అతీక్ అహ్మద్ లాయర్ అరెస్టు!

ఉత్తరప్రదేశ్‌లో కరుడుగట్టిన నేరస్థుడు, మాజీ ఎంపీ అతీక్ అహ్మద్ గత ఏప్రిల్‌లో హత్యకు గురైన విషయం తెలిసిందే. అతడు చనిపోయినా.. అతడికి సంబంధించిన కేసు ఇంకా కొనసాగుతోంది. అరెస్టులు కొనసాగుతున్నాయి. తాజాగా అతీక్ అహ్మద్‌కు లాయర్‌‌గా పని చేసిన విజయ్  మిశ్రాను పోలీసులు అరెస్టు చేశారు. ఒకరి హత్య కేసులో ఇతడి ప్రమేయం ఉందన్న ఆరోపణలతో అదుపులోకి తీసుకున్నారు. ఉమేశ్ పాల్ లొకేషన్ చెప్పాడు! 2005 జనవరిలో బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్‌ హత్యకు గురయ్యారు. ఇందులో […]

Share:

ఉత్తరప్రదేశ్‌లో కరుడుగట్టిన నేరస్థుడు, మాజీ ఎంపీ అతీక్ అహ్మద్ గత ఏప్రిల్‌లో హత్యకు గురైన విషయం తెలిసిందే. అతడు చనిపోయినా.. అతడికి సంబంధించిన కేసు ఇంకా కొనసాగుతోంది. అరెస్టులు కొనసాగుతున్నాయి. తాజాగా అతీక్ అహ్మద్‌కు లాయర్‌‌గా పని చేసిన విజయ్  మిశ్రాను పోలీసులు అరెస్టు చేశారు. ఒకరి హత్య కేసులో ఇతడి ప్రమేయం ఉందన్న ఆరోపణలతో అదుపులోకి తీసుకున్నారు.

ఉమేశ్ పాల్ లొకేషన్ చెప్పాడు!

2005 జనవరిలో బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్‌ హత్యకు గురయ్యారు. ఇందులో అతీక్ అహ్మద్, అతడి సోదరుడు మహమ్మద్ ఆశ్రఫ్ ప్రధాన నిందితులు. ఈ కేసులో రాజు పాల్‌ అనుచరుడు ఉమేశ్ పాల్ ముఖ్య సాక్షిగా ఉన్నారు. తమకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పవద్దంటూ ఉమేశ్ పాల్‌పై అతీక్ అహ్మద్ సోదరులు చాలా సార్లు ఒత్తిడి తెచ్చారు. కానీ ఒప్పుకోకపోవడంతో గత ఫిబ్రవరిలో ఉమేశ్‌పాల్‌ను హత్య చేశారు. ఈ కేసులోనే అతీక్ లాయర్ విజయ్ మిశ్రాను తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. లక్నోలోని హోటల్ హయాత్ లెగసీ బయట అదుపులోకి తీసుకున్నారు. ఉమేశ్‌ పాల్‌ ఎక్కడ ఉన్నాడనే సమాచారం షూటర్లకు అందించింది విజయ్ మిశ్రానే అనేది పోలీసుల ఆరోపణ.

ఏళ్లుగా కొనసాగుతున్న కేసు

రాజు పాల్, అతీక్ అహ్మద్ మధ్య 2002లో వార్ మొదలైంది. 2002లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అలహాబాద్ వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీఎస్పీ నుంచి పోటీ చేసిన రాజుపాల్..  ఎస్పీ అభ్యర్థి అతీక్ అహ్మద్ చేతిలో ఓడిపోయారు. అయితే 2004లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన అతీక్.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాడు. దీంతో అలహాబాద్ వెస్ట్ అసెంబ్లీ సీటుకు ఉప ఎన్నిక వచ్చింది. అప్పుడు అతీక్ సోదరుడు మహమ్మద్ ఆశ్రఫ్‌ను ఓడించి తొలిసారి ఎమ్మెల్యేగా రాజు ఎన్నికయ్యారు. కానీ అప్పటి నుంచి ఆయనకు ప్రాణహాని మొదలైంది. 2004లో ఆయనపై రెండు హత్యాయత్నాలు జరిగాయి. అదృష్టవశాత్తు వాటి నుంచి తప్పించుకున్నారు. కానీ ఒక సారి తీవ్రంగా గాయపడ్డారు. 2005 జనవరిలో రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్తున్న రాజు పాల్‌పై పట్టపగలే కాల్పులు జరిపి చంపేశారు. ఆ కేసు ఇప్పటికీ కొనసాగుతోంది. తర్వాత మరోసారి జరిగిన ఉప  ఎన్నికలో రాజు పాల్ భార్య పోటీ చేసినా.. అతీక్ సోదరుడు ఆశ్రఫ్‌నే గెలిచాడు.

పోలీసులు, మీడియా ఎదుటే హతం

రాజు పాల్ హత్య తర్వాత అతీక్ అహ్మద్ సామ్రాజ్యం మరింత విస్తరించింది. తన కొడుకులు, తమ్ముడితో కలిసి ఎన్నో ఘోరాలకు పాల్పడ్డాడు. ఈ క్రమంలో రాజ్ పాల్ అనుచరుడు ఉమేశ్ పాల్‌ను కూడా అతీక్ సోదరులు గత ఫిబ్రవరిలో హత్య చేయించారు. అది జరిగిన రెండు నెలల తర్వాత అతీక్ అహ్మద్, అతడి సోదరుడు ఆశ్రఫ్‌ హతమయ్యారు. గత ఏప్రిల్‌లో అతీక్, ఆశ్రఫ్‌ను మెడికల్ చెకప్ కోసం ప్రయాగ్‌రాజ్‌లోని ఓ ఆసుపత్రికి పోలీసులు తీసుకెళ్లారు. వాళ్లను తీసుకెళ్తున్న సమయంలో మీడియా మాట్లాడేందుకు ప్రయత్నించింది. ఈ సమయంలో పోలీసుల సమక్షంలో, మీడియా కెమెరాల ఎదుటే దుండగులు కాల్పులకు దిగారు. జర్నలిస్టుల ముసుగులో వచ్చి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దీంతో అతీక్, ఆశ్రఫ్ అక్కడికక్కడే చనిపోయారు. తర్వాత ఘటనాస్థలిలోనే ముగ్గురు నిందితులు లొంగిపోయారు. అప్పట్లో ఘటన సంచలనం రేపింది. అతీక్ హత్యకు రెండు మూడు రోజుల ముందు.. అతడి కొడుకు అసద్‌ను పోలీసులు ఎన్‌కౌంటర్‌‌ చేయడం గమనార్హం.