చంద్రబాబు చేసిందదే: జ‌గ‌న్

ఏ ఏపీలో రాజకీయాలు రసవతర్తంగా మారాయి. ఇటు అధికార వైసీపీతో పాటుగా అటు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ కూడా ఏ మాత్రం తగ్గడం లేదు. ఎవరికి తోచిన విధంగా వారు రాజకీయాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక మొన్నటి వరకు రాజకీయం ఒక రేంజ్ లో ఉండేది అంటే మొన్నటి నుంచి రాజకీయం మరో రేంజ్ లోకి మారిపోయింది. ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును వైసీపీ ప్రభుత్వం అరెస్ట్ చేయడంతో సీన్ పూర్తిగా […]

Share:

ఏ ఏపీలో రాజకీయాలు రసవతర్తంగా మారాయి. ఇటు అధికార వైసీపీతో పాటుగా అటు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ కూడా ఏ మాత్రం తగ్గడం లేదు. ఎవరికి తోచిన విధంగా వారు రాజకీయాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక మొన్నటి వరకు రాజకీయం ఒక రేంజ్ లో ఉండేది అంటే మొన్నటి నుంచి రాజకీయం మరో రేంజ్ లోకి మారిపోయింది. ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును వైసీపీ ప్రభుత్వం అరెస్ట్ చేయడంతో సీన్ పూర్తిగా మారిపోయింది. తమ నేతనే అరెస్ట్ చేస్తారా? అని టీడీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. కక్ష పూరితంగా కుట్ర పన్ని అరెస్ట్ చేశారంటూ రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నాయి. ఇక చంద్రబాబుకు సీఐడీ కోర్టు కస్టడీ విధించడంతో అతడిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఇక అప్పటి నుంచి రాజకీయం రంగు పూర్తిగా మారిపోయింది. రాజమండ్రి సెంట్రల్ జైల్ ఒక టూరిస్ట్ ప్లేస్ లా మారిపోయింది. చోటా మోటా లీడర్ల నుంచి బడా లీడర్ల వరకు అందరూ జైలులో చంద్రబాబుతో ములాఖత్ కోసం పోటీ పడుతున్నారు. కానీ వారానికి ములాఖత్ రెండు సార్లు మాత్రమే ఉంటుందని దీంతో అందరినీ ములాఖత్ చేయించడం కుదరదని పోలీసులు చెబుతున్నారు. ఇక చంద్రబాబు అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నప్పటి నుంచి ఆయన సతీమణి నారా భువనేశ్వరి, కొడుకు నారా లోకేష్ రాజమండ్రిలోనే మకాం వేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అతడి అరెస్ట్ సరికాదని టీడీపీ వాదిస్తుంటే… లేదు చట్టప్రకారమే అతడి అరెస్ట్ జరిగిందని వైసీపీ నేతలు వాదిస్తున్నారు. 

పొత్తు ప్రకటన చేసిన సేనాని..

అసలే ఏపీలో రాజకీయం హాట్ హాట్ గా ఉందంటే జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసిన రాజకీయ ప్రకటన మరింత హీట్ పెంచింది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి అధికార వైసీపీ దురాగతాలను ఎదుర్కొంటాయని పవన్ ప్రకటించారు. దీంతో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కన్ఫామ్ అని తేలిపోయింది. అవసరం అయితే తమతో పొత్తులో ఉన్న బీజేపీని కూడా టీడీపీతో కలిసి వచ్చేలా ఒప్పిస్తానని జనసేనాని ప్రకటించారు. కొద్ది రోజుల నుంచి టీడీపీ బీజేపీ పార్టీలు లాంగ్ గ్యాప్ మెయింటెన్ చేస్తున్నాయి. దీంతో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయా అనే నిర్ణయంలో సందిగ్దత నెలకొంది. ఇక ఈ కేసు గురించి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ… అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు రాష్ట్ర వనరులను లూటీ చేశాడని, వనరులను లూటీ చేసి తన వాళ్లకు పంచివ్వడమే చంద్రబాబు ప్రధాన లక్ష్యమని ఆరోపించారు. చంద్ర బాబు నాయుడుతో పాటు  పవన్ కల్యాణ్ కూడా వనరులను దోచుకుతిన్నాడని అన్నారు. ఎల్లో మీడియా (కొన్ని మీడియా చానెల్స్) నిజాన్ని ఎందుకు బయటపెట్టవని? ప్రశ్నించారు. భవిష్యత్తులో తమ సామాజిక వర్గానికి చెందిన మీడియా ద్వారా ప్రతిపక్షాలు ప్రచారం చేసే అబద్ధాలను నమ్మొద్దని ఆయన ప్రజలను కోరారు. అందరికీ సామాజిక న్యాయం, ప్రజల సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. 

జాతికి అంకితం చేసిన సీఎం

ముఖ్యమంత్రి కర్నూలు జిల్లాలోని కృష్ణగిరి మండలం ఆలంకొండలో నిర్మించిన లక్కసాగరం పంప్ హౌస్ ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం ఆయన ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ గురించి మాట్లాడుతూ… ఆయన్ను తాము కక్షపూరితంగా అరెస్ట్ చేయలేదని తెలిపారు. సీఐడీ చట్టం ప్రకారం తన పని తాను చేసిందన్నారు. ప్రాజెక్టులు మరియు నిధుల కేటాయింపుల విషయంలో గత ప్రభుత్వం అనుసరించిన విధానాన్ని విమర్శించారు. ముఖ్యంగా అనూహ్య వర్షపాతం నమోదవుతున్న నేపథ్యంలో నీటి నిల్వ ప్రాముఖ్యతను, వాతావరణ మార్పులను ఎదుర్కోవాల్సిన అవసరాన్ని ముఖ్యమంత్రి ఎత్తి చూపారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కుల నుంచి 80 వేల క్యూసెక్కులకు పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, ప్రకాశం వంటి కరువు జిల్లాలను చంద్రబాబు నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగం అభివృద్ధిలో తమ ప్రభుత్వం గణనీయమైన ప్రగతిని సాధించిందని జగన్ పేర్కొన్నారు. తమ ప్రభుత్వం పాఠశాలలను ఆంగ్ల మాధ్యమాలుగా మార్చిందని, నాడు నేడు తో పాఠశాలల రూపురేఖలే మారిపోయాయన్నారు. పాఠశాలల్లో ఐఎఫ్ బీ ప్యానెల్లు మరియు టాబ్లెట్‌ ల వంటి సాంకేతికతను ప్రవేశపెట్టామని ఉద్ఘాటించారు.