కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో  పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితా విడుదల చేసిన బీజేపీ

నామినేషన్‌ల గడువు ముగిసేందుకు కొన్ని గంటల ముందు బీజేపీ.. పెండింగ్‌లో ఉన్న స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. బీజేపీలో రెండు స్థానాలు పెండింగ్‌లో ఉంచగా..  బుధవారం రాత్రి అభ్యర్థులను ప్రకటించారు. మాన్వి నియోజకవర్గానికి బీవీ నాయక్‌ను, శివమొగ్గకు చన్నబసప్పను ఖరారు చేశారు. శివమొగ్గ స్థానం నుంచి వరుసగా సీనియర్‌నేత కేఎస్‌ ఈశ్వరప్ప ప్రాతినిధ్యం వహిస్తుండేవారు. ఆయనకు టికెట్‌ ఇచ్చేది లేదని అధిష్టానం సూచించిన మేరకు ప్రత్యక్ష రాజకీయాలకు ఆయన గుడ్‌బై చెప్పారు. చివరి క్షణందాకా ఈశ్వరప్ప కుమారుడు […]

Share:

నామినేషన్‌ల గడువు ముగిసేందుకు కొన్ని గంటల ముందు బీజేపీ.. పెండింగ్‌లో ఉన్న స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. బీజేపీలో రెండు స్థానాలు పెండింగ్‌లో ఉంచగా..  బుధవారం రాత్రి అభ్యర్థులను ప్రకటించారు. మాన్వి నియోజకవర్గానికి బీవీ నాయక్‌ను, శివమొగ్గకు చన్నబసప్పను ఖరారు చేశారు. శివమొగ్గ స్థానం నుంచి వరుసగా సీనియర్‌నేత కేఎస్‌ ఈశ్వరప్ప ప్రాతినిధ్యం వహిస్తుండేవారు. ఆయనకు టికెట్‌ ఇచ్చేది లేదని అధిష్టానం సూచించిన మేరకు ప్రత్యక్ష రాజకీయాలకు ఆయన గుడ్‌బై చెప్పారు. చివరి క్షణందాకా ఈశ్వరప్ప కుమారుడు కాంతరాజు టికెట్‌ వస్తుందని భావించారు. అనూహ్యంగా చన్నబసప్ప పేరు ఖరారైంది. 

224 స్థానాలు కలిగిన కర్ణాటక అసెంబ్లీకి బీజేపీ నాలుగు విడతల్లో అభ్యర్థులను ప్రకటించింది. తొలి విడతలో 189 మంది అభ్యర్థులను ప్రకటించింది. రెండో విడతలో 23 మంది అభ్యర్థులకు సీట్లు కేటాయించిన బీజేపీ.. మూడో విడతలో పది మంది స్థానాలను ఖరారు చేసింది. మిగిలిన రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించకపోవడంతో ఆసక్తి రేగింది. అయితే.. నామినేషన్ గడువు ముగిసేందుకు కొన్ని గంటల ముందు పెండింగ్ ఉన్న రెండు స్థానాలకు బీజేపీ అధిష్టానం అభ్యర్థులను ఖరారు చేసింది.

సార్వత్రిక ఎన్నికలకు సరిగ్గా ఏడాది సమయం ఉన్న వేళ.. దేశం మొత్తం దృష్టి ఇప్పుడు కర్ణాటక ఎన్నికలపై పడింది. కర్ణాటక అసెంబ్లీకి మొత్తం 224 నియోజకవర్గాల పోలింగ్ ఒకే విడతలో నిర్వహించనున్నారు. దాంతోపాటు ఈసారి తొలిసారిగా 80 ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగులకు ఓట్ ఫ్రం హోమ్ సౌకర్యం కల్పించబోతున్నారు. రాష్ట్రంలో మొత్తం 5.21 కోట్లమంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుష, మహిళా ఓటర్ల సంఖ్య దాదాపుగా సమానం. 80 ఏళ్ల వయస్సు దాటిన వృద్ధులు, దివ్యాంగులు మొత్తం 12.15 లక్షల మంది ఉన్నారు. వీరందరికీ తొలిసారిగా ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పిస్తున్నారు. గిరిజన ఓటర్లకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

అటు.. దక్షిణాదిలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన ఏకైక రాష్ట్రం కర్ణాటకలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసి ప్రచారంలోకి దిగిపోయారు. ఓ వైపు టికెట్ దక్కని అసంతృప్తులు , మరోవైపు పెరుగుతున్న ప్రచార ఉధృతి. మరోసారి అధికారం కోసం చూస్తున్న బీజేపీ..ప్రధాని మోదీతో పలు ర్యాలీలు నిర్వహించనుందని తెలుస్తోంది. 

కర్ణాటక ఎన్నికల కోసం అధికార బీజేపీ స్టార్ క్యాంపెయినర్ జాబితా సిద్ధం చేసింది. ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి సహా సమర్ధవంతులైన కేంద్రమంత్రులతో 40 మంది జాబితా తయారు చేసింది..

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ అన్ని విధాలా సంసిద్ధమౌతోంది. ప్రభుత్వంపై ఉన్న అవినీతిని కప్పిపుచ్చేందుకు మోదీ మేనియా వినియోగించాలని నిర్ణయించుకుంది. ప్రధాని నరేంద్ర మోదీతో రాష్ట్రవ్యాప్తంగా 20 ప్రాంతాల్లో సభలు లేదా ర్యాలీలు నిర్వహించనున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ప్రధాని మోదీ పర్యటన వివరాలు అందించారు. రాష్ట్రంలో మోదీ పర్యటన దాదాపుగా ఖరారైందన్నారు. ఎక్కువగా సభల్లో పాల్గొంటారని..మరికొన్ని ప్రాంతాల్లో రోడ్ షోలు ఉంటాయన్నారు.

అటు.. కర్ణాటక ప్రజలు విధాన సభ ఎన్నికల్లో వేర్వేరు పార్టీలకు మెజార్టీ స్థానాలను కట్టబెట్టడం ఆనవాయితీగా వస్తోంది. దీంతో ఈసారి అధికారం తమదేనని, పూర్తి మెజార్టీ సాధిస్తామని కాంగ్రెస్ చెబుతోంది. అయితే తాము కాంగ్రెస్‌ కంటే 7-10 సీట్లతో ఆధిక్యంలోకి వస్తామని గ్రౌండ్‌ రిపోర్ట్స్ చెబుతున్నాయని రాష్ట్ర బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. 

కర్టాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు మే 10న జరగనున్నాయి. మే 13వ తేదీన కౌంటింగ్ ఉంటుంది. 

ఎన్నికల షెడ్యూల్ ఇలా..

ఏప్రిల్ 13న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

ఏప్రిల్ 20 నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ

ఏప్రిల్ 21 న నామినేషన్ల పరిశీలన

ఏప్రిల్ 24న నామినేషన్ల ఉపసంహరణ

మే 10న పోలింగ్

మే13న ఓట్ల లెక్కింపు