ఢిల్లీ వాసుల ఆయుర్దాయం తగ్గిపోతోంది..!

గాలి కాలుష్యం వల్ల ఢిల్లీ వాసుల ఆయుర్దాయం 12 ఏళ్లు తగ్గిపోతోందని అమెరికాకు చెందిన ఓ ఇన్‌స్టిట్యూట్ అధ్యయనంలో వెల్లడైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనలను పాటించకపోతే ప్రతి ఇండియన్ ఆయుర్దాయం  5.3 ఏళ్లు తగ్గిపోతుందని హెచ్చరించింది ‘చెరపకురా చెడేవు’ అని వెనుకటికి ఒక సామెత. ఇప్పుడు మన జీవితాలకు ఈ సామెత అచ్చు గుద్దినట్లు సరిపోతుంది. సహజ వనరులను అడ్డుగోలుగా ఉపయోగించి, వ్యర్థాలను విపరీతంగా ఉత్పత్తి చేస్తూ మన జీవితాలను మనమే కుదించుకుంటున్నాం. ఆఖరికి నీటిలో […]

Share:

గాలి కాలుష్యం వల్ల ఢిల్లీ వాసుల ఆయుర్దాయం 12 ఏళ్లు తగ్గిపోతోందని అమెరికాకు చెందిన ఓ ఇన్‌స్టిట్యూట్ అధ్యయనంలో వెల్లడైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనలను పాటించకపోతే ప్రతి ఇండియన్ ఆయుర్దాయం  5.3 ఏళ్లు తగ్గిపోతుందని హెచ్చరించింది

‘చెరపకురా చెడేవు’ అని వెనుకటికి ఒక సామెత. ఇప్పుడు మన జీవితాలకు ఈ సామెత అచ్చు గుద్దినట్లు సరిపోతుంది. సహజ వనరులను అడ్డుగోలుగా ఉపయోగించి, వ్యర్థాలను విపరీతంగా ఉత్పత్తి చేస్తూ మన జీవితాలను మనమే కుదించుకుంటున్నాం. ఆఖరికి నీటిలో కూడా ప్లాస్టిక్ ఆనవాళ్లు ఉండేంత స్థాయికి కాలుష్యం చేస్తున్నాం.  ఈ కాలుష్యం మానవ జీవితాలపై పెను ప్రభావం చూపిస్తోంది. లైఫ్ స్పాన్‌ను తగ్గిస్తోంది. ఈ ఎఫెక్ట్ నగరాల్లో ఉంటున్న ప్రజలపై మరింత ఎక్కువగా ఉంటోంది. ఈ విషయం తాజాగా ఓ స్టడీలో వెల్లడైంది. కాలుష్యం కారణంగా ఢిల్లీ ప్రజల లైఫ్‌ స్పాన్‌ భారీగా తగ్గిపోయినట్లు వెల్లడించి పెద్ద షాక్ ఇచ్చింది. 

12 ఏళ్లు తగ్గిందట

గాలి కాలుష్యం వల్ల ఢిల్లీ ప్రజల జీవితం 11.9 ఏళ్లు తగ్గిందని యూనివర్సిటీ ఆఫ్ చికాగోకు చెందిన ఎనర్జీ పాలసీ ఇన్‌స్టిట్యూట్ వెల్లడించింది. ఈ మేరకు ఎయిర్‌‌ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్‌ (ఏక్యూఎల్‌ఐ) రిపోర్టును విడుదల చేసింది. కాలుష్య ప్రభావాన్ని కొలిచేందుకు 2021 నుంచి నమోదైన పర్టిక్యులేట్ మ్యాటర్‌‌ (పీఎం) డేటాను తీసుకుంది. 2021లో సగటున ఢిల్లీ వార్షిక పీఎం 2.5.. మైక్రోగ్రామ్స్‌ పర్ క్యూబిక్ మీటర్ ఎయిర్‌‌ 126.5 గా ఉన్నట్లు తేలింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) గైడ్‌లైన్స్‌ ప్రకారం పేర్కొన్న దానికి 25 రెట్లు ఎక్కువ. 2020లో 107గా నమోదైంది. కానీ తర్వాతి ఏడాదిలోనే భారీగా పెరిగిపోయింది. పర్టిక్యులేట్ మ్యాటర్ స్థాయి పెరిగే కొద్దీ.. ప్రజల ఆరోగ్యంపై పడే ప్రభావం పెరుగుతుంది. దుష్ప్రభావాలు పెరిగుతాయి. ‘‘దక్షిణ ఆసియాలో పర్టిక్యులేట్ మ్యాటర్ పొల్యూషన్ 2013 నుంచి 2021 దాకా 9.7 శాతం పెరిగింది. ఇండియాలో పర్టిక్యులేట్ మ్యాటర్ 2.5 లెవెల్స్ 9.5 శాతం పెరిగాయి. పాకిస్థాన్‌లో 8.8 శాతం, బంగ్లాదేశ్‌లో 12.4 శాతం పెరిగాయి” అని రిపోర్టులో ఎనర్జీ పాలసీ ఇన్‌స్టిట్యూట్ వివరించింది. ఇక శాటిలైట్ల ద్వారా సేకరించిన సమాచారం ప్రకారం 2021లో పీఎం 2.5 డేటాను విశ్లేషిస్తే.. ఇండియాలో కాలుష్యం మైక్రోగ్రామ్స్‌ పర్ క్యూబిక్ మీటర్ ఎయిర్‌‌ 56.2 నుంచి 58.7కి పెరిగింది. డబ్ల్యూహెచ్‌వో గైడ్‌లైన్స్‌కు ఇది 10 రెట్లు ఎక్కువ. 

గుండె జబ్బులు, పోషకాహార లోపాలు

కాలుష్యం పెరిగిపోవడం వల్ల ఆయుర్దాయం తగ్గిపోవడం, హృదయ సంబంధిత వ్యాధులు ఎక్కువ కావడం, పిల్లలు, తల్లి పోషకాహార లోపాలు తలెత్తడం వంటివి ఎదురయ్యే ప్రమాదం ఉందని నివేదిక హెచ్చరించింది. పర్టిక్యులేట్ పొల్యూషన్ సగటున భారతీయుడి జీవితాన్ని 5.3 ఏళ్లు తగ్గిస్తుంది. హృదయ సంబంధిత వ్యాధుల వల్ల సుమారు 4.5 ఏళ్లు ఆయుర్దాయం తగ్గుతుంది. ఇక పోషకాహార సమస్యల వల్ల మరో 1.8 ఏళ్లు తగ్గిపోతాయి. మొత్తంగా మానవుని జీవితంలో 11.9 ఏళ్లు తగ్గిపోతాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలను ఇప్పటికైనా పట్టించుకుని, జాగ్రత్తలు తీసుకోకపోతే సగటున ప్రతి భారతీయుడి ఆయుర్దాయం 5.3 ఏళ్లు తగ్గిపోతుందని ఎనర్జీ పాలసీ ఇన్‌స్టిట్యూట్ గట్టి హెచ్చరికలు చేసింది. దేశంలో బీహార్, చండీగఢ్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌ తదితర ప్రాంతాలు దేశంలో అత్యంత కలుషిత ప్రాంతాలని పేర్కొంది. ఇక్కడ కాలుష్య స్థాయి ఎక్కువగా ఉండటంతో స్థానికులు తమ జీవిత కాలంలో 8 ఏళ్లను కోల్పోవచ్చని తెలియజేసింది.