ప్రతిపక్షాల ప్రధాని అభ్యర్థిగా కేజ్రీవాల్ ఉండాలి

ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి పార్టీలు ఆగస్టు 31, సెప్టెంబర్ 1వ తేదీల్లో ముంబైలో సమావేశం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆప్ జాతీయ అధికార ప్రతినిధి కీలక వ్యాఖ్యలు చేశారు.  ఎన్నికలకు సమయం దగ్గర పడే కొద్దీ.. ప్రతిపక్షలు ఒక్క చోటుకు చేరుతున్నాయి. కేంద్రంలోని అధికార బీజేపీని ఎదుర్కొనేందుకు అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే కొన్ని రోజుల కిందట ‘ఇండియా’ పేరుతో కూటమిని ఏర్పాటు చేశాయి. వచ్చే ఎన్నికల్లు ఇండియా వర్సెస్ ఎన్డీయే అని ప్రకటించాయి. కాంగ్రెస్, […]

Share:

ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి పార్టీలు ఆగస్టు 31, సెప్టెంబర్ 1వ తేదీల్లో ముంబైలో సమావేశం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆప్ జాతీయ అధికార ప్రతినిధి కీలక వ్యాఖ్యలు చేశారు. 

ఎన్నికలకు సమయం దగ్గర పడే కొద్దీ.. ప్రతిపక్షలు ఒక్క చోటుకు చేరుతున్నాయి. కేంద్రంలోని అధికార బీజేపీని ఎదుర్కొనేందుకు అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే కొన్ని రోజుల కిందట ‘ఇండియా’ పేరుతో కూటమిని ఏర్పాటు చేశాయి. వచ్చే ఎన్నికల్లు ఇండియా వర్సెస్ ఎన్డీయే అని ప్రకటించాయి. కాంగ్రెస్, కమ్యూనిస్టులు, టీఎంసీ, ఆప్, డీఎంకే, ఎన్సీపీ, శివసేన (ఉద్ధవ్) జేడీయూ తదితర పార్టీలు ఈ కూటమిలో భాగమయ్యాయి. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సమాలోచనలు చేస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు ప్రతిపక్షాల ప్రధాని అభ్యర్థి ఎవరనేది ఇంకా ప్రకటించలేదు. రాహుల్ గాంధీ పేరు ప్రముఖంగా వినిపిస్తున్నా.. ప్రతిపక్షాల ఐక్యత దెబ్బతింటుందనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ నేత ఒకరు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాల ప్రధాని అభ్యర్థిగా ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్‌ను ప్రకటించాలని ప్రతిపాదన చేశారు. 

అందరూ ఆయన్నే కోరుకుంటున్నారు

ప్రతిపక్షాల ‘ఇండియా’ కూటమి ప్రధాని అభ్యర్థిగా ఆప్ జాతీయ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ ఉండాలని ప్రియాంక కక్కర్ అన్నారు.  ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్న ప్రియాంక కక్కర్.. పీటీఐ వార్తా సంస్థ అడిగిన ప్రశ్నకు ఈ విధంగా సమాధానమిచ్చారు. ఢిల్లీలో ఇప్పటివరకు లాభదాయక, ప్రజామోద బడ్జెట్‌ను కేజ్రీవాల్ ప్రవేశపెట్టారని, ప్రజలకు లబ్ధి చేకూర్చే మోడల్‌ను అందించారని చెప్పారు. ఢిల్లీలో ద్రవ్యోల్బణం కనిష్ఠంగా ఉందని అన్నారు. పీఎం అభ్యర్థిగా కేజ్రీవాల్ ఉండాలని తాను కోరుకుంటున్నానని, అయితే నిర్ణయం తన  చేతుల్లో లేదని చెప్పుకొచ్చారు.

మరోవైపు ఇదే విషయంపై ఆప్ ఢిల్లీ కన్వీనర్ గోపాల్‌ రాయ్‌ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి పార్టీ కూడా తమ నేతనే ప్రధాన మంత్రిగా చూడాలని కోరుకుంటోందని చెప్పారు. కేజ్రీవాల్ పీఎం కావాలని ఆప్ కోరుకుంటోందని తెలిపారు. అయితే ఈ విషయంపై కూటమిలోని అన్ని పార్టీలు ఓ నిర్ణయం తీసుకుంటాయని, దీనికి అనుగుణంగా ముందుకు వెళ్తామని చెప్పారు. 

రేసులో కేజ్రీవాల్ లేరు

ప్రతిపక్షాల ప్రధాన మంత్రి అభ్యర్థి రేసులో ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ లేరిన ఆప్ స్పష్టం చేసింది. తమ పార్టీ నేత ప్రియాకం చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమని చెప్పింది. ‘‘ఆప్ ఇప్పుడు ప్రతిపక్షాల కూటమితో ఉంది. భారతదేశాన్ని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సిన అవసరం ఉంది. ఎవరో ప్రధాన మంత్రి లేదా మంత్రి కావడం కోసం ఈ కూటమిలో ఆప్ భాగం కాలేదు. దేశం కోసమే కూటమిలో చేరాం. అర్వింద్ కేజ్రీవాల్ ప్రధాన మంత్రి అభ్యర్థి కాదు” అని ఢిల్లీ మంత్రి, ఆప్ నేత అతిషీ స్పష్టం చేశారు. 

కూటమిలోకి మరికొన్ని పార్టీలు?

జాతీయ స్థాయిలో బీజేపీని ఎదుర్కొనేందుకు ‘ఇండియా’ కూటమి ఏర్పాటైంది. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, భవిష్యత్ ప్రణాళిక, కూటమి లోగో వంటి అంశాలపై కీలకంగా చర్చించేందుకు ఆగస్టు 31, సెప్టెంబర్ 1 వ తేదీల్లో ముంబై వేదికగా కూటమి పార్టీలు సమావేశం కానున్నాయి. ఈ కూటమిలోకి కొత్తగా మరికొన్ని పార్టీలు చేరబోతున్నాయని తెలుస్తోంది. తమ ప్రధాని అభ్యర్థిని ఎన్నికల తర్వాతే నిర్ణయిస్తామని కూటమి నేతలు ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆప్‌నకు చెందిన ఇద్దరు నేతలు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.