజన్‌లోని తాము ప్రాంతంలో తలదాచుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మయన్మార్‌‌లో వారు నివాసం ఉంటున్నారు. కాగా, వారి భద్రత కోసం ఎంఎస్‌ఎంఈ నేషనల్‌ బోర్డ్‌ సభ్యుడు రాబిన్‌ బ్లాకీ లేఖ రాశారు. కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి రాజ్‌కుమార్‌‌ రంజన్‌ సింగ్‌ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ‘‘విదేశాంగ మంత్రిత్వ శాఖలో మయన్మార్‌‌లో సంబంధిత అధికారులకు నేను  ఈ సమస్య గురించి చెప్పాను. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా కోరాను. మయన్మార్‌‌లోని ఇండియా రాయబార కార్యాలయంలోని అధికారుల సాయంతో ఆ దేశంలో ఉన్న మణిపూర్‌‌ వాసులను సంప్రదించారు” అని రంజన్‌ సింగ్‌ తన లేఖలో పేర్కొన్నారు. దేశానికి తిరిగి వచ్చిన వారికి అన్ని రకాల సాయం చేస్తామని, ఫుడ్‌, అవసరమైన మెడికేషన్ ఇవ్వడానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయని కేంద్ర మంత్రి తెలిపారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని తాను పర్యవేక్షిస్తూనే ఉన్నానని ఆయన తెలిపారు. 

కాగా, మణిపూర్‌‌లో ఉన్న జనాభాలో కుకీలు, మైతీలదే అగ్రభాగం. కొద్ది భాగంలో నాగాలు కూడా ఉంటారు. అయితే, రిజర్వేషన్ల విషయంలో ఈ రెండు తెగల మధ్య గొడవ మొదలైంది. కుకీల మాదిరిగానే మైతీలకు కూడా ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్‌ చేశారు. అయితే, మైతీల డిమాండ్‌కు కుకీలు అభ్యంతరం తెలిపారు. దీంతో గొడవ మొదలైంది. ఈ క్రమంలో ఇరు వర్గాలకు చెందిన పలువురు హత్యకు గురయ్యారు. ఇప్పటివరకు దాదాపు 150 మందికిపైగా మరణించారు. 50 వేల మంది నిరాశ్రయులయ్యారు. అంతేకాకుండా గ్రామాలకు గ్రామాలే తగలబడిపోయాయి. ఈ క్రమంలో ఇద్దరు మైతీ వర్గానికి చెందిన మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో దేశవ్యాప్తంగా పెద్ద దుమారమే చెలరేగింది.